మృతులకూ పరీక్షలు

ABN , First Publish Date - 2020-05-27T07:45:55+05:30 IST

ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఇంటికి పంపే ముందు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని...

మృతులకూ పరీక్షలు

  • చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టీకరణ
  • కరోనా టెస్టులపై ప్రభుత్వ ఉత్తర్వులు కొట్టివేత
  • లక్షణాలు లేకున్నా కాంటాక్టులందరికీ పరీక్షలు చేయాలి
  • ఈ నెల 25వ తేదీ వరకు ఎన్ని పరీక్షలు చేశారు?
  • పరీక్షలు చేయకుండా రెడ్‌జోన్లను మారుస్తారా?
  • నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం

హైదరాబాద్‌/సూర్యాపేట, మే 26 (ఆంధ్రజ్యోతి): ఆస్పత్రుల్లో చనిపోయిన వారి మృతదేహాలను ఇంటికి పంపే ముందు కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. మృతుల నుంచి నమూనాలు సేకరించి కరోనా నిర్ధారణ పరీక్షలు జరపరాదంటూ ఏప్రిల్‌ 20న రాష్ట్ర వైద్య,ఆరోగ్య, శాఖ జారీచేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. మృతులకు పరీక్షలు చేయకుంటే వారి బంధువులకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈనెల 1నుంచి 25 వరకు మొత్తం ఎన్ని టెస్టులు చేశారు? లక్షణాలు లేనివారికి ఎన్ని? హైరిస్క్‌ ఉన్నవారికి ఎన్ని? పాజిటివ్‌ కేసులు ఎన్ని? తదితర వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


తెలంగాణకు ఎంత మంది వలస కార్మికులు వచ్చారు? ఎంతమందికి కరోనా పరీక్షలు చేశారు? ఎన్ని పాజిటివ్‌ కేసులు వచ్చాయి? వారిని క్వారంటైన్‌ చేశారా?లేదా? అనే వివరాలు పొందుపర్చాలని స్పష్టం చేసింది. రెడ్‌జోన్‌ ప్రాంతాలను ఆరెంజ్‌ జోన్లుగా, ఆరెంజ్‌ జోన్లను గ్రీన్‌జోన్లగా మార్చడానికి గల కారణాలు వివరించాలని స్పష్టం చేసింది. ఎటువంటి పరీక్షలు చేయకుండా రెడ్‌జోన్లను ఆరెంజ్‌ జోన్లుగా ఎలా ప్రకటిస్తారని కోర్టు ప్రశ్నించింది. సూర్యాపేట, నిర్మల్‌ జిల్లాల కలెక్టర్లు వేర్వేరు నివేదిక ఇవ్వాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ (జూన్‌ 4)నాటికి నివేదికలు కోర్టు ముందుంచేలా చూడాలని ఏజీ బీఎస్‌ ప్రసాద్‌కు చెప్పింది. సూర్యాపేట జిల్లా సహా రాష్ట్రమంతటా కరోనా పరీక్షలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.


ఆకుచాటున వాస్తవాలు దాచలేరు!

పలుదేశాల్లో కరోనా వైరస్‌ ప్రభావం చూపుతోంది. లక్షల మంది దాని బారిన పడుతున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశంలోనే మరణాల సంఖ్య లక్షకు చేరుకుంది. వైద్యరంగంలో భారత్‌ అంత అభివృద్ధి చెందలేదు. అయినా కొన్ని జాగ్రత్తలు పాటిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఇంకా పరీక్షల్లోనే ఉంది. ఆకుచాటున వాస్తవాలను ప్రభుత్వం దాచిపెట్టలేదు. ఆర్థిక ఇబ్బందులు చూపి తప్పించుకోజాలదు. ప్రజల ప్రాణాలు కాపాడడమే సుపరిపాలన.

- హైకోర్టు ధర్మాసనం


Updated Date - 2020-05-27T07:45:55+05:30 IST