Abn logo
Mar 10 2020 @ 12:53PM

కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలంటే..

అంతటా కరోనా కలకలమే!

ఏ మాస్క్‌ ధరించాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి?

కరోనా నుంచి ఎలా తప్పించుకోవాలి? 

ఎక్కడ చూసినా ఇదే గందరగోళం!

అయితే అంతగా భయపడవలసిన అవసరం లేదనీ,

అవగాహనతో అప్రమత్తంగా మెలిగితే చాలనీ అంటున్నారు వైద్యులు!


రోగనిరోధకశక్తి తగ్గితే ఏకు లాంటి ఆరోగ్య సమస్య కాస్తా మేకు అవుతుంది. చికిత్సకు లొంగకపోగా త్వరత్వరగా వ్యాధి ముదిరిపోతుంది. కరోనా విషయంలో ఇదే జరుగుతోంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే పిల్లలు, వృద్ధులకు కరోనా వైరస్‌ తేలికగా సోకే అవకాశాలు ఎక్కువ. వీళ్లతో పాటు ఊపిరితిత్తుల సమస్యలు కలిగినవాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు,  వ్యాధినిరోధకశక్తి సన్నగిల్లేలా చేసే జబ్బులకు (కేన్సర్‌) లోనయినవాళ్లు జాగ్రత్తపడక తప్పదు. అయితే కొన్ని జబ్బులు పూర్తిగా ఆరోగ్యంగా ఉండేవారినీ వదలవు. అందుకే పూర్తి ఆరోగ్యవంతులు కూడా కరోనాను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. అయితే ఒకసారి సోకితే ఇక మరణమే శరణ్యం అనుకుంటే పొరపాటు. ‘మందులు వాడితే వారం రోజుల్లో, లేదంటే ఏడు రోజుల్లో తగ్గిపోతుంది’ అని జలుబు గురించి ఎలాగైతే చెప్పుకుంటామో, కరోనా కూడా సెల్ఫ్‌ లిమిటింగ్‌ సమస్యే.


కాకపోతే పైన చెప్పుకున్న హై రిస్క్‌ కోవకు చెందిన వాళ్ల శరీరాల్లో కరోనా మరింత వేగంగా విస్తరించి సమస్యను జటిలం చేస్తుంది. మందులతో లొంగదీయడానికి ఈ వైర్‌సను సంహరించే మందులు లేకపోవడం కరోనాకు కలిసివస్తోంది. అయినా ప్రారంభంలోనే కనిపెడితే కరోనా వైర్‌సకు చికిత్స అందరూ అనుకుంటున్నంత కష్టమేమీ కాదు. ఈ వ్యాధి సోకిన ప్రతి ఒక్కరికీ మరణం తప్పదు అనుకుంటే ఇప్పటికి లక్షల సంఖ్యలో మరణాలు సంభవించి ఉండేవి. కానీ అలా జరగడం లేదు కాబట్టి కరోనా గురించిన భయాలు వీడాలి. 


ఈ వైరస్‌ అంతటి భయానకమైనది కానప్పుడు ఇంతలా ఎందుకు ప్రపంచమంతా ఉలిక్కిపడుతోంది? ఎందుకు అంతలా వైరస్‌ సోకిన వారిని ఐసొలేట్‌ చేస్తున్నారు? వైరస్‌ సోకిందనే అనుమానం ఉన్నవారిని కూడా ఎందుకు అబ్జర్వేషన్‌లో పెడుతున్నారు? వైరస్‌ సోకిన వ్యక్తి హై రిస్క్‌ కోవకు చెందిన వ్యక్తి అయినా, ఆరోగ్యవంతుడు అయినా, అతని నుంచి ఇతరులకు వైరస్‌ సోకకుండానే ఈ ముందు జాగ్రత్తలు. అతని ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు, అతని నుంచి ఇతరులకు సోకకుండా ఉండడం కోసం అలాంటి చర్యలు తీసుకోవడం వైద్య చికిత్సావిధానంలో అత్యంత సహజం. మాస్క్‌ ధరించక తప్పదా?

కరోనా పాజిటివ్‌ అనే వార్తలు వెలువడగానే మాస్క్‌ల కోసం పరుగులు తీశాం. కానీ వ్యాధి సోకిన వారితో సన్నిహితంగా మెలిగే వైద్యులు, కేర్‌ టేకర్లు మాత్రమే ఎన్‌95 రకం మాస్క్‌ ధరించాలి. పైగా ఈ వైరస్‌ గాలితో విస్తరించే వీలు లేదు కాబట్టి ఎల్లవేళలా తప్పనిసరిగా మాస్క్‌ ధరించవలసిన అవసరమూ లేదు. కాకపోతే ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టినప్పటి నుంచి, ఎవరికి కరోనా సోకిందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నప్పుడు, రక్షణ కోసం మాస్క్‌ వాడుకోవచ్చు. అయితే అందుకోసం ఎలాంటి మాస్క్‌ అయినా సురక్షితమే! రుమాలును కట్టుకున్నా వైరస్‌ నుంచి రక్షణ పొందవచ్చు. స్వీయ శుభ్రత ముఖ్యం!

వైరస్‌ నేరుగా ముక్కులోకి ప్రవేశించే వీలు కంటే, చేతుల ద్వారా ముక్కుకు చేరే అవకాశం ఎక్కువ. దగ్గినా, తుమ్మినా చేతిని అడ్డం పెట్టుకుంటూ ఉంటాం. అవే చేతులతో వస్తువులను తాకుతాం. ఇలా వ్యాధికారక వైరస్‌ రోగి నుంచి ఇతరులకు వ్యాపించే వీలుంది. కరోనా విషయంలోనూ ఇలా జరిగే అవకాశం ఉంది. సాధారణ జలుబు, దగ్గులను పోలిన లక్షణాలతో బాధపడేవారిలో ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో కనిపెట్టలేం కాబట్టి, జాగ్రత్తగా ఉండక తప్పదు. ముఖానికి మాస్క్‌ ధరించడంతో పాటు, తప్పనిసరిగా, తరచుగా చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండాలి. చేతులతో ముఖాన్ని తాకడం చేయకూడదు. సాధ్యమైనంతవరకూ కరచాలనాలు చేయడం, తలుపుల నాబ్‌లు, మెట్ల రెయిలింగ్‌లు, లిఫ్ట్‌ బటన్స్‌ తాకడం చేయకపోవడమే మంచిది. అలాగే జనసమ్మర్ధం ఎక్కువగా ఉండే సినిమాహాళ్లు, విమానాశ్రయాలు లాంటి ప్రదేశాలకు దూరంగా ఉండాలి.తుంపర్లే ప్రమాదం!

కరోనా గాలిలో విస్తరించే వైరస్‌ కాదు. వైరస్‌ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు వెలువడి, వాటిని ఎదుటి వ్యక్తి పీల్చినప్పుడు మాత్రమే వైరస్‌ సోకుతుంది. ఆ ఎదుటి వ్యక్తి పూర్తి ఆరోగ్యవంతుడే అయిన పక్షంలో వైరస్‌ సోకినా సాధారణ జలుబు మాదిరి కొద్ది రోజులు ఇబ్బంది పెట్టి తగ్గిపోవచ్చు కూడా! ఇంకొందరికి చికిత్సతో తగ్గిపోవచ్చు. రిస్క్‌ తీసుకోవడానికి వీలు లేని వ్యాధి కాబట్టి ముందు జాగ్రత్తగా వ్యాధి సోకిన వారికి దూరంగా ఉండడమే మేలు.


- డాక్టర్‌ నాగరాజు బోయిళ్ల,

సీనియర్‌ పల్మనాలజిస్ట్‌,

పార్థివ్‌ లంగ్‌ కేర్‌ సెంటర్‌