71 వేల మందిలో కరోనా లక్షణాలు

ABN , First Publish Date - 2022-01-23T08:45:40+05:30 IST

తెలంగాణలో రెండో రోజూ ఫీవర్‌ సర్వే కొనసాగింది. శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 71,066 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు.

71 వేల మందిలో కరోనా లక్షణాలు

  • రెండు రోజుల్లో మొత్తం 1.28 లక్షల మందిలో గుర్తింపు
  • 1.27 లక్షల మందికి హోం ఐసొలేషన్‌ కిట్లు
  • మరో 3 రోజులు ఫీవర్‌ సర్వే.. రాష్ట్రంలో 4393 కొత్త కేసులు
  • దేశంలో కొత్తగా 3.37 లక్షల కొవిడ్‌ కేసులు.. స్వల్ప తగ్గుదల
  • మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడకు రెండోసారి కొవిడ్‌
  • కరోనా నుంచి కోలుకున్న మూడు నెలల తర్వాతే టీకా
  • భిన్న వర్గాల అభ్యర్థనల నేపథ్యంలో కేంద్రం స్పష్టత


ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌: తెలంగాణలో రెండో రోజూ ఫీవర్‌ సర్వే కొనసాగింది. శనివారం రోజున రాష్ట్రవ్యాప్తంగా 71,066 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 70,906 మందికి హోం ఐసొలేషన్‌ కిట్లు అందించారు. గత రెండురోజుల వ్యవధిలో 29.26 లక్షల ఇళ్లలో ఫీవర్‌ సర్వే జరగగా, మొత్తం 1.28 లక్షల మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 1.27 లక్షల మందికి కరోనా కిట్లు అందించారు. మరో మూడురోజుల పాటు జ్వర సర్వే రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనుంది. రాష్ట్రంలో వరుసగా మూడోరోజూ 4వేలకుపైగా కరోనా కేసులు నిర్ధారణ అయ్యాయి. శనివారం రాష్ట్రవ్యాప్తంగా 1,16,224 మందికి టెస్టులు చేయగా, 4,393 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 7.31 లక్షలకు పెరిగింది. మరో ఇద్దరు కరోనాతో మరణించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,199 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా హైదరాబాద్‌లో 1643, ఖమ్మంలో 128, మేడ్చల్‌లో 421, రంగారెడ్డిలో 286, సంగారెడ్డిలో 89, హన్మకొండలో 184 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శనివారం 2.61 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. శనివారం కరోనా నిర్ధారణ అయిన ప్రముఖుల్లో రాష్ట్ర ప్రణాళికా సంఘంవైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌, కరీంనగర్‌ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ ఉన్నారు. మాసబ్‌ట్యాంక్‌లోని దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లో కరోనా కలకలం రేగింది. ఈనేపథ్యంలో సందర్శకులపైనా ఆంక్షలు విధించారు. సిరిసిల్లజిల్లా చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అఫ్జల్‌ బీ (66)కి కరోనా సోకిందని తెలియడంతో ఆందోళనకు గురై గుండెపోటుతో మృతిచెందింది. 


ఇద్దరు ‘పాజిటివ్‌’ గర్భిణులకు ప్రసవం 

కరోనా పాజిటివ్‌ వచ్చిన గర్భిణికి కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో వైద్యులు శనివారం ప్రసవం చేశారు. గైనకాలజిస్ట్‌ డాక్టర్‌ వాణిలత, సూపరింటెండెంట్‌ రాజేందర్‌రెడ్డి, ఆర్‌ఎంవో సుధాకర్‌రావు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి అపర్ణకు నార్మల్‌ డెలివరీ అయ్యేలా చూశారు. అపర్ణకు పాప జన్మించింది. మహారాష్ట్రలోని ధర్మాబాద్‌కు చెందిన కొవిడ్‌ బారినపడ్డ గర్భిణికి నిర్మల్‌ జిల్లా భైంసా ఏరియా ఆస్పత్రిలో శనివారం తెల్లవారుజామున ప్రసవం చేశారు. కొవిడ్‌ చికిత్సలకు కీలకమైన గచ్చిబౌలిలోని టిమ్స్‌ ఆస్పత్రిలో 113 వైద్యుల పోస్టుల భర్తీకి ఆ సంస్థ డైరెక్టర్‌ శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ నెల 27 నుంచి 29 వరకు వాకిన్‌ ఇంటర్వ్యూలు ఉంటాయని పేర్కొన్నారు. 


మరణించిన మహిళకు రెండో డోసు!

ఆమె పేరు కుడుగుంట నాగమణి. నెలన్నర క్రితమే మృతి చెందింది. అంతకు రెండు నెలల ముందు కొవిడ్‌ టీకా తొలి డోసు అందుకున్న ఆమెకు.. తాజాగా ఈ నెల 18న రెండో డోసు వేసినట్లు ఆమె కుమారుడికి మెసేజ్‌ వచ్చింది. అంతేనా.. వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ కూడా వచ్చేసింది. ఇది చూసిన ఆమె భర్త.. కంగుతిన్నాడు. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం కల్కోడ గ్రామంలో ఈ ఘటన జరిగింది. నెలన్నర రోజుల కిందట మృతిచెందిన నాగమణికి.. తాజాగా కొవిడ్‌ టీకా రెండో డోస్‌ వేసినట్లు మెసేజ్‌ వచ్చింది. అలాగే, ఆమె భర్త దశరథ్‌కు కూడా రెండో డోసు తీసుకోకుండానే ఇలాంటి మెసేజ్‌ వచ్చింది. 

Updated Date - 2022-01-23T08:45:40+05:30 IST