శవాలను అలా అప్పగిస్తే ఎలా?

ABN , First Publish Date - 2020-07-11T08:57:02+05:30 IST

రంగారావు (64) పేరు మార్చాం. కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం చాతిలో నొప్పి..

శవాలను అలా అప్పగిస్తే ఎలా?

ఒకటి, రెండు ఆస్పత్రుల్లో అదే తీరు

గుట్టుచప్పుడు కాకుండా అప్పగింత

కుటుంబాలూ అదే రీతిలో అంత్యక్రియలు


కూకట్‌పల్లి/హైదరాబాద్‌ సిటీ, జూలై 10 (ఆంధ్రజ్యోతి)  : రంగారావు (64) పేరు మార్చాం. కూకట్‌పల్లిలో నివసిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం చాతిలో నొప్పి రావడంతో దగ్గరలో ఉండే ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. కరోనా లక్షణాలు ఉన్నాయని అనుమానించారు. పరీక్షలు నిర్వహించిన గంటకే ఆ వ్యక్తి చనిపోయాడు. గుండెపోటు లేదా మరేదైనా ఇతర అనారోగ్య కారణాలతో మృతి చెంది ఉంటారని పేర్కొంటూ వైద్యులు శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. తమ సొంతూరైన ఏపీలోని మంగళగిరి ప్రాంతానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. కానీ, మృతదేహానికి ఏపీ బోర్డర్‌లో పరీక్షలు నిర్వహిస్తే  అందరికీ తెలుస్తుందన్న  భయంతో  బుధవారం మధ్యాహ్నం బోయిన్‌పల్లిలో అంత్యక్రియలు నిర్వహించారు.


కరోనా ఉందని నిర్ధారిస్తే....

గ్రేటర్‌లో ఒకటి రెండు ఆస్పత్రులు కరోనా అనుమానితుల మృతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులకు సమాచారం అందిస్తే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయని భావించి ఆయా ఆస్పత్రులు గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని అప్పగించి చేతులు దులుపుకుంటున్నాయి. మృతిచెందిన వ్యక్తి కరోనా లక్షణాలతోనే చనిపోయాడని నిర్దారిస్తే జీహెచ్‌ఎంసీ, పోలీసు, వైద్య శాఖ, సదరు ఆస్పత్రి పర్యవేక్షణలో ఖననం చేయాలనే  నిబంధనలు ఉన్నాయి. అందుకని కరోనా అని నిర్ధారించకుండానే మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ఈ అంశంపై అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరముంది. ఆస్పత్రులకు కూడా కరోనా మరణాల విషయంపై అవగాహన కల్పించాలి.  కరోనాతో మృతిచెందిన వారిని నిబంధనల ప్రకారం  అంత్యక్రియలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. 


కార్డియాక్‌ అరెస్టుతో..

గుండెలో నొప్పి వచ్చినా.. బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఆస్పత్రికి వచ్చినా.. ముందుగా కరోనా పరీక్షలు చేయాలి. ఏ మాత్రం లక్షణాలున్నా రోగిని కరోనా చికిత్స అందించే ఆస్పత్రికి తరలించాలి. ఒక వేళ ఆస్పత్రిలో చనిపోతే నమునాలు సేకరించి నిర్ధారించాకే మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాలి. కానీ ఆస్పత్రులు నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఎవరైనా చనిపోతే కార్డియాక్‌ అరెస్టుగా చెప్పి మృతదేహాన్ని అప్పగిస్తున్నారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు కూడా కరోనాతో మృతిచెందినట్లు చెప్పుకునేందుకు ముందుకు రావడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.

Updated Date - 2020-07-11T08:57:02+05:30 IST