పెరుగుతున్న అనుమానిత కేసులు

ABN , First Publish Date - 2020-03-28T09:24:07+05:30 IST

జిల్లాలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాకు వచ్చిన ఓ ఫ్రాన్స్‌ దేశస్థుడికి బెంగళూరులో పరీక్షలు ...

పెరుగుతున్న అనుమానిత కేసులు

  • శుక్రవారం ఒక్కరోజే 23..
  • వైద్యకళాశాల ల్యాబ్‌లో పరీక్షలు
  • కర్నూలు జిల్లా నుంచి ఒకే శాంపిల్‌
  • చికిత్సలకు ముందస్తు చర్యలు
  • జిల్లాకు వచ్చిన ఫ్రాన్స్‌ దేశస్థుడికి బెంగళూరులో పాజిటివ్‌
  • అనంతపురం-పుట్టపర్తిలో సంచారంపై అలజడి

అనంతపురం వైద్యం, మార్చి 27: జిల్లాలో కరోనా అనుమానిత కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. జిల్లాకు వచ్చిన ఓ ఫ్రాన్స్‌ దేశస్థుడికి బెంగళూరులో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఆ వ్యక్తి ఈనెల ఒకటో తేదీ జిల్లాకు వచ్చారు. పుట్టపర్తి, అనంతపురం లో తిరుగుతూ ఈనెల 18వరకూ జిల్లాలో గడిపి వెళ్లారు. ఈ విషయం జిల్లా కలెక్టర్‌ అధికారికంగా ప్రకటించారు. ఇటు అధికార యంత్రాంగం, అటు అన్నివర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అధికారయంత్రాంగం అప్రమత్తమై ఆ వ్యక్తి అనంతపురం, పుట్టపర్తిలో ఎక్కడెక్కడ సంచరించారు..? ఏఏ లాడ్జిల్లో బస చేశారు..? ఎవరెవరు ఆయనకు దగ్గరగా ఉంటూవచ్చారు? తదితర వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైంది. ఈ నేపథ్యంలో జిల్లాలో కరోనా అనుమానిత కేసులు అమాంతంగా పెరగడంతో మరింత టెన్షన్‌ మొదలైంది.


శుక్రవారం ఒక్కరోజే 23 అనుమానిత కేసులు

జిల్లాలో ఈనెల 24వ తేదీ వరకూ 13 అనుమానిత కేసులు గుర్తించారు. తిరుపతిల్యాబ్‌కు వారి శాంపిల్స్‌ పంపించగా..నెగిటివ్‌ వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే జిల్లాను ప్రభుత్వం డేంజర్‌ జోన్‌గా గుర్తించింది. దీంతో జిల్లాలోనే కరోనా పరీక్షల నిర్వహణకు వీలుగా వైద్య కళాశాలలోని మైక్రోబయాలజీ ల్యాబ్‌లో ప్రత్యేక ల్యాబ్‌ ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి వచ్చిన అనుమానిత కేసుల శాంపిల్స్‌కు అక్కడే వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అధికారులు తెలిపిన మేరకు.. 24న రెండు, 25న రెండు, 26న మూడు అనుమానిత కేసులకు సంబంధించిన శాంపిల్స్‌ రాగా.. ఇక్కడ పరీక్షలు నిర్వహించారు. వాటికి కూడా నెగిటివ్‌ రావడంతో ఉపశమనం పొందారు. తా జాగా శుక్రవారం ఒక్కరోజే వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాలో 23 అనుమానిత కరోనా కేసుల శాంపిల్స్‌ పంపించారు. ఇందులో ఒక్క హిందూపురం ప్రభుత్వాస్పత్రి నుంచే 20శాంపిల్స్‌ ఉండడం విశేషం. మరో మూడు అనుమానిత శాంపిల్స్‌ జిల్లా సర్వజనాస్పత్రి నుంచి పంపించారు. జిల్లాలో పర్యటించిన ఫ్రాన్స్‌ దేశస్థుడికి కరోనా పాజిటివ్‌ అని తేలడం, ఒక్కసారిగా జిల్లాలో అనుమానిత కేసులు పెరగడంతో జిల్లాలో కలవరం ప్రారంభమైంది. అయితే కర్నూలు జిల్లా నుంచి శుక్రవారం ఒక్క అనుమానిత శాంపిల్స్‌ మాత్రమే జిల్లా ల్యాబ్‌కు రావడం వి శేషం. జిల్లా ఆస్పత్రిలోని ఐసొలేషన్‌ వార్డులో ఐదుగురుండగా.. శుక్రవారం మరో ముగ్గురు చేరడంతో మొత్తం 8 మంది అయ్యారు. వారందరికీ సర్వజనాస్పత్రి వైద్యులు చికిత్సలందిస్తున్నారు.


చికిత్సలకు ముందస్తు చర్యలు..

కరోనా బాధితులకు చికిత్సలందించడానికి అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు వేగవంతం చేసింది. అనుమానిత కేసులు పెరుగుతూండడంతో జిల్లా ఆస్పత్రిలో మరిన్ని వసతులు కల్పిస్తున్నారు. ఆస్పత్రి ఆవరణలోని పాత కాన్పుల విభాగంలో తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకవేళ అనుమానితులు ఎక్కువైతే ప్రస్తుతమున్న ఐసొలేషన్‌ సరిపోదు. దీంతో ముందస్తుగా పాత కాన్పుల వార్డు విభాగాన్ని మరో ఐసొలేషన్‌గా మారుస్తూ అక్కడ విద్యుత్‌, నీరు, మంచాలు, ఫ్యాన్లల తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్‌ కే సులు నమోదైతే వారిని వెంటనే ఇతర ప్రాంతానికి తరలించనున్నారు. ఇందుకోసం శారదానగర్‌లోని సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిలో ప్రత్యేకంగా క్వారంటైన్‌ ఏర్పాటు చేశారు. సుమారు 50మందిని అక్కడ ఉంచి వైద్యచికిత్సలందించడానికి అన్ని వసతులు కల్పించారు. మొత్తమ్మీద జిల్లావాసులు కరోనాతో కంగారు పడుతున్నారనడంలో సందేహం లేదు.


Updated Date - 2020-03-28T09:24:07+05:30 IST