ఒక్కరోజే 6,088

ABN , First Publish Date - 2020-05-23T08:37:15+05:30 IST

ఓవైపు దేశాన్ని చుట్టేసిన కరోనా మరోవైపు మహారాష్ట్రను కుదిపేస్తోంది. వరుసగా ఐదు రోజుల పాటు భారత్‌లో రోజుకు దాదాపు 5 వేల చొప్పున నమోదైన కేసులు శుక్రవారం మరింత...

ఒక్కరోజే 6,088

  • దేశంలో కరోనా విజృంభణ
  • సగం కేసులు మహారాష్ట్రలో
  • రైల్‌ భవన్‌ అధికారి, లోక్‌సభ 
  • సెక్రటేరియట్‌ ఉద్యోగులకూ
  • తమిళనాడులో 786.. ఢిల్లీలో 660..

న్యూఢిల్లీ, ముంబై, మే 22: ఓవైపు దేశాన్ని చుట్టేసిన కరోనా మరోవైపు మహారాష్ట్రను కుదిపేస్తోంది. వరుసగా ఐదు రోజుల పాటు భారత్‌లో రోజుకు దాదాపు 5 వేల చొప్పున నమోదైన కేసులు శుక్రవారం మరింత  పెరిగాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ గణాంకాల ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటల వరకు గడచిన 24 గంటల్లో కొత్తగా 6,088 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజు వ్యవధిలో ఇప్పటివరకు ఇవే గరిష్ఠం. మొత్తం కేసులు 1,18,447కు, తాజా మరణాలు 148 కలిపి మృతుల సంఖ్య 3,583కి చేరాయి. కాగా, రాత్రి 10 గంటలకు రాష్ట్రాల నుంచి అందిన సమాచారం మేరకు కేసులు 1,22,656కు, మృతుల సంఖ్య 3,634కు పెరిగాయి. 4,209 కేసులు, 51 మరణాలు అదనంగా చేరాయి. ఈ నెల 19వ తేదీన 3.13 శాతం ఉన్న మరణాలు శుక్రవారం 3.02 శాతానికి తగ్గాయని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ వివరించారు. ముందు రోజు ఇది 40.32 శాతమని పేర్కొన్నారు. 41 శాతం మంది కోలుకున్నారని తెలిపారు. మొత్తం 27,55,714 మందికి పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) ప్రకటించింది. మహారాష్ట్రలో  అత్యధికం గా 2,940 కేసులు రికార్డయ్యాయి. ఇందులో ముంబైవే 1,751 ఉన్నాయి. ధారావిలో 53 కొత్త కేసులు తేలాయి. ఢిల్లీలో అత్యధిక సంఖ్యలో మరో 660 మంది కొవిడ్‌కు గురయ్యారు. వైర్‌లెస్‌ కంట్రోల్‌ రూమ్‌ పోలీసులు ఏడుగురు, లోక్‌సభ సెక్రటేరియట్‌ ఉద్యోగులు ఇద్దరు, రైల్‌ భవన్‌లో సీనియర్‌ మహిళా అధికారికి పాజిటివ్‌గా తేలింది. తనకు వైరస్‌ సోకినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారి ప్రతినిధి సంజయ్‌ ఝా తెలిపారు. 


ఏపీ నుంచి వెళ్లిన వ్యక్తికి కేరళలో పాజిటివ్‌

కేరళలో అత్యధికంగా 42 కేసులు రికార్డయ్యాయి. వీరిలో 21 మంది మహారాష్ట్ర నుంచి, తమిళనాడు, ఏపీ నుంచి వెళ్లినవారు ఒక్కొక్కరు ఉన్నారు. 17 మంది విదేశాల నుంచి వచ్చినవారు కావడం గమనార్హం. తమిళనాడులో మరో 786 కేసులు నమోదవగా.. ఇందులో చెన్నైవే 569 ఉన్నాయి. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన ఇద్దరు బీదర్‌ వాసులు సహా కర్ణాటకలో 138 మందికి పాజిటివ్‌ వచ్చింది. 


గుజరాత్‌లో నవజాత కవలలకు కరోనా

గుజరాత్‌లోని మెహసనా జిల్లాలో 6 రోజుల  కవలలకు కరోనా సోకింది. ఆ రాష్ట్రంలో వైర్‌సకు గురైన చిన్న వయసు వారు వీరే. కాగా, వీరి తల్లి, మోలిపుర్‌ గ్రామానికి చెందిన గర్భిణి. ఈ నెల 16న వాద్‌నగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. పరీక్షలు జరపగా ఆమెకు వైరస్‌ తేలింది. ముంబై నుంచివచ్చిన ముగ్గురి ద్వారా మోలిపుర్‌లో కరోనా వ్యాపించింది.


పుణెలో ‘టొసిలిజుమాబ్‌’ ఇంజెక్షన్‌

పుణెలో రోగులకు ‘టొసిలిజుమాబ్‌’ ఇంజెక్షన్‌ ఇవ్వడం ద్వారా మంచి ఫలితాలు వస్తున్నాయి. రూ.20 వేల విలువ చేసే ఈ ఇంజెక్షన్‌ను తొలి దశలో ససూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న, ఆరోగ్య పరిస్థితి అంత క్లిష్టంగా లేని 25 మంది రోగులకు ఇచ్చారు. ఫలితాలు బాగుండటంతో మరికొందరికి సైతం ఇవ్వాలని నిర్ణయించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శేఖర్‌ గైక్వాడ్‌ తెలిపారు. ముంబైలోని పలు ఆస్పత్రుల్లోనూ టొసిలిజుమాబ్‌ వాడుతున్నారన్నారు.  


లాక్‌తో కేసులు భారీగా డౌన్‌

సరైన సమయంలో లాక్‌డౌన్‌ విధించడం ద్వారా దేశంలో వైరస్‌ ప్రభావాన్ని బాగా తగ్గించామని కరోనాపై ఏర్పాటైన సాధికార బృందం-1 చైర్మన్‌, నీతీ ఆయోగ్‌ (ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్‌ తెలిపారు. ఏప్రిల్‌ 3 నుంచి కేసుల వృద్ధి, మరణాలు క్రమంగా తగ్గాయని పేర్కొన్నారు. లాక్‌డౌన్‌ లేకుంటే 14 లక్షల నుంచి 23 లక్షల కేసులు నమోదయ్యేవని, 37 వేల నుంచి 78 వేల మంది చనిపోయేవారని అన్నారు. దేశంలో 90పైగా శాతం కేసులు ఐదు రాష్ట్రాల్లోనే, 70 శాతం కేసులు హైదరాబాద్‌ సహా పది నగరాల్లో నమోదైనట్లు వివరించారు. మే 16వ తేదీ నాటికి కేసులు శూన్యానికి చేరతాయని ఏప్రిల్‌లో చెప్పిన పాల్‌.. ఇప్పుడు అలాంటి తేదీ ఏమీలేదని పేర్కొన్నారు. వచ్చే నెల 21-28 మధ్య కాలంలో భారత్‌లో కరోనా తీవ్ర కానుందని, రోజుకు 7 వేల నుంచి 7,500 కేసులు నమోదవుతాయని ఓ అధ్యయనం పేర్కొంది.


కొవిడ్‌ను జయించిన 95 ఏళ్ల వృద్ధురాలు

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో 95 ఏళ్ల వృద్ధురాలు.. వైర్‌సను జయించింది. కరోనాతో ఈ నెల 10న ఆస్పత్రిలో చేరిన వృద్ధురాలు గురువారం డిశ్చార్జి అయింది.   ఆమె కుమారుడు (70) మాత్రం కరోనా లక్షణాలతో మృతి చెందాడు. తీవ్రమైన మోకాళ్ల నొప్పులున్న వృద్ధురాలు కరోనా నుంచి బయటపటం వెనుక ఆమె మనోబలమే కారణమని వైద్యులు తెలిపారు.

Updated Date - 2020-05-23T08:37:15+05:30 IST