Abn logo
Apr 16 2021 @ 01:21AM

3వ తేదీ నుంచి 300కు పైనే.. ఏ రోజూ తగ్గని కరోనా స్పీడు

ఈ నెల 10న అత్యధికంగా 551 కేసులు

బుధవారం 446 కేసుల నమోదు

అధికారిక లెక్కల ప్రకారమే...


ఏప్రిల్‌ నెలలో

తేది కేసులు

1 - 254

2 - 283

3 - 320

4 - 302

5 - 313

6 - 393

7 - 398

8 - 402

9 - 482

10 - 551

11 - 355

12 - 406

13 - 361

14 - 446

---------------------------------

మొత్తం - 5,266

--------------------------------


సెకండ్‌ వేవ్‌ శరవేగంగా విస్తరిస్తోంది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. కొన్ని కుటుంబాల్లో ఇద్దరు నుంచి నలుగురు వరకూ బాధితులు ఉంటున్నారు. ఒకరి నుంచి ఇంకొకరికి శరవేగంగా వైరస్‌ విస్తరిస్తోంది. వైద్య ఆరోగ్య శాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం తాజాగా 446 మందికి కరోనా వైరస్‌ వచ్చినట్లు పేర్కొంది. రెండు వారాలలో గ్రేటర్‌లో మొత్తం 5,266 మంది మహమ్మారి బారిన పడ్డారు. కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటోంది. 

-  హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి)


కార్యాలయాల్లో కలకలం

జీహెచ్‌ఎంసీ అడ్మినిస్ర్టేషన్‌ ఉద్యోగికి..

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) 

లిబర్టీ వద్ద గల జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మళ్లీ కరోనా కలవరం రేగింది. ఇప్పటి వరకు సుమారు 50 మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. తాజాగా జీహెచ్‌ఎంసీ అడ్మినిస్ర్టేషన్‌ విభాగంలో ఓ ఉద్యోగికి పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గురువారం ఆ విభాగాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. ఉద్యోగులందరినీ మధ్యాహ్నమే ఇళ్లకు పంపించారు. అనుమానం ఉన్న వారు పరీక్షలు చేసుకోవాలని సూచించారు. 


కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో...

సికింద్రాబాద్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బోర్డు కార్యాలయంలో ముగ్గురికి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అధికారులు, ఉద్యోగుల్లో ఆందోళన ఏర్పడింది. ఎన్నికల విభాగంలో పని చేస్తున్న ఓ అధికారితో పాటు ఇతర విభాగాలకు చెందిన మరో ఇద్దరికి వైరస్‌ సోకింది. దీంతో కార్యాలయానికి వచ్చే వారికి ఆంక్షలు విధించారు. వివిధ పనుల నిమిత్తం ఒక్కొక్కరుగానే రావాలని, మాస్క్‌ లేకుంటే అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. 


బోడుప్పల్‌ కార్పొరేషన్‌లో జరిమానాలు షురూ..

ఉప్పల్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌పై అవగాహన కల్పిస్తూనే నిబంధనలు ఉల్లంఘించే వారికి బోడుప్పల్‌ కార్పొరేషన్‌ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు. మాస్క్‌ లేకుండా తిరుగుతున్న వారికి రూ. 100 ఫైన్‌ వేస్తున్నారు. కరోనా వ్యాపి నివారణకు కఠినంగా వ్యవహరిస్తున్నట్లు కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 


94 శాతం పోలీసులకు వ్యాక్సిన్‌

హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిఽధిలో ఇప్పటి వరకూ 94 శాతం మంది పోలీస్‌ సిబ్బంది కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ తెలిపారు. కమిషనరేట్‌లో వైద్యుల సమక్షంలో గురువారం ఆయన సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులు, వైద్యులు కరోనా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా పని చేస్తూ ప్రజలకు సేవలందిస్తున్నారన్నారు. సెకండ్‌ వేవ్‌  విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. తెలిసి చేసే అతి చిన్న పొరపాటు, కుటుంబానికి అతిపెద్ద ప్రమాదకారి అవుతుందని హెచ్చరించారు. 


టీకా స్టాక్‌ నిల్‌

అప్పుడు నిర్లక్ష్యం, ఇప్పుడు క్యూ కడుతున్న ప్రజలు

కేపీహెచ్‌బీకాలనీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌ రెండో దశ విజృంభణతో జనం వ్యాక్సిన్‌ వేయించుకునేందుకు ఒకేసారి ఆసక్తి చూపుతున్నారు. దీంతో వ్యాక్సిన్‌ కొరత ఏర్పడింది. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, హైదర్‌నగర్‌, భాగ్యనగర్‌ కాలనీ పరిసర ప్రాంతాల్లో సుమారు 10 ఆస్పత్రుల్లో టీకాలు వేస్తున్నా కోవిషీల్డ్‌ లేదా కో వ్యాగ్జిన్‌ వేస్తున్నారా అంటూ ఆరా తీస్తూ కాలం వెళ్లదీశారు. కొందరు కోవాగ్జిన్‌ అయితేనే వేసుకుంటామని అనే వారని కేపీహెచ్‌బీలోని ఓ ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ప్రస్తుతం ఏదైనా ఫర్వాలేదు అంటూ రోజుకు 50-60 మంది వరకు వస్తున్నారని, ప్రస్తుతానికి కోవాగ్జిన్‌, కోవిషీల్డ్‌ రెండూ తమ వద్ద స్టాక్‌ లేదని చెబుతున్నారు. ప్రస్తుతం కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో వ్యాక్సిన్‌ కొరతతో నగరంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, తోటి ఉద్యోగులకు ఫోన్లు చేసి టీకా కోసం వాకబు చేస్తున్నారు. ప్రజల్లో మార్పు రావడం మంచిదేనని ప్రభుత్వ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 


అందుబాటులో కొవిడ్‌ పడకలు

దాదాపు 1500 ఖాళీ


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి) : కరోనా విస్తరిస్తున్న వేళ ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లను చేసింది. నగరంలో కొవిడ్‌ చికిత్సకు ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, టిమ్స్‌తో పాటు మరికొన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ప్రారంభించింది. రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సందర్భంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. నగరంలో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కొవిడ్‌ పేషెంట్ల సంఖ్య, ఖాళీ బెడ్ల వివరాలు ఇలా ఉన్నాయి. 


గురువారం సాయంత్రం 6 గంటల వరకు : 

- గాంధీ ఆస్పత్రిలో కరోనా రోగుల కోసం 800 పడకలను కేటాయించగా, ప్రస్తుతం 282 మంది చికిత్స పొందుతున్నారు. 518 పడకలు ఖాళీగా ఉన్నాయి.

- టిమ్స్‌లో 1000 పడకలకు గాను 480 మంది చికిత్స పొందుతున్నారు. 520 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి.

- కింగ్‌కోఠిలో 400 పడకల సామర్థ్యం ఉండగా 287 మంది చికిత్స పొందుతున్నారు. 113 పడకలు అందుబాటులో ఉన్నాయి.

- నేచర్‌క్యూర్‌లో 280 పడకల్లో 152 మంది చికిత్స పొందుతున్నారు. మరో 128 పడకలు అందుబాటులో ఉన్నాయి.

- ఎర్రగడ్డ చాతీ వైద్యశాలలో 124 పడకలు ఉండగా 96 మందికి చికిత్స అందిస్తున్నారు. 28 పడకలు ఖాళీగా ఉన్నాయి.

- ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో 220 పడకలు ఉండగా, 35 మంది చికిత్స పొందుతున్నారు. 185 పడకలు అందుబాటులో ఉన్నాయి.

Advertisement

హైదరాబాద్మరిన్ని...

Advertisement