గాలి ద్వారా కరోనా: సాధ్యమేనంటున్న నిపుణులు

ABN , First Publish Date - 2020-08-13T23:14:17+05:30 IST

చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని పేర్కొన్నారు. దగ్గుతూ, చీదుతూ మాట్లాడే వారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని స్పష్టం

గాలి ద్వారా కరోనా: సాధ్యమేనంటున్న నిపుణులు

న్యూఢిల్లీ: గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుందా? కరోనా మహమ్మారి విస్తరిస్తున్న తొలినాళ్ల నుంచి వినిపిస్తున్న ప్రశ్న ఇది. దీనిపై మొదటి నుంచి భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చాలా మంది అలాంటిదేమీ ఉండదని చెప్పుకొచ్చారు. కానీ గాలి ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని అంటున్నారు ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజీ నిపుణులు. గాలి ద్వారా కరోనా 4.8 మీటర్ల దూరం వరకు వ్యాప్తిస్తుందని వారు అంటున్నారు. ప్రస్తుతం పాటిస్తున్న భౌతికదూరం సరిపోదని ప్రపంచవ్యాప్తంగా ఈ మార్గదర్శకాల్లో మార్పులు చేయాలని వైరాలజీ నిపుణులు సూచిస్తున్నారు.


దీనికి సంబంధించి మెడ్‌రెక్సివ్‌లో పరిశోధనా పత్రాన్ని ప్రచురించారు. దీని ప్రకారం.. గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తుందని చెప్పేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫ్లోరిడా విశ్వవిద్యాలయానికి చెందిన వైరాలజీ నిపుణుల బృందం పేర్కొంది. వైరస్ వ్యాప్తి, క్లస్టర్లను అడ్డుకోవాలంటే ఇప్పుడున్న మార్గదర్శకాలను మార్చాలని వారు సూచించారు.


చిన్న చిన్న తుంపర్లలోని కరోనా వైరస్ అణువులు గాల్లో అలాగే ఉంటున్నాయని పేర్కొన్నారు. దగ్గుతూ, చీదుతూ మాట్లాడే వారి సమీపంలోని గాలిని పీల్చడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని స్పష్టం చేశారు.


అయితే గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుందని చెప్పేందుకు ఆధారాల్లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వాదించింది. వివిధ దేశాలకు చెందిన 239 మంది శాస్త్రవేత్తలు తమ వద్ద ఆధారాలు ఉన్నయాని లేఖ రాయడంతో తాజాగా అంగీకరించింది.

Updated Date - 2020-08-13T23:14:17+05:30 IST