రూ.50 లక్షల కోట్ల నష్టం !

ABN , First Publish Date - 2020-06-20T06:02:28+05:30 IST

కోవిడ్‌ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి మూడు నెలల్లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్ల మేర పడిపోనుందని...

రూ.50 లక్షల కోట్ల నష్టం !

  • కరోనా దెబ్బకు జీడీపీ ఢమాల్‌ 
  • భారత్‌ను కుదిపేస్తున్న కొవిడ్‌-19

కోల్‌కతా: కోవిడ్‌ మహమ్మారి భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21) తొలి మూడు నెలల్లో భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) ఏకంగా రూ.40 లక్షల కోట్ల నుంచి రూ.50 లక్షల కోట్ల మేర పడిపోనుందని ఎస్‌బీఐ ప్రధాన ఆర్థికవేత్త సౌమ్య కాంతి ఘోష్‌ వెల్లడించారు. ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఐసీసీ) నిర్వహించిన వెబినార్‌ ఘోష్‌ మాట్లాడుతూ.. ఆర్థిక, ద్రవ్య రూపంలో ప్రభుత్వం, ఆర్‌బీఐ ఎన్ని సహాయ చర్యలు తీసుకున్నా ఈ నష్టాన్ని భర్తీ చేయడం సాధ్యం కాదన్నారు. 


పులి మీద పుట్రలా..

ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి జారుకుంటున్న సమయంలోనే పులి మీద పుట్రలా కొవిడ్‌-19 మహమ్మారి విరుచుకు పడిందని ఘోష్‌ పేర్కొన్నారు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ఇప్పటి వరకు ఆర్‌బీఐ అనువైన చర్యలే తీసుకుందన్నారు. మొండి బకాయిల (ఎన్‌పీఏ) భయం ఉన్నా, జీడీపీ వృద్ధి రేటు మైనస్‌ స్థాయికి పడిపోతున్నపుడే రుణ వితరణ పెంచాల్సి ఉంటుందన్నారు. ఇలాంటి సందర్భాల్లోనే ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధానాలు కీలక పాత్ర పోషిస్తాయని ఘోష్‌ చెప్పారు.


కోలుకునేదెప్పుడో చెప్పలేం..

కొవిడ్‌ తర్వాత, భారత ఆర్థిక వ్యవస్థ ఎప్పుడు కోలుకుంటుందనే విషయం కూడా ఆర్థికవేత్తలకు అర్థం కావడం లేదు. వినియోగం, పెట్టుబడుల పతనం, ప్రభుత్వ ఖర్చులను మించిపోయిన విషయాన్ని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఫైనాన్స్‌ అండ్‌ పాలసీ (ఎన్‌ఐపీఎ్‌ఫపీ) డైరెక్టర్‌ రతిన్‌ రాయ్‌ గుర్తు చేశారు. ప్రైవేటు పెట్టుబడులు ఊపందుకుంటే తప్ప, ఈ పరిస్థితిలో మార్పు రాదన్నారు. కొవిడ్‌తో దెబ్బతిన్న రంగాలను నేరుగా ఆదుకునే బదులు ద్రవ్య పరపతి విధానాల ద్వారా ఆదుకునేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ మొగ్గు చూపడాన్ని ఆయన తప్పుపట్టారు. 


వ్యాక్సిన్‌ వచ్చే వరకు ఇంతే : సీఈఏ 

కొవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రస్తుత ఆర్థిక అనిశ్చితి తప్పదని ఈ వెబినార్‌లో పాల్గొన్న కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అన్నారు. ఈ అనిశ్చితి పోతే తప్ప పూర్తిగా డిమాండ్‌ తిరిగి పుంజుకునే అవకాశం లేదన్నారు. కరోనా భయం పోయేంత వరకు ప్రజలు అత్యవసర ఖర్చులకు తప్ప, ఇతర ఖర్చులకు పోకుండా ఉన్న పొదుపు చేసేందుకే ఇష్టపడతారన్నారు. ఆర్థిక వ్యవస్థను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజీ తక్కువన్న విమర్శలను సుబ్రమణియన్‌ తోసిపుచ్చారు. అమెరికా వంటి దేశాలూ తమ జీడీపీలో 3.5 శాతాన్ని ఉద్దీపనగా ప్రకటించి, మిగతా మొత్తాన్ని ద్రవ్య, పరపతి చర్యల ద్వారానే అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.  


Updated Date - 2020-06-20T06:02:28+05:30 IST