కరోనా సెకండ్‌ వేవ్‌ : సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ చాలెంజ్‌ ఇదే..

ABN , First Publish Date - 2021-05-03T17:21:16+05:30 IST

రోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు.

కరోనా సెకండ్‌ వేవ్‌ : సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ చాలెంజ్‌ ఇదే..

  • వంటలు చేద్దాం..
  • పోషకాలు పట్టేద్దాం.. 
  • సోషల్‌మీడియాలో చాలెంజ్‌లు
  • సంప్రదాయ వంటలకు పెద్దపీట
  • ఇంటి వంటలను ఆస్వాదిస్తున్న నగరవాసులు

హైదరాబాద్/బంజారాహిల్స్‌ : కరోనా సెకండ్‌ వేవ్‌ నేపథ్యంలో చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. మరి ఇంట్లో ఏం చేద్దాం.. అన్న ఆలోచన నుంచి పట్టిందే ‘వంటలు చేద్దాం.. ఇంటి వంటను ఆస్వాదిద్దాం’ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా మారిన ఈ పందెం(చాలెంజ్‌) కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య సరదాగా సాగుతోంది. వినోదంగా అనిపించే దీని వెనుక బోలెడంత ఆరోగ్యం.. అంతకు మించిన ఆనందం కూడా ఉందంటున్నారు చాలా మంది.


జూబ్లీహిల్స్‌లో ఉండే వర్మ, శ్రీనగర్‌కాలనీకు చెందిన అనిరుథ్‌ మిత్రులు. సరదాగా కర్రీస్‌ ఎలాచేయాలనే పోటీ పెట్టుకున్నారు. ఎగ్‌ కర్రీలో ప్రోటీన్లు, దానితో పాటు రుచిని కూడా చూడవచ్చునని ఒకరు.. అబ్బే, చికెన్‌తో ఇన్ని వెరైటీలు చేసి వావ్‌ అనిపించవచ్చని మరొకరు.. ఈ పోటీ వల్ల కొత్త రుచులను ఆస్వాదించడంతో పాటు, మంచి వ్యాపకం అలవడుతోందని అంటున్నారు. కరోనా వార్త నుంచి కూడా మనసును దూరం పడేసే మార్గమని అంటున్నాడు రాజేష్‌.


సోషల్‌ మీడియా వేదికగా.. 

కరోనా పుణ్యమాని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు ఏడాదిగా వర్క్‌ ఫ్రం హోంతో కాలం గడుపుతున్నారు. రెండో దశ కరోనా కారణంగా అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని కొందరు నియమంగా పెట్టుకున్నారు. అదే సమయంలో హాబీలకు పదును పెడుతున్నారు. ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకుంటే కరోనా దూరం అన్న అన్న విషయాన్ని ప్రచారం చేస్తూ రుచికరమైన, సంప్రదాయ వంటకాలపై దృష్టి సారించారు. ఇందుకోసం ఇంట్లోనే వంటలు చేసుకోవాలని భావిస్తున్నారు. పోషకాలతో కూడిన వంటకాలను సిద్ధం చేసి, వాటిని సోషల్‌మీడియాలో పంచుకుంటున్నారు. సదరు వంటలపై చాలెంజ్‌లు సైతం విసురుకుంటున్నారు. ఛాలెంజ్‌లను స్వీకరిస్తున్న వారు కొత్త రుచులను సిద్ధం చేసి సోషల్‌మీడియాలో ప్రతి సవాల్‌ విసురుతున్నారు. ముఖ్యంగా మగవారు మేము ఎలాంటి వంటకాలనైనా సిద్ధం చేయగలమని చెబుతున్నారు.


ఆహా ఏమి రుచి..

బర్గర్‌, పిజ్జా, పాస్తా ఇలా పాశ్చాత్య రుచులకు అలవాటు పడిన నగర వాసులు ఇంటి వంటకు దాసోహం అంటున్నారు. పాతతరం వంటలు చేయడంలో బిజీగా మారారు. ఎప్పుడు వంటలో ఉప్పులేదు... రుచి బాగోలేదు అంటూ దీర్ఘాలు తీసే పిల్లలు ఎంచక్కా ఇంట్లోనే ఉంటూ చేసి పెట్టింది వంక పెట్టకుండా తింటుండంతో అమ్మలు మరింత ఉత్సాహంగా వంటకాలు సిద్ధం చేస్తున్నారు. బొబ్బెర్లు, సెనగల కూర, చామకూర బజ్జీలు, సాబ్దానా పకోడీ ఇలా రకరకాల వంటలు వండి పెడుతున్నారు. ఉడకబెట్టిన శనగకాయలు, దానికి కాంబినేషన్‌గా బెల్లం, కాల్చిన దుంపగడ్డలు ఇలా గ్రామీణ వంటలు నగరంలో సిద్ధం అవుతున్నాయి. ఈ వంటకాలు రుచికరంగా ఉండటంతోపాటు ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుందని వైద్యులు కూడా చెబుతున్నారు. రాగులు, సొజ్జలు, జొన్నలతో ఆరోగ్యాన్నిచ్చే చపాతీలకు చిరుదాన్యాలతో చేసిన కూరలను కాంబినేషన్‌ వండి వడ్డిస్తున్నారు. పులిహోర, దద్దోజనం, పొంగలి, కిచిడీ, వెజిటెబుల్‌ బిర్యానీ.. ఈ వంటకాలను వారానికి రెండు సార్లయినా ఆహార  ప్రియులు ఓ పట్టు పడుతున్నారు.


నేర్పిస్తున్నారు కూడా..

వంట చేయడమే కాదు తల్లులు తమ పిల్లలకు వంట ఏలా చేయాలో కూడా నేర్పుతున్నారు. చదువు కోసమని, ఉద్యోగపరంగా పిల్లలు దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు అక్కడ బయటి ఆహారమే తీసుకోవాల్సి వస్తుంది. వంట నేర్చుకోమంటే టైం లేదు అని పిల్లలు చెప్పేవారు. కానీ, ఇప్పుడు కావాల్సినంత సమయం దొరికింది. దీంతో తల్లులు తమ పిల్లలకు వంట గదిలో క్లాసులు ఇస్తున్నారు. పిండి వంటకాలు పక్కన పెడితే, చిన్నపాటి కర్రీలు, పప్పు ఎలా వండుకోవాలని నేర్పుతున్నారు.


అన్నీ ఇంట్లోనే...

లాక్‌డౌన్‌ కంటే ముందు పిజ్జా, కేక్‌లు వంటి వంటకాలు సిద్ధం చేసే విదేశీ ఔట్‌లెట్‌లు కళకళలాడగా, ఇప్పడు అవన్నీ మూతపడ్డాయి. అయితే, ప్రస్తుతం ఆ వంటలను ఇంట్లోనే సంప్రదాయంగా మార్చి అందిస్తున్నారు. దిబ్బరొట్టె సహాయంతో పిజ్జా. బిస్కెట్లు, పాలతో కేక్‌లను తయారు చేస్తున్నారు. వంటల తయారీకి కొందరు యూట్యూబ్‌ సహాయం తీసుకుంటున్నారు.

Updated Date - 2021-05-03T17:21:16+05:30 IST