కరోనా సెకండ్‌వేవ్‌..పిల్లల్లోనూ తీవ్ర ఇన్ఫెక్షన్లు!

ABN , First Publish Date - 2021-04-08T06:55:16+05:30 IST

కరోనా వైర్‌సతో పిల్లలకు పెద్దగా ప్రమాదం లేదు. వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నాయని గణాంకాలు కూడా చెబుతున్నాయి. కానీ..

కరోనా సెకండ్‌వేవ్‌..పిల్లల్లోనూ తీవ్ర ఇన్ఫెక్షన్లు!

కొత్తవేరియంట్లు, స్ట్రెయిన్లతో 16 ఏళ్లలోపు వారికీ సమస్యలు

ఎంఐఎస్‌-సితో ఆస్పత్రిపాలు!

ట్రాపికల్‌ పీడియాట్రిక్స్‌ జర్నల్‌ వెల్లడి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 7: కరోనా వైర్‌సతో పిల్లలకు పెద్దగా ప్రమాదం లేదు. వారిలో ఇన్ఫెక్షన్ల తీవ్రత, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నాయని గణాంకాలు కూడా చెబుతున్నాయి. కానీ.. కరోనా సెకండ్‌ వేవ్‌లో ఆ పరిస్థితి కనిపించట్లేదని, కొత్త వేరియంట్లు పిల్లల్లో కూడా తీవ్ర ఇన్ఫెక్షన్లకు కారణమవుతున్నాయని ఎపిడమాలజిస్టులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూపు మార్చుకుంటున్న కరోనా వైరస్‌ (కొత్త వేరియంట్లు, స్ట్రెయిన్ల రూపంలో) గత ఏడాదితో పోలిస్తే వేగంగా వ్యాపిస్తోందని.. మరింత ప్రాణాంతకంగా మారుతోందని, రోగనిరోధక వ్యవస్థ, యాంటీబాడీల కన్నుగప్పి మరీ ఇన్ఫెక్షన్లకు కారణమవుతోందని ఇటీవలికాలంలో జరిగిన అధ్యయనాల్లో వెల్లడైంది. గత రెండు, మూడు నెలలుగా విద్యాసంస్థల్లో పెద్ద సంఖ్యలో కేసులు బయటపడడమే ఇందుకు నిదర్శనమని వైద్యనిపుణులు చెబుతున్నారు.


సెకండ్‌వేవ్‌లో కనిపిస్తున్న మరో కొత్త పరిణామమేంటంటే.. ఒకే ఇంట్లో నలుగురైదుగురికి కరోనా వస్తే, పెద్దల్లో కన్నా ముందు పిల్లల్లోనే లక్షణాలు కనిపిస్తున్నాయి. 2 నుంచి 16 ఏళ్ల వారిలో ఇన్ఫెక్షన్‌ తీవ్రత గతంతో పోలిస్తే ఎక్కువగానే ఉందని ప్రపంచవ్యాప్తంగా పలువురు వైద్యులు చెబుతున్నారు. అంతేకాదు.. కొందరు పిల్లలు ‘మల్టీసిస్టమ్‌ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎ్‌స-సీ)’తో ఆస్పత్రుల బారిన కూడా పడుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఎంఐఎ్‌స-సి అంటే.. అదొక అరుదైన ఆటోఇమ్యూన్‌ సమస్య. దీనివల్ల గుండె, ఊపిరితిత్తులు, మెదడు, మూత్రపిండాల వంటి ప్రధాన అవయవాలు వాపునకు గురవుతాయి. మరణించే ప్రమాదం ఎక్కువ.


ముగ్గురిలో ఒకరు..

కరోనా పాజిటివ్‌గా తేలిన ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరికి ఆస్పత్రిలో చికిత్స అవసరమవుతోందని.. ‘జర్నల్‌ ఆఫ్‌ ట్రాపికల్‌ పీడియాట్రిక్స్‌’ ఫిబ్రవరిలోనే ఒక అధ్యయన నివేదికను ప్రచురించింది. మనదేశానికి చెందిన ‘ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ పీడియాట్రిక్స్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ చాప్టర్‌’ అధ్యయనంలో కూడా పెద్ద సంఖ్యలో ఎంఐఎ్‌స-సి బారిన పడిన చిన్నారులను గుర్తించారు. కొవిడ్‌-19 బారిన పడిన చిన్నారుల్లో ‘ఎంఐఎ్‌స-సి’ సమస్య ఎందుకు తలెత్తుతోందనే ప్రశ్నకు ఇంకా పూర్తిస్థాయి సమాధానం లభించలేదు. కరోనా సోకిన చిన్నారులు ఎంఐఎ్‌స-సి బారిన పడితే మరణించే ముప్పు 60ు ఎక్కువగా ఉంటుందని ఇటీవలి అధ్యయనాల్లో తేలింది. 


పిల్లలకు వ్యాక్సిన్‌ ఎప్పుడు?

పిల్లలకు వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి కనీసం ఒక ఏడాది పడుతుందని అంచనా. ప్రస్తుతానికి 16 ఏళ్లలోపువారికి ఇవ్వడానికి అవసరమైన అనుమతులు పొందిన వ్యాక్సిన్‌ ఏదీ లేదు. టీకా వల్ల వారిలో కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకునేందుకు ట్రయల్స్‌ జరుగుతున్నాయి. మోడెర్నా, ఫైజర్‌ సంస్థలు ఈ టెస్టులు నిర్వహిస్తున్నాయి. 


ఈ లక్షణాలుంటే జాగ్రత్త..

కరోనా వల్ల పిల్లల్లో కనిపించే సమస్యలపై హార్వర్డ్‌ హెల్త్‌ ఒక నివేదికలో తెలిపింది. ఆ సమస్యలేంటంటే..

  • ఎడతెగని జ్వరం
  • చర్మంపై దద్దుర్లు, కాలివేళ్ల వాపు
  • కళ్లు ఎర్రగా మారడం
  • కీళ్లనొప్పులు
  • వికారం, పొత్తికడుపులో నొప్పి, 
  • జీర్ణ సమస్యలు
  • పెదాలు నల్లగా మారడం

ఈ లక్షణాలు కనపడితే జాగ్రత్తపడాలని, వెంటనే ఆస్పత్రిలో చికిత్స చేయించాలని సూచించింది.

Updated Date - 2021-04-08T06:55:16+05:30 IST