Abn logo
Dec 8 2020 @ 10:28AM

సేఫ్‌ ఫ్రం...సెకండ్‌ వేవ్‌!

ఆంధ్రజ్యోతి(08-12-2020)

ఇది చలికాలం. అంతకుమించి కొవిడ్‌ కాలం! కాబట్టి చలికాలం వేధించే సాధారణ జలుబునూ, దగ్గులనూ నిర్లక్ష్యం చేయకూడదు. ముఖ్యంగా మరి కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ పొంచి ఉన్న ఈ సమయంలో రెట్టింపు అప్రమత్తత అవసరం.


సెకండ్‌ వేవ్‌ కొత్తదేం కాదు

కొవిడ్‌ ప్రారంభంలో ఉన్న భయం, అప్రమత్తత, జాగ్రత్తలు క్రమేపీ అడుగంటాయి. సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం, అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకపోవడం లాంటి జాగ్రత్తలు మరుగున పడిపోయాయి. కాబట్టే కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి తిరిగి పుంజుకోవడం మొదలయ్యాయి. ఇందుకు కారణం కరోనా వైరస్‌ కొత్త రూపం దాల్చి, విస్తృతి పెంచుకుంది అనుకుంటే పొరపాటు. ప్రారంభం నుంచీ కరోనా ఎప్పటికప్పుడు రూపం మార్చుకుంటూనే ఉంది. ప్రస్తుత కరోనా వైరస్‌ రూపం కూడా కొత్తదే అయి ఉండవచ్చు. అయితే కేవలం కొత్త స్ట్రెయిన్‌ కారణంగానే సెకండ్‌ వేవ్‌ తలెత్తింది అనేది కరెక్ట్‌ కాదు. ప్రారంభంలో లాక్‌డౌన్‌తో, ముందు జాగ్రత్తతో అప్రమత్తంగా వ్యవహరించడం మూలంగా విభిన్న కొవిడ్‌ రూపాలకు అడ్డుకట్ట వేయగలిగాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఇందుకు పూర్తి విరుద్ధంగా మారింది. కాబట్టే కేసుల తీవ్రత పెరుగుతోంది. ఈ స్థితే కరోనా సెకండ్‌ వేవ్‌. 


చలికాలం సమస్యలకూ,కొవిడ్‌కూ తేడా?

కొవిడ్‌ లక్షణాలు ఇవీ అని కచ్చితంగా చెప్పే పరిస్థితి లేదు. మలేరియా, ఇన్‌ఫ్లూయెంజా... ఇలా విభిన్న రుగ్మతలను కొవిడ్‌ మరిపిస్తుంది. దగ్గు, జలుబు, జ్వరం, విరేచనాలు... ఇలా బోలెడు లక్షణాలతో కొవిడ్‌ బయల్పడుతూ ఉంటుంది. అయితే ఈ లక్షణాలతో పాటు వాసన, రుచి కోల్పోవడం లాంటి ప్రత్యేకమైన కొవిడ్‌ లక్షణాలు తోడవుతాయి. అలాగే సాధారణ జలుబులో రన్నింగ్‌ నోస్‌ (ముక్కు నుంచి నీరు కారడం) ఉంటుంది. కొవిడ్‌లో ఈ లక్షణం ఉండదు. కాబట్టి చలి కాలంలో వచ్చే సాధారణ జలుబు, దగ్గులకు తోడు కొవిడ్‌ తాలూకు ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నాయేమో గమనించాలి. అలాగే క్రమేపీ లక్షణాల తీవ్రత పెరుగుతుందేమో చూసుకోవాలి. ఆయాసం మీదా ఓ కన్నేసి ఉంచాలి. ఆక్సీమీటర్‌ సహాయంతో ఆక్సిజన్‌ లెవెల్‌ పరీక్షించుకోవడమూ ముఖ్యమే! అలాగే సాధారణ జలుబు  ఐదు రోజులకు మించి కొనసాగి, తీవ్రత పెరుగుతూ ఉంటే కొవిడ్‌గా భావించాలి. కాబట్టి కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ సమయంలో జలుబు, దగ్గు, జ్వరం, నీళ్ల విరేచనాలు, తలనొప్పి, బలహీనత... ఇలాంటి లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి.


రెండోసారి రాకుండా...


కొవిడ్‌ సోకి, పూర్తిగా కోలుకున్న వ్యక్తుల్లో ఆ ఇన్‌ఫెక్షన్‌ పట్ల ఇమ్యూనిటీ ఎంత కాలం పాటు కొనసాగుతుందనే విషయంలో స్పష్టత లేదు. కాబట్టి కొవిడ్‌ రెండోసారి సోకే వీలు లేదు అనుకోవడం పొరపాటు. ఒకసారి కొవిడ్‌ వచ్చి తగ్గినా, రెండోసారి కూడా కొవిడ్‌ సోకే వీలు ఉంటుంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తప్పనిసరిగా కొనసాగించాలి.


ఈ జాగ్రత్తలు తప్పనిసరి


జనసమ్మర్థ ప్రదేశాలకు దూరం: కొవిడ్‌ ప్రారంభంలో పాటించిన నియమాలనే రాబోయే జనవరి వరకూ కొనసాగించడం అవసరం. మరీ ముఖ్యంగా జనసమ్మర్థ ప్రాంతాలకు దూరంగా ఉండాలి. ఒకవేళ అలాంటి ప్రాంతాలకు ఇప్పటికే వెళ్లి ఉంటే, అలాంటివాళ్లు కనీసం 10 నుంచి 15 రోజుల పాటు ఇంటికే పరిమితం కావడం మేలు. కొవిడ్‌ ప్రభావం పది రోజుల పాటు ఉంటుంది. కొవిడ్‌ సోకినా, సోకకపోయినా ఐసొలేషన్‌ పాటించగలిగితే వాళ్ల  ద్వారా ఇతరులకు ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా ఉంటుంది. కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ నియంత్రణకు ఈ నియమం ఎంతో కీలకం. 


కొవిడ్‌ జాగ్రత్తలు: ముందు నుంచీ పాటిస్తూ వచ్చిన కొవిడ్‌ నిబంధనలు అంతే కచ్చితంగా కొనసాగించాలి. ప్రతి ఒక్కరూ మాస్క్‌ ధరించడంతో పాటు, సామాజిక దూరం పాటించడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవడం చేయాలి. 


ఆవిరి పట్టడం: ప్రతి రోజూ ఉదయం, రాత్రి నిద్రకు ముందు వేడి నీటి ఆవిరి పట్టడం అవసరం. ఇలా చేయడం వల్ల కొవిడ్‌ వైరస్‌తో పాటు ఇతరత్రా ఇన్‌ఫెక్షన్లను కలిగించే వైరస్‌లు కూడా అడ్డుకట్ట వేయవచ్చు. వేడి నీటి ఆవిరితో పలు రకాల సీజనల్‌ వైరస్‌ల నుంచి రక్షణ పొందవచ్చు.


విటమిన్‌ సప్లిమెంట్లు: జింకోవిట్‌, మల్టీవిటమిన్‌ మాత్రలు రోగనిరోధకశక్తికి తోడ్పడతాయి. కాబట్టి వైద్యుల సూచన మేరకు ఈ సప్లిమెంట్లను వాడుకోవచ్చు.


రక్షణనిచ్చే ఆహారం: పౌష్ఠికాహారంతో పాటు సూప్స్‌, పాలు తాగాలి. సరిపడా నీళ్లు తాగుతూ ఉండాలి. కంటి నిండా నిద్ర, వ్యాయామం తప్పనిసరి. ఇవన్నీ రోగనిరోధకశక్తి పెంపుకు తోడ్పడతాయి.


వ్యాయామం: జనవరి నెలాఖరు వరకూ సెకండ్‌ వేవ్‌ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవధిలో జిమ్‌, పార్క్‌లకు బదులుగా ఇంట్లోనే వ్యాయామం చేసుకోవడం మేలు. 


అపోహలు  వాస్తవాలు


కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రారంభం నుంచీ దానికి అడ్డుకట్ట వేయగలిగే మార్గాల అన్వేషణ నిరంతరంగా కొనసాగుతూనే ఉంది. సామాజిక మాధ్యమాల ద్వారా, సన్నిహితులు, స్నేహితుల ద్వారా ఈ వైరస్‌ నుంచి రక్షణ అందించే చర్యలు, చిట్కాలు పాటించే వారి సంఖ్య పెరిగింది. అయితే వీటిలో ఎక్కువ శాతం అపోహలే ఉంటున్నాయి. వైరస్‌ నుంచి రక్షణ కోసం పాటించే చిట్కాలతో కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదమూ లేకపోలేదు.


అపోహ: పసుపు ఎక్కువ తీసుకుంటే కొవిడ్‌ సోకదు.


వాస్తవం: ఈ అపోహతో పసుపును పాలలో కలిపి అదే పనిగా తాగితే శరీరంలో పసుపు శాతం పెరిగి కళ్లు పచ్చబడే ప్రమాదం ఉంది. కాబట్టి పసుపును పరిమితంగానే వాడాలి.


అపోహ: గ్రీన్‌ టీ, జిందా తిలిస్మాత్‌ వాడితే వైరస్‌ సోకదు


వాస్తవం: ఇవేవీ వైరస్‌కు అడ్డుకట్ట వేయలేవు.  ముందు జాగ్రత్తగా వీటిని తీసుకోవడం వల్ల వైరస్‌ సోకదు అనుకుంటే పొరపాటు. కరోనా వైరస్‌ గ్రీన్‌ టీ లేదా జిందా తిలిస్మాత్‌కు బదులుగా గాలి ద్వారా సోకుతుంది కాబట్టి కొవిడ్‌ రక్షణ చర్యలు పాటించాలి.


అపోహ: విటమిన్‌ సితో రోగనిరోధకశక్తి పెరిగి, కరోనా నుంచి రక్షణ లభిస్తుంది


వాస్తవం: రోగనిరోధకశక్తితో వైరస్‌కు అడ్డుకట్ట వేయవచ్చనే విషయం నిజమే అయినా... అందుకోసం విపరీతంగా విటమిన్‌ సి సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల శరీరంలో ఆస్కార్బిక్‌ యాసిడ్‌ మోతాదు పెరిగి, ఇతరత్రా మూత్ర సంబంధ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.


అపోహ: విటమిన్‌ డితో కరోనా నుంచి రక్షణ పొందవచ్చు


వాస్తవం: విటమిన్‌ డి లోపం లేకుండా చూసుకోవడం అవసరమే అయినా అవసరానికి మించి డి విటమిన్‌ను తీసుకోవడం వల్ల శరీరంలో టాక్సిసిటీ పెరిగే ప్రమాదం ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదమూ ఉంటుంది.


అపోహ: నీళ్లు ఎక్కువ తాగితే కరోనా సోకదు.


నిజం: సరిపడా హైడ్రేషన్‌తో ఇన్‌ఫెక్షన్ల నుంచి శరీరానికి రక్షణ దక్కుతుంది. ఇందుకోసం నీళ్లు ఎక్కువ తాగాలి కాబట్టి అదే పనిగా రోజుకు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీళ్లు తాగడం సరి కాదు. అన్ని నీళ్లను మూత్రపిండాలు వడగట్టలేక శరీరంలో నీరు నిల్వ ఉండిపోయే ప్రమాదం ఉంటుంది. మరీ ముఖ్యంగా మూత్రపిండాలు, గుండె సమస్యలు ఉన్నవాళ్లకు ఈ పరిస్థితి ప్రమాదకరం.


అపోహ: ఇంట్లో ఉంటే కరోనా రాదు


వాస్తవం: ఇంటికే పరిమితమైన వ్యక్తికి కరోనా సోకే వీలు లేకపోయినా, బయటకు వెళ్లి వచ్చే వారి కుటుంబసభ్యుల ద్వారా కరోనా సోకే అవకాశం లేకపోలేదనే విషయం ప్రతి ఒక్కరూ గ్రహించాలి. కరోనా నుంచి సంపూర్ణ రక్షణ పొందాలంటే కుటుంబంలోని ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా నడుచుకోవాలి. బయటకు వెళ్లి వచ్చినవాళ్లు ఇంట్లో అడుగుపెట్టిన వెంటనే, స్నానం చేసి ఆ తరువాతే కుటుంబసభ్యులను కలవడాన్ని విధిగా అలవరుచుకోవాలి.


డాక్టర్‌ జి.నవోదయ,

కన్సల్టెంట్‌ జనరల్‌ మెడిసిన్‌,

కేర్‌ హాస్పిటల్‌,

బంజారాహిల్స్‌, హైదరాబాద్‌.