కరోనా ఉధృతి రికవరీకి ముప్పే

ABN , First Publish Date - 2021-04-17T06:37:22+05:30 IST

దేశంలో కరోనా రెండో విడత విజృంభణ ఆర్థిక రికవరీని దెబ్బ తీస్తుందని, నెల రోజుల పాటు జాతీయ స్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించినట్టయితే జీడీపీ 1 నుంచి 2 శాతం మేరకు ఆవిరైపోతుందని బోఫా సెక్యూరిటీస్‌ హెచ్చరించింది

కరోనా ఉధృతి రికవరీకి ముప్పే

తేల్చి చెప్పిన బోఫా


న్యూఢిల్లీ: దేశంలో కరోనా రెండో విడత విజృంభణ ఆర్థిక రికవరీని దెబ్బ తీస్తుందని, నెల రోజుల పాటు జాతీయ స్థాయి లాక్‌డౌన్‌ ప్రకటించినట్టయితే జీడీపీ 1 నుంచి 2 శాతం మేరకు ఆవిరైపోతుందని బోఫా సెక్యూరిటీస్‌ హెచ్చరించింది. అలాగే మార్చి 31వ తేదీతో ముగిసిన నాలుగో త్రైమాసికంలో గతంలో ప్రకటించిన 3 శాతం వృద్ధిని సాధించడం కూడా కష్టమైపోతుందని స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ ప్రకటించాల్సిన పరిస్థితి వస్తే ఆర్థిక కార్యకలాపాల సూచీలన్నీ భారీగా దిగజారతాయని, ఇప్పటికీ బలహీనంగానే ఉన్న రుణ వృద్ధి మరింత తగ్గుతుందని తెలిపింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో త్రైమాసిక వృద్ధి రేటు ఎంత ఉండవచ్చనేది మాత్రం చెప్పలేదు. ఏడు అంశాలతో కూడిన బోఫా భారత కార్యకలాపాల సూచీలో నాలుగు మందగించిన కారణంగా  జనవరిలో 1.3 శాతం ఉన్న సూచీ ఫిబ్రవరిలో 1 శాతానికి తగ్గింది. వరుసగా 9 నెలల పాటు ప్రతికూలంగానే ఉన్న ఈ సూచీ గత డిసెంబరులో మాత్రమే సానుకూలతలో ప్రవేశించింది. అయితే వాస్తవ వడ్డీ రేట్లు తగ్గడం, కీలక ద్రవ్యోల్బణం స్థిరం గా ఉండడం కాస్తంత ఊరట కలిగించే అంశాలని తెలిపింది. 


ఆర్థికం మెరుగ్గా ఉంది: సీఈఏ

భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు కరోనా తొలి విడత కాలం కన్నా మెరుగ్గా ఉన్నదని ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు కేవీ సుబ్రమణియన్‌ అన్నారు. అస్థిరత ఈ సారి చాలా తక్కువగా ఉన్నదంటూ ప్రజలు మాత్రం ప్రస్తుత ఉదృతి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా మహమ్మారి కాలంలో ఈ-కామర్స్‌, డిజిటైజేషన్‌ బహుళ ప్రాచుర్యంలోకి రావడం కీలకాంశమన్నారు. 


ఈ-కామర్స్‌లో చోటు చేసుకుంటున్న వృద్ధిని ఉపయోగించుకోగలిగే స్థాయికి భారత ఆర్థిక వ్యవస్థ చేరిందని తాను భావిస్తున్నట్టు చెప్పారు. ఎంఎ్‌సఎంఈలు వ్యాపార వృద్ధి కోసం కొత్త టెక్నాలజీలు ఉపయోగించడం, నవ్యతపై పెట్టుబడులు పెట్టడం మంచిదని సూచించారు.

Updated Date - 2021-04-17T06:37:22+05:30 IST