సంగారెడ్డి జిల్లో ఒకే పాఠశాలలో 48 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-11-30T00:23:58+05:30 IST

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో 48 మందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేగుతోంది. వీరిలో 47 మంది విద్యార్థినులు, ఒక టీచర్‌ ఉన్నారు.

సంగారెడ్డి జిల్లో ఒకే పాఠశాలలో 48 మందికి కరోనా

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావుపూలే బాలికల గురుకుల పాఠశాలలో 48 మందికి కరోనా నిర్ధారణ కావడం కలకలం రేగుతోంది. వీరిలో 47 మంది విద్యార్థినులు, ఒక టీచర్‌ ఉన్నారు. కరోనా గతేడాది ప్రారంభమైనప్పటి నుంచి జిల్లాలోని గురుకుల పాఠశాలలో ఇంత ఎక్కువ సంఖ్యలో పాజిటివ్‌ రావడం చర్చనీయాంశమైంది. ఈ పాఠశాలలో 470 మంది విద్యార్థులు, 26 మంది ఉపాధ్యాయులు, 10 మంది ఇతర సిబ్బంది ఉన్నారు. అస్వస్థతకు గురైన ఒక విద్యార్థిని తల్లిదండ్రులు ఇటీవల తమ స్వగ్రామమైన ఆదిలాబాద్‌కు తీసుకెళ్లారు. తల్లిదండ్రులు సదరు విద్యార్థినికి హైదరాబాద్‌లో కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది.


పాఠశాల ప్రిన్సిపాల్‌ ఆదివారం స్కూల్‌లోని 261 మంది విద్యార్థినులకు, 17 మంది ఉపాధ్యాయులకు ర్యాట్‌ (ర్యాపిడ్‌ యాంటిజెన్‌) పరీక్షలు జరిపారు. వీరిలో 42 మంది విద్యార్థులకు, ఒక టీచర్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిని అదే పాఠశాలలోని పై అంతస్తులోని హాలును ఐసోలేషన్‌గా మార్చి ఉంచారు. వారి శాంపిళ్లను ఆర్‌టీపీసీఆర్‌, ఎటువంటి వైరస్‌నైనా గుర్తించేందుకు జినోమ్‌ పరీక్షల కోసం గాంధీ ఆస్పత్రికి పంపించారు. పాఠశాలలోని మిగిలిన 209 మంది విద్యార్థినులకు, 16 మంది ఉపాధ్యాయులకు సోమవారం పరీక్షలు నిర్వహించారు. వీరిలో ఐదుగురు విద్యార్థినులకు పాజిటివ్‌ వచ్చింది. వీరిని కూడా ఐసోలేషన్‌లో ఉంచారు.

Updated Date - 2021-11-30T00:23:58+05:30 IST