సామూహిక వ్యాప్తి నిరోధంపై దృష్టి

ABN , First Publish Date - 2020-04-05T07:24:52+05:30 IST

కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కారకం గా ఉన్నాయని భావిస్తున్న సమూహ ప్రాంతాలపై కేం ద్రం ఫోకస్‌ చేసింది. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో వైరస్‌ లక్షణాలున్నవారిని గుర్తించి...

సామూహిక వ్యాప్తి నిరోధంపై దృష్టి

‘గొలుసు’ తెంపేయడమే లక్ష్యం

హాట్‌స్పాట్స్‌ చుట్టూ కఠిన నిషేధాజ్ఞలు

విస్తృతంగా పరీక్షలు, క్వారంటైన్‌, ఐసొలేషన్‌ 

ఇంటింటి సర్వే, శాంపిల్స్‌ పరీక్షలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: కొవిడ్‌-19 వైరస్‌ వ్యాప్తి కారకం గా ఉన్నాయని భావిస్తున్న సమూహ ప్రాంతాలపై కేం ద్రం ఫోకస్‌ చేసింది. ఒక నిర్ధిష్ట ప్రాంతంలో వైరస్‌ లక్షణాలున్నవారిని గుర్తించి, స్వీయ-నిర్బంధంలోకి లేక ఏకాంతవాసానికి పంపి.. వైరస్‌ గొలుసుకట్టును తెంప డం ఈ సమూహ-నిరోధక వ్యూహం(క్లస్టర్‌ కంటైన్‌మెంట్‌ స్ట్రాటజీ) ఉద్దేశం. దీనికి సంబంధించి కేంద్రం శనివారం ఓ వ్యూహ పత్రాన్ని విడుదల చేసింది. దీని ప్రకారం.. దేశంలో వైరస్‌ 211 జిల్లాలకు వ్యాపించింది. ఇది మరిన్నిజిల్లాలకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ‘‘ప్రస్తుత లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ స్థాయి క్రమేణా సమూ హ వ్యాప్తికి దారితీయొచ్చు. ప్రయాణాలు లేదా ఒక చోట గుమిగూడడం.. ఇలా రకరకాల మార్గాల ద్వారా ప్రజాసమూహానికి వ్యాపించొచ్చు. దీన్ని అడ్డుకోవడానికి తొలుత చేయాల్సినది భౌగోళిక స్వీయ నిర్బంధం (జగ్రాఫిక్‌ క్వారంటైన్‌). ఇది జరగాలంటే లోకల్‌ ట్రాన్స్‌మిషన్‌ ప్రాంతాల నుంచి ప్రజల రాకపోకలు, ప్రయాణాలు, బయటకు రావడం.. అన్నీ నిలిచిపోవాలి. సరళంగా చెప్పాలంటే ఆ ఏరియాలను దిగ్బంధం చేసి ఓ అడ్డు (గోడ) కట్టేయాలి. పెద్ద సంఖ్యలో కేసులు బయటపడుతున్న ప్రాంతాలు, హాట్‌స్పాట్లు.. అన్ని చోట్లా ఈ భౌగోళిక క్వారంటైన్‌ను కచ్చితంగా అమలు చేయాలి. వాటి చోట్ల పకడ్బందీ నిషేధాజ్ఞలు అమలు చేయాలి’’ అని ప్రభుత్వ వ్యూహపత్రం పేర్కొంది. ‘‘ఈ క్లస్టర్‌ నిరోధక వ్యూహంలో భౌగోళిక క్వారంటైన్‌ మాత్రమే కాదు.. ప్రజలు భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. నిరంతర నిఘా, అనుమానాస్పద కేసులపై తక్షణ పరీక్షలు, స్వీయ-నిర్బంధం, ఐసోలేషన్‌కు పంపడం, ఆ వ్యక్తులతో రాసుకుపూసుకు తిరిగినవారు, వారు కాంటాక్ట్‌లోకొచ్చిన వారిని క్వారంటైన్‌ చేయడం, ప్రజలను చైతన్యవంతం చేయడం, వారిలో అవగాహన పెంచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చేయడం.. ఇవన్నీ చేయాలి’’ అని ఆ పత్రం వివరించింది. ప్రస్తుత భౌగోళిక విస్తృతి గతంలో స్వైన్‌ ఫ్లూ వచ్చినప్పటి తరహాలోనే ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. 


ఈ చర్యలు చేపట్టాలి

(1) క్లస్టర్‌ పరిమాణాన్ని బట్టి భౌగోళిక క్వారంటైన్‌ అమలు చేయాలి.

(2) ఆప్రాంతాల్లోని ఉష్ణోగ్రత, తేమ మొదలైనవి వైరస్‌ వ్యాప్తిలో ప్రభావం చూపుతాయి. వీటిని పరిగణనలోకి తీసుకోవాలి.

(3)కేసుల గుర్తింపు, పరీక్షలు, ఐసోలేషన్‌ మొదలైనవి వేగంగా జరగాలి

(4) ఎవరి నుంచి ఎవరికి వ్యాపిస్తున్నదీ విస్తృతంగా శోధించాలి

(5) హై రిస్క్‌ కేసులను, వారు నివసించిన పరిసరాలను మరింత జాగ్రత్తగా చేపట్టాలి (6) అనుమానముంటే ఐసోలేషన్‌ వార్డులకు పంపాలి

(7) ముఖ్యమైనది భౌతిక దూరం పాటించడం. ఈ సర్వే కోసం నర్సులు, వైద్య సిబ్బంది, మలేరియాపై నిఘా పెట్టిన అనుభవం ఉన్నవారు, ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, మరీ అవసరమైతే నర్సింగ్‌ కాలేజీ విద్యార్థులను నియోగించాలి.


క్లస్టర్‌ వ్యూహం.. తీరూ తెన్నూ!


ముగ్గురు కొవిడ్‌-19 పాజిటివ్‌ పేషెంట్లు ఒకేచోట ఉంటే.. ఆ ప్రాంతాలను సమూహ వ్యాప్తి నిరోధక ప్రాంతాలుగా ఎంపిక చేసుకోవాలి.


ఒక్కో పేషెంటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను క్వారంటైన్‌ చేసెయ్యాలి.


రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల దాకా వైద్య బృందాలు ఆ ప్రాంతంలో ఇల్లిల్లూ తిరగాలి.


జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్య ఉన్నట్లు కనిపించిన వారి శాంపిల్స్‌ తీసుకోవాలి. కేసును బట్టి క్వారంటైన్‌, ఐసోలేషన్‌కు పంపాలి.


శ్వాసకోశ సమస్య ఉంటే ఆసుపత్రికి పంపాలి.


ఇది నిరంతరం 14 రోజుల పాటు నిర్వహించాలి. పేషెంట్ల జాబితా తయారుచేయాలి.


వ్యాధి వ్యాపకుల గుర్తింపు తప్పనిసరి.


ప్రజల్లో చైతన్యం పెంపొందించాలి. 

Updated Date - 2020-04-05T07:24:52+05:30 IST