కరోనా అన్నారు..తూచ్‌ లేదన్నారు

ABN , First Publish Date - 2021-01-13T10:24:43+05:30 IST

థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో నిర్వాహకుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో అవగాహనలోపం కారణంగా షట్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

కరోనా అన్నారు..తూచ్‌ లేదన్నారు

  • సైనా, ప్రణయ్‌ పరీక్షల్లో గందరగోళం
  • నేడు తొలిరౌండ్‌ ఆడనున్న భారత షట్లర్లు


బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో నిర్వాహకుల వ్యవహారశైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్‌ పరీక్షల నిర్వహణలో అవగాహనలోపం కారణంగా షట్లర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇందులో భాగంగానే భారత షట్లర్లు సైనా నెహ్వాల్‌, హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ విషయంలో మంగళవారం ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. టోర్నీ ఆరంభానికి ముందు క్రీడాకారులకు నిర్వహించిన కరోనా పరీక్షల్లో సైనా, ప్రణయ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు మంగళవారం ఉదయం నిర్వాహకులు ప్రకటించారు. వెంటనే సైనా, ప్రణయ్‌ను స్థానిక ఆసుపత్రిలోని క్వారంటైన్‌కు వెళ్లాల్సిందిగా ఆదేశించారు. దీంతో వారిద్దరూ టోర్నీ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటన వెలువడింది. అయితే, కొన్ని గంటలు గడిచాక.. వీళ్లిద్దరూ నాలుగో పరీక్షలో నెగెటివ్‌గా తేలినట్టు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) పేర్కొంది. మొదట పరీక్షల్లో పాజిటివ్‌గా తేలినా.. ఈనెల 11న నిర్వహించిన చివరి పరీక్షలో వీళ్ల ఫలితం నెగెటివ్‌గా వచ్చినట్టు స్పష్టమైంది. దీంతో మంగళవారమే తొలిరౌండ్‌ ఆడాల్సిన వీళ్లిద్దరూ బుధవారం తమ మ్యాచ్‌లను ఆడనున్నారు. 

Updated Date - 2021-01-13T10:24:43+05:30 IST