వైరస్‌.. వయా నగరం

ABN , First Publish Date - 2022-01-08T06:56:52+05:30 IST

సంబరంగా జరుపుకొనే సంక్రాంతి ముంగిట.. కరోనా ముప్పు కలవరపరుస్తోంది. పండుగకు నగరం నుంచి ఊరెళ్లనున్న వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి ప్రమాదం ఉరుముతోంది. వీరి నుంచి గ్రామాలకూ

వైరస్‌.. వయా నగరం

  • పట్నం నుంచి పల్లెలకు పాకనున్న కరోనా
  • నేటి నుంచి సంక్రాంతి పండుగ సెలవులు
  • స్వగ్రామాలకు వెళ్లనున్న 30 లక్షల మంది
  • రోజువారీ కేసుల్లో 60శాతం హైదరాబాద్‌వే
  • గ్రేటర్‌లో 5 రోజుల్లో 5 వేలకు మించి కేసులు
  • రాకపోకలతో ఊళ్లకు కొవిడ్‌: ఆరోగ్య శాఖ
  • వీలైనంత మేర ప్రయాణాలు వద్దని సూచన
  • రాష్ట్రంలో మరో 2,295 కేసులు; 7 నెలల 
  • గరిష్ఠం.. హైదరాబాద్‌లోనే 1,452


హైదరాబాద్‌, జనవరి 7(ఆంధ్రజ్యోతి): సంబరంగా జరుపుకొనే సంక్రాంతి ముంగిట.. కరోనా ముప్పు కలవరపరుస్తోంది. పండుగకు నగరం నుంచి ఊరెళ్లనున్న వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి ప్రమాదం ఉరుముతోంది. వీరి నుంచి గ్రామాలకూ పాకుతుందేమోనన్న భయాలు వ్యక్తం అవుతున్నాయి. లక్షల మంది వెళ్లి, రానున్న నేపథ్యంలో పరిస్థితి ఎక్కడకు దారితీస్తుందోనని తీవ్ర ఆందోళన రేగుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో 60 శాతంపైగా హైదరాబాద్‌వే కావడం దీనంతటికీ కారణం. గత ఐదు రోజుల గణాంకాలను చూస్తే.. ఏ రోజూ ఈ శాతం తగ్గలేదు. ఇక ‘గ్రేటర్‌’ పరిధినీ కలుపుకొంటే 75% పాజిటివ్‌లు రాజధాని పరిసర ప్రాంతాలవేనని స్పష్టమవుతోంది.  అంటే, మిగతా 30 జిల్లాల్లో నమోదయ్యే కేసులు 30% కూడా లేవు. ఇలాంటి సందర్భంలోనే సంక్రాంతి సెలవులకు ప్రయాణాలు ప్రారంభమవుతుండడం ఉలికిపాటుకు గురిచేస్తోంది.


అలాగైతే ప్రమాదమే..

పండుగ సెలవులు రావడంతో ఏటా మాదిరిగానే నగరవాసులంతా పల్లె బాటపడుతున్నారు. వీరి సంఖ్య 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. అయితే, ఈసారి వెళ్తూ వెళ్తూ వైర్‌సను కూడా మోసుకెళ్లే ముప్పు కనిపిస్తోంది. హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లో 5 రోజుల్లో 5 వేలకు పైగా కేసులు వచ్చాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉపాధి, ఉద్యోగాలకు వచ్చినవారు ‘గ్రేటర్‌’ పరిధిలోని ఈ జిల్లాల్లోనే ఉంటారు. కాగా, ఒమైక్రాన్‌ జనంలోకి వెళ్లిపోయిందని.. ప్రస్తుత కేసుల్లో 70% ఈ వేరియంట్‌వేనని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుతం ఒమైక్రాన్‌ గ్రేటర్‌ జిల్లాలకే ఎక్కువగా పరిమితమైంది. మరోవైపు గ్రామాల్లో ఎక్కువగా 45 ఏళ్లు పైబడినవారు, వృద్ధులే ఉంటున్నారు. విద్య, ఉపాధి కోసం నగరంలో ఉంటున్న యువత సెలవులతో పల్లెబాట పట్టడంతో అక్కడా వ్యాపించే ముప్పుంది. క్రిస్మ్మస్‌, డిసెంబరు 31 నాటి ప్రభావం నాలుగైదు రోజుల్లోనే కనిపించింది. సంక్రాంతి అనంతరం పల్లెల్లోనూ భారీగా కేసులు వస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే అంచనాతో ఉంది.


మళ్లీ వైరస్‌ అంటుకుంటే..

వైద్య సౌకర్యాలు తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లో  కొవిడ్‌ మొదటి, రెండో వేవ్‌లలో సరైన చికిత్స అందక వేలమంది మరణించారు. అయితే, వ్యాక్సినేషన్‌ బాగా జ రిగినందున థర్డ్‌ వేవ్‌లో ఆస్పత్రుల పాలయ్యేవారు త క్కువగా ఉంటారని చెబుతున్నా.. పెద్దసంఖ్యలో కేసులోస్తే కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  




ఏ మాత్రం లక్షణాలున్నా ప్రయాణాలు వద్దు

వీలైనంత మేర పండుగ ప్రయాణాలు తగ్గించుకోండి. ఇప్పటికే ఒమైక్రాన్‌ జనంలోకి వెళ్లిపోయింది. రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయి. ప్రజలు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సివస్తే మాస్కు ధరించాలి. భౌతిక దూరం పాటించాలి. ఏమాత్రం లక్షణాలున్నా ప్రయాణాలు మంచిది కాదు. ఇంటికే పరిమితమవండి.

డాక్టర్‌ గడల శ్రీనివాసరావు, డీహెచ్‌


రాష్ట్రంలో 2 వేలకుపైనే కేసులు

రాష్ట్రంలో శుక్రవారం 64,474 టెస్టులు చేయగా.. 2,295 మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. గత ఏడాది జూన్‌ 5న 2,070 కేసులు రాగా.. తర్వాత ఇవే అత్యధికం. ఈ నెల 1న 317 కేసులు రాగా.. ఏడు రోజుల్లోనే ఏడు రెట్లు పెరిగాయి. వైర్‌సతో మరో ముగ్గురు చనిపోయారు.  తాజా పాజిటివ్‌లలో హైదరాబాద్‌లో 1,452, మేడ్చల్‌లో 232, రంగారెడ్డి జిల్లాలో 218, సంగారెడ్డిలో 50, హనుమకొండలో 54 వచ్చాయి. కాగా, కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్యుడు ఉప కమిటీ కన్వీనర్‌ రవికుమార్‌ పిళ్లైకు కరోనా సో కింది. గత సోమవారం ఢిల్లీనుంచి వచ్చిన ఈయన సమావేశాల్లో పాల్గొన్నారు. మరుసటి రోజు లక్షణాలు కనిపించాయి. గురువారం వైరస్‌ నిర్ధారణ అయింది.  


వరంగల్‌ నిట్‌లో కలకలం

వరంగల్‌ నిట్‌లో ప్రొఫెసర్‌, ఆడ్మినిస్ట్రేషన్‌ సిబ్బంది ఒకరికి కరోనా సోకింది. దీంతో ఫ్యాకల్టీ, ఉద్యోగులకు ఇంటినుంచి పని చేయాలని ఆదేశాలు ఇచ్చారు. శుక్రవారం 500 మంది విద్యార్థులు క్యాంపస్‌ నుంచి వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామానికి చెందిన వ్యక్తికి, ఎల్లారెడ్డికి చెందిన ప్రవాస భారతీయుడి కుటుంబంలో ఒకరికి ఒమైక్రాన్‌ నిర్ధారణ అయింది. ఎన్‌ఆర్‌ఐకి అంతకుముందే ఒమైక్రాన్‌ సోకినట్లు తేలింది. 



Updated Date - 2022-01-08T06:56:52+05:30 IST