రిజల్ట్స్‌ చెప్పండి.. ప్లీజ్‌.. పేరుకుపోతున్న కరోనా నిర్ధారణ శాంపిల్స్‌

ABN , First Publish Date - 2020-07-04T21:39:00+05:30 IST

గడిచిన నెల రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో పరీక్ష చేయాల్సిన శాంపిల్స్‌ కూడా పెరుగుతోంది. కానీ అంత సామర్థ్యం ప్రస్తుతం జిల్లాలో లేదు

రిజల్ట్స్‌ చెప్పండి.. ప్లీజ్‌.. పేరుకుపోతున్న కరోనా నిర్ధారణ శాంపిల్స్‌

ఫలితాలు రావాల్సినవి 3 వేలపైనే!

క్వారంటైన్‌లో బాధితుల ఎదురుచూపు

పరీక్షల సామర్థ్యం పెంచుకోకపోతే కష్టమే


నెల్లూరు (ఆంధ్రజ్యోతి) : గడిచిన నెల రోజులుగా జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అదే సమయంలో పరీక్ష చేయాల్సిన శాంపిల్స్‌ కూడా పెరుగుతోంది. కానీ అంత సామర్థ్యం ప్రస్తుతం జిల్లాలో లేదు. దీంతో వేలాది శాంపిల్స్‌ ల్యాబ్‌లలో పేరుకుపోతున్నాయి. వారం రోజులకు కూడా ఫలితాలు రావడం కష్టంగా మారుతోంది. పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులు కరోనా నుంచి కోలుకొని ఇంటికి చేరుకుంటున్నప్పటికీ వారి కాంటాక్ట్స్‌ మాత్రం ఫలితాలు రాక క్వారంటైన్‌ కేంద్రాల్లోనే ఉండాల్సి వస్తోంది. ఇది భవిష్యత్‌లో మరింత ప్రమాదాన్ని హెచ్చరిస్తోంది. ప్రస్తుతం మూడు వేలకు పైగానే శాంపిల్స్‌ ల్యాబ్‌లలో ఉన్నాయి. గురువారం నాటికి జిల్లాలో 849 పాజిటివ్‌ కేసులు జిల్లాలో నమోదవగా వారిలో 501 మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు. 337 మంది ఐసోలేషన్‌లో చికిత్స పొందుతుండగా 14 మంది మరణించారు. ఇక జిల్లాలోని ఎనిమిది క్వారంటైన్‌ కేంద్రాల్లో 302 మంది ఉన్నారు. అదే విధంగా హోం క్వారంటైన్‌లో ఉన్న వారి సంఖ్య కూడా వందల్లోనే ఉంది. వీరందరికీ కరోనా పరీక్షల కోసం శాంపిల్స్‌ తీశారు. అయితే చాలా వరకూ ఇంకా ఫలితాలు వెల్లడికాలేదు. 


ఇప్పటి వరకు జిల్లాలో 76,533 శాంపిల్స్‌ సేకరించగా 73,432 ఫలితాలు వెల్లడించారు. ఇంకా 3101 మంది అనుమానితులకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కావాల్సి ఉంది. జిల్లాలో ఇటు ట్రూనాట్‌, అటు ఆర్టీపీసీఆర్‌ ల్యాబ్‌ ద్వారా 650 వరకు శాంపిల్స్‌ను పరీక్షిస్తున్నారు. అయితే కొన్ని రోజుల నుంచి కేసులు పెరుగుతుండడంతో అనుమానితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో శాంపిల్స్‌ సేకరణ ఎక్కువగా జరుగుతోంది. అయితే, ఆ స్థాయిలో పరీక్షలు మాత్రం జరగడం లేదు. అప్పటికీ కలెక్టర్‌ ఆదేశాలతో వెయ్యి శాంపిల్స్‌ను రెండు రోజుల క్రితం తిరుపతికి పంపారు. కానీ ఇది కూడా సరిపోదని, జిల్లాలో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. కోవూరు మండలానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకగా ఐసోలేషన్‌కు తరలించారు. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు పంపారు. 


అయితే పాజిటివ్‌ వచ్చిన వ్యక్తికి పది రోజుల తర్వాత నెగిటివ్‌ రావడంతో ఆసుపత్రి నుంచి వైద్యులు డిశ్చార్జి చేశారు. అయితే సదరు కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫలితాలు మాత్రం ఇంత వరకు రాలేదు. దీంతో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఇంటికెళ్లినప్పటికీ వారి కుటుంబ సభ్యులు మాత్రం క్వారంటైన్‌లోనే ఉన్నారు.  అదే విధంగా అత్యవసర శస్త్ర చికిత్సలు చేయించుకుందామని ప్రైవేటు ఆసుపత్రులకు వెళితే ముందు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని రమ్మంటున్నారు. ఈ రోగులు శాంపిల్స్‌ ఇచ్చినా ఫలితాలు రావడం ఆలస్యమవుతుండడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సకాలంలో ఫలితాలు రాకపోవడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. రాబోవు రోజుల్లో కరోనా కేసుల సంఖ్య పెరిగే ప్రమాదముందన్న హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో పరీక్షల సామర్థ్యం పెంచకపోతే కష్టమేనన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2020-07-04T21:39:00+05:30 IST