తాత్కాలిక మార్కెట్‌లో... కరోనా నిరోధక టన్నెల్‌

ABN , First Publish Date - 2020-04-08T12:04:44+05:30 IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జన సమూహం

తాత్కాలిక మార్కెట్‌లో... కరోనా నిరోధక టన్నెల్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి: కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా జన సమూహం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ‘కరోనా నిరోధక టన్నెల్‌’ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.  శ్రీకాకుళం 80 అడుగుల రోడ్డులో తాత్కాలిక మార్కెట్‌ వద్ద నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన టన్నెల్‌ను మంగళవారం కలెక్టర్‌ జె.నివాస్‌ ప్రారంభించారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఉదయం వేళ.. నిత్యావసరాలు, కూరగాయల కొనుగోలుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు.


ఈ జన సమూహంలో ఇన్‌ఫెక్షన్‌ సోకకుండా.. అధికారులు అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో ఈ టన్నెల్‌ను ఏర్పాటు చేశారు. ప్రమాదకర క్రిములు.. వైరస్‌.. ఇతర ఇన్‌ఫెక్షన్లు వెదజల్లే క్రిములను పారదోలేందుకు ఈ టన్నెల్‌లో సోడియం హైపో క్లోరైడ్‌ స్ర్పే జరుగుతుంది. టన్నెల్‌లో నడిచి వెళితే.. ఈ ద్రావణం పిచికారీ అయి దుస్తులు, శరీరంపైనా ఉండే క్రిములు, వైరస్‌లు తొలగిపోతాయి. 


గ్రామాల కంటే పట్టణాల్లోనే మార్కెట్ల వద్ద జనసమూహం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇటువంటి టన్నెల్‌లను త్వరలో అన్ని మునిసిపాలిటీలు, నగర పంచాయతీ కేంద్రాల్లో ఏర్పాటుకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేశారు.  శ్రీకాకుళంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ టన్నెల్‌ను బాలాజీ ఫ్యాబ్రిక్స్‌ సంస్థ తయారు చేసింది. ఇందుకోసం సుమారు రూ.లక్ష లోపే ఖర్చయింది. ఇదే తరహాలో ఇచ్ఛాపురం, పలాస కాశీబుగ్గ, ఆమదాలవలస మున్సిపాలిటీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీల్లోనూ అతి త్వరలో టన్నెల్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-04-08T12:04:44+05:30 IST