ఫోన్‌కే కరోనా రిపోర్టు

ABN , First Publish Date - 2020-08-01T07:28:12+05:30 IST

కొంతమంది కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటున్నారు. ఆ సమయంలో తప్పుడు అడ్ర స్‌లు, తప్పుడు ఫోన్‌ నంబర్లు ఇస్తున్నారు. పాజిటివ్‌ వస్తే, వారిని గుర్తించడం వైద్య ఆరోగ్య శాఖకు తలనొప్పిగా మారింది! మరి కొంతమందికి రిపోర్టులు ఇవ్వడం ఆలస్యమవుతోంది! దాంతో, వారు ఆస్పత్రుల్లో చేరడానికీ ఇబ్బంది ఎదురవుతోంది! ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా

ఫోన్‌కే కరోనా రిపోర్టు

  • పరీక్ష చేయాలంటే రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి
  • ఇందుకు ఫోన్‌కు వచ్చే ఓటీపీ చెప్పాల్సిందే
  • ఆ తర్వాతే శాంపిల్స్‌ స్వీకరణ.. రిపోర్టు
  • దానితో నేరుగా ఆస్పత్రిలో చేరే అవకాశం
  • తప్పుడు అడ్రస్‌, ఫోన్‌ నంబర్లకు చెక్‌
  • స్విచ్ఛాఫ్‌ చేస్తే.. పోలీసుల ద్వారా గుర్తింపు
  • రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త విధానం


హైదరాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి): కొంతమంది కొవిడ్‌ టెస్ట్‌ చేయించుకుంటున్నారు. ఆ సమయంలో తప్పుడు అడ్ర స్‌లు, తప్పుడు ఫోన్‌ నంబర్లు ఇస్తున్నారు. పాజిటివ్‌ వస్తే, వారిని గుర్తించడం వైద్య ఆరోగ్య శాఖకు తలనొప్పిగా మారింది! మరి కొంతమందికి రిపోర్టులు ఇవ్వడం ఆలస్యమవుతోంది! దాంతో, వారు ఆస్పత్రుల్లో చేరడానికీ ఇబ్బంది ఎదురవుతోంది! ఈ సమస్యలన్నిటికీ పరిష్కారంగా కొవిడ్‌ ల్యాబ్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ఇకనుంచి కరోనా పరీక్షకు రిజిస్ట్రేషన్‌ తప్పనిసరి చేసింది. రిజిస్ట్రేషన్‌ సమయంలో మొబైల్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (ఓటీపీ) చెప్పాల్సిందే. ఓటీపీ చెబితేనే రిజిస్ట్రేషన్‌ పూర్తి అవుతుంది. అప్పుడు మాత్రమే శాంపిల్స్‌ తీసుకుంటారు. ఈ కొత్త విధానం శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చింది. యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు రెండింటికీ దీనిని తప్పనిసరి చేశారు. ప్రభుత్వంతోపాటు ప్రైవేటు ల్యాబ్‌లు, ఆస్పత్రుల్లోనూ ఈ విధానాన్ని పాటించాల్సిందే.

ఫోన్‌ మెసేజ్‌ చూపి ఆస్పత్రుల్లో చేరవచ్చు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. టెస్టులు తక్కువ చేస్తున్నారంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది కూడా. ఈ నేపథ్యంలోనే, ప్రభుత్వం కూడా పరీక్షల సామర్థ్యాన్ని పెంచుతూ వస్తోంది. మున్ముందు రోజుకు 25-30 వేల టెస్టులు చేసే దిశగా అడుగులు వేస్తోంది. అదే సమయంలో, పాజిటివ్‌ వచ్చిన వారికి సంబంధిత రిపోర్టును వెంటనే అందజేయాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖపై ఉంది. ప్రస్తుతం టెస్టులు చేస్తున్నారు. కానీ, రోగికి సకాలంలో రిపోర్టు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. పాజిటివ్‌ రిపోర్టు లేకుండా గాంధీ తదితర ఆస్పత్రుల్లో చేర్చుకోవడం లేదు. దాంతో, పాజిటివ్‌ అని వచ్చిన తర్వాత కూడా పలువురు ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కొంతమంది మాత్రం చాలా ఆలస్యంగా అయినా ఫోన్‌కు వచ్చిన మెసేజ్‌లనే చూపుతూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 1100 కేంద్రాల్లో రోజుకు దాదాపు 20 వేల యాంటీజెన్‌, ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేస్తున్నారు. వాటిలో 5 వేల వరకు ఆర్టీపీసీఆర్‌ టెస్టులు (ప్రైవేటులో 1900, ప్రభుత్వంలో 3100) కాగా, మిగిలినవన్నీ యాంటీ జెన్‌ టెస్టులే. కరోనా పరీక్ష చేయించుకోవడానికి ఇకనుంచి ఆయా కేంద్రాలకు వచ్చే వ్యక్తులు ముందుగా తన ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌ చెప్పాలి. వైద్య సిబ్బంది దానిని యాప్‌లో ఎంటర్‌ చేయగానే సంబంధిత వ్యక్తి ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. యాప్‌లో దానిని పేర్కొంటేనే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఇక, ఫలితం వచ్చిన తర్వాత ఒక లింకును శాంపిల్‌ ఇచ్చిన వ్యక్తి ఫోన్‌ నంబరుకు పంపిస్తారు. దాన్ని క్లిక్‌ చేస్తే పాజిటివ్‌ లేదా నెగెటివ్‌ రిపోర్టు ఫలితం ఉంటుంది.

నెగెటివ్‌ వచ్చిన వారికీ ఉపయోగమే

ప్రస్తుతం సాధారణ జ్వరం వచ్చి ఏదైనా ఆస్పత్రికి వెళితే కొవిడ్‌ అనుమానితులుగా చూస్తున్నారు. ముందుగా కరోనా నిర్ధారణ టెస్టు చేయించుకు రావాలని సూచిస్తున్నారు. తాజా విధానంతో నెగెటివ్‌ వచ్చిన వారు ఇతర చికిత్సలు సులభంగా పొందడానికి వీలుంటుంది. అలాగే, విమాన ప్రయాణికులకు కొన్ని రాష్ట్రాల్లో క్వారంటైన్‌ తప్పనిసరి చేశారు. నెగెటివ్‌ రిపోర్టు ఉన్నవారికి విమాన ప్రయాణాల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండదు.


స్విచ్ఛాఫ్‌ చేస్తే రంగంలోకి పోలీసులు

పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులను వైద్య ఆరోగ్య శాఖ ఫోన్‌ ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. హోం ఐసొలేషన్లో ఉంచి కిట్‌లను అందజేస్తోంది. అయితే, తప్పుడు ఫోన్‌ నంబర్లు ఇవ్వడమే కాదు.. పాజిటివ్‌ రిపోర్టు వచ్చిన తర్వాత కొంతమంది తమ ఫోన్లను స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గుర్తించారు. తాజా విధానంలోనూ ఇందుకు అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే, ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసిన వారి నంబరును వెంటనే పోలీసులకు చేరవేస్తారు. సిగ్నల్స్‌ ఆధారంగా వారు సదరు వ్యక్తి ఎక్కడ ఉన్నాడో గుర్తిస్తారు.

Updated Date - 2020-08-01T07:28:12+05:30 IST