సీమ విలవిల

ABN , First Publish Date - 2020-07-12T08:55:09+05:30 IST

కరోనా వైరస్‌ రాయలసీమలో విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే అనంతపురంలో 311, చిత్తూరు జిల్లాలో 300 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 229 మందికి

సీమ విలవిల

  • అనంత, చిత్తూరు జిల్లాల్లో ఒకేరోజు 300కు పైగా కేసులు
  • కర్నూలులోనూ తగ్గని ఉధృతి 
  • 4 జిల్లాల్లో 927 కేసులు నమోదు
  • 3వేలు దాటిన అనంత, కర్నూలు
  • రాష్ట్రంలో కొత్త కేసులు 1813
  • 8జిల్లాల్లో 17మంది మృత్యువాత 
  • రికార్డులు తిరగరాస్తున్న కరోనా 
  • మొత్తం పాజిటివ్‌లు 27235
  • 309కి పెరిగిన కొవిడ్‌ మరణాలు


కరోనా వైరస్‌ రాయలసీమలో విలయతాండవం చేస్తోంది. 24 గంటల వ్యవధిలోనే అనంతపురంలో 311, చిత్తూరు జిల్లాలో 300 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలులో 229 మందికి వ్యాధి నిర్ధారణ అయింది. తాజా కేసుల్లో 50 శాతానికి పైగా సీమ పరిధిలోనే ఉండగా, రాష్ట్రంలోని మొత్తం మరణాల్లో దాదాపు 47శాతం ఇక్కడే నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. 


అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): గతంలో ఒక్కరోజులో రాష్ట్రం మొత్తమ్మీద నమోదయ్యే కేసులు ఇప్పుడు ఒక్క జిల్లాలోనే వెలుగులోకి వస్తున్నాయి. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ వందల సంఖ్యలో జనం వైరస్‌ బారిన పడుతున్నారు. మొన్నటివరకూ సేఫ్‌జోన్‌లో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ రోజుకు 200వరకూ కేసులు నమోదవుతున్నాయి. అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాలు కొవిడ్‌ ధాటికి అతలాకుతలం అవుతున్నాయి. పాజిటివ్‌ల విషయంలో కర్నూలుతో అనంతపురం జిల్లా పోటీ పడుతోంది. ప్రస్తుతం కర్నూలులో 3,168 కేసులు ఉండగా, అనంతలో 3,161 నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలోని ఆస్పత్రుల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 1,612మంది చికిత్స పొందుతున్నారు. ఆ తర్వాత చిత్తూరులో 1,364, అనంతపురంలో 1,317 చొప్పున యాక్టివ్‌ కేసులున్నాయి. రానున్న రోజుల్లో అనంతపురం, చిత్తూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో కరోనా బీభత్సం సృష్టించనుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. 


శనివారం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 1,813 కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం 20,590మందికి పరీక్షలు నిర్వహించగా రాష్ట్రంలోని 1,775మందికి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 34మందికి, విదేశాల నుంచి వచ్చిన నలుగురికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీటితో కలిపి మొత్తం పాజిటివ్‌లు 27,235కు చేరాయి. తాజాగా 1,168మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకూ 14,393మంది డిశ్చార్జ్‌ కాగా, 12,533మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో శనివారం ఒకేరోజు అత్యధికంగా 17మంది కరోనాతో మృతి చెందారు. కర్నూలులో నలుగురు, గుంటూరు, విజయనగరం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున, అనంతపురం, కడప, విశాఖల్లో ఒక్కొక్కరు చొప్పున మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాలు 309కి చేరాయి. కర్నూలు జిల్లాలో రెండు పీహెచ్‌సీల్లో పనిచేసే ఇద్దరు ప్రభుత్వ వైద్యులకు, గూడూరులో ఓ వైద్యురాలికి, కర్నూలు నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో ఫిజీషియన్‌కు, ఓ ఐసీయూ స్పెషలిస్టుకు, నందికొట్కూరులో ఓ కానిస్టేబుల్‌కి, హోంగార్డుకు కరోనా నిర్ధారణ అయింది.


మరో 17మంది మృతి

కొవిడ్‌ బారినపడి విశాఖలో ఏడుగురు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పు గోదావరి, నెల్లూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున శనివారం మృతిచెందారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాతంలో ఓ ఎమ్మార్వోకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మంగళగిరిలో ఒకేరోజు 44 కొత్త కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జోడుగుళ్లపాలెం పరిధిలో ఒకేరోజు 28మంది వైరస్‌ బారిన పడటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 


4నెలల పసిబిడ్డకు కరోనా 

తూర్పుగోదావరి జిల్లాలో మరో 270మందికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. అంబాజీపేట మండలంలో నాలుగు నెలల పసిబిడ్డకు పాజిటివ్‌ వచ్చింది. కత్తిపూడి సచివాలయంలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలగా, వారిలో ఒకరు సచివాలయ ఉద్యోగి. గుంటూరులో 155, నెల్లూరులో 149, కృష్ణాజిల్లాలో 123, ప్రకాశం జిల్లాలో 113, కడప జిల్లాలో 48, విజయనగరంలో 81, విశాఖలో 66, శ్రీకాకుళం జిల్లాలో 47, పశ్చిమ గోదావరిలో 17 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-07-12T08:55:09+05:30 IST