కరోనా @మిలియన్‌

ABN , First Publish Date - 2020-04-03T09:07:06+05:30 IST

ఎక్కడై చైనాలోని వూహాన్‌లో పుట్టి.. ఒకరి తర్వాత మరొకరికి సోకుతూ.. ప్రపంచదేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్‌ ఏకంగా పది లక్షల మందికి సోకింది! ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం...

కరోనా @మిలియన్‌

  • వైరస్‌ బాధితుల్లో 5 లక్షల మందికిపైగా యూర్‌పవారే
  • ప్రపంచవ్యాప్తంగా 51 వేలు దాటిన మృతుల సంఖ్య
  • ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో కొవిడ్‌-19 మరణ మృదంగం
  • గురువారం ఒక్కరోజే ఇటలీలో 760 మంది మృతి
  • స్పెయిన్‌లో  709 మంది.. బ్రిటన్‌లో 569 మంది బలి
  • యూరప్‌ మృతుల్లో 90 శాతం వృద్ధులే: డబ్ల్యూహెచ్‌వో
  • ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రికి సోకిన కొవిడ్‌-19

లండన్‌, మెల్‌బోర్న్‌, ఏప్రిల్‌ 2: ఎక్కడై చైనాలోని వూహాన్‌లో పుట్టి.. ఒకరి తర్వాత మరొకరికి సోకుతూ.. ప్రపంచదేశాలన్నింటికీ విస్తరించిన కరోనా వైరస్‌ ఏకంగా పది లక్షల మందికి సోకింది! ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తోంది. మరీ ముఖ్యంగా.. యూరప్‌ ఖండాన్ని అతలాకుతలం చేస్తోంది. అందునా.. ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లో మరణ మృదంగం మోగిస్తోంది. గురువారం నాటికి నమోదైన 10 లక్షల కేసుల్లో ఐదు లక్షలకు పైగా కేసులు ఒక్క యూరప్‌ ఖండంలోనే నమోదయ్యాయి. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 11.30 గంటలకు కరోనా మృతుల సంఖ్య 51 వేలు దాటింది. వారిలో దాదాపు 35 వేల మంది యూర్‌పవాసులే. కరోనా మరణాల్లో సగానికిపైగా.. ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లోనే నమోదయ్యాయి. ఇటలీలో కరోనాకు బలైనవారి సంఖ్య 13,155కు చేరగా, స్పెయిన్‌లో 10 వేలు దాటింది. ఒక్క గురువారమే 616 మంది కరోనా బాధితులు స్పెయిన్‌లో ప్రాణాలు కోల్పోయారు. స్పెయిన్‌ తర్వాత అత్యధికంగా యూకేలో ఒక్క రోజే 569 మంది, బెల్జియంలో 183 మంది చనిపోయారు.


బెల్జియంలో మృతుల సంఖ్య మూడు రోజుల్లో రెట్టింపు కావడం గమనార్హం. నెదర్లాండ్స్‌లో ఒక్కరోజులో 166 మంది, స్వీడన్‌లో 43, జర్మనీలో 28, పోర్చుగల్‌లో 22, స్విట్జర్లాండ్‌లో 17 మంది చనిపోయారు. యూర్‌పలో సంభవిస్తున్న మరణాల్లో 95 శాతం 60 ఏళ్ల పైబడినవారివేనని, ఆ 95 శాతంలో కూడా సగం మంది 80 ఏళ్లు దాటినవారేనని యూర్‌పలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యాలయం ప్రకటించింది. అదేసమయంలో యువత కూడా ఈ వైరస్‌ బారిన పడుతున్నారని అభిప్రాయపడింది.  ఇరాన్‌లో.. ఇజ్రాయెల్‌లో..  ఇరాన్‌లో కూడా గురువారం ఒక్కరోజే 124 మంది చనిపోయారు. అక్కడ మృతుల సంఖ్య 3,160కి పెరిగిం ది. ఇజ్రాయెల్‌ ఆరోగ్య మంత్రికి కూడా కొవిడ్‌-19 సోకింది.  ఆ దేశ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ కొద్దిరోజులుగా స్వీయ ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రపంచం మొత్తమ్మీదా అత్యధికంగా కరోనా పరీక్షలను చేస్తున్న దేశం తమదేనని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మోరిసన్‌ ప్రకటించారు. ఆస్ట్రేలియాలో 5137 మందికి వైరస్‌ సోకగా 25 మంది మరణించారు. కొవిడ్‌-19పై పోరులో భాగంగా రూపొందించిన రెండు టీకాలను ఆస్ట్రేలియా శాస్త్రజ్ఞులు పరీక్షిస్తున్నారు.  వీటిని ఇంజెక్షన్‌ రూపంలో ఇవ్వాలా లేక నేరుగా ముక్కులోకి చల్లుకునే ‘నేసల్‌ స్ర్పే’ రూపంలో ఇవ్వాలా అనే అంశాన్ని పరిశీలిస్తున్నారు. టీకా పరీక్షలు మూడు నెలలపాటు కొనసాగనున్నాయి. చైనాలో విదేశాల నుంచి వచ్చిన 35 మందికి వైరస్‌ పాజిటివ్‌ వచ్చింది. కాగా, 90కి పైగా దేశాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయి. కరోనా వైరస్‌ చైనాకు ఆనుకునే ఉన్న ఉత్తర కొరియాలో అడుగుపెట్టలేకపోతోంది! ఆ దేశంలో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదట. 



Updated Date - 2020-04-03T09:07:06+05:30 IST