ముగ్గురు హైకోర్టు జడ్జిలకు కరోనా.. ఇంటి నుంచే విచారణ

ABN , First Publish Date - 2020-06-07T16:00:46+05:30 IST

మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఇంటి నుంచే కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా

ముగ్గురు హైకోర్టు జడ్జిలకు కరోనా.. ఇంటి నుంచే విచారణ

చెన్నై : మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఇంటి నుంచే కేసులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారిస్తారని రిజిస్ట్రార్‌ జనరల్‌ కుమరప్పన్‌ ప్రకటించారు. హైకోర్టు న్యాయమూర్తులు ముగ్గురికి కరోనా సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధక నిషేధాజ్ఞల కారణంగా రెండు నెలలపాటు హైకోర్టు మూతపడింది. కీలకమైన, అత్యవసరమైన కేసులపై న్యాయమూర్తులు వారి నివాసగృహాల నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచారణ జరుపుతూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటి నుంచి న్యాయమూర్తులంతా హైకోర్టులోనే కేసుల విచారణను ప్రారంభించారు. న్యాయమూర్తుల చాంబర్లలో కట్టుదిట్టమైన కరోనా నిరోధక నిబంధనల నడుమ న్యాయమూర్తులు కేసుల విచారణ చేపట్టారు. ఈ పరిస్థితుల్లో ముమ్మరంగా కేసుల విచారణ జరుపుతూ వచ్చిన ముగ్గురు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బందిలో కొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.


వారికి వైద్యపరీక్షలు నిర్వహించినప్పుడు కరోనా పాజిటివ్‌ లక్షణాలు బయటపడడంతో వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఒకేసారి ముగ్గురు న్యాయమూర్తులకు కరోనా సోకడంతో హైకోర్టులో కేసుల విచారణను అర్ధంతరంగా ఆపివేశారు. ఆ తర్వాత హైకోర్టు పాలకమండలి సభ్యులు సమావేశమై ఇకపై కేసుల విచారణను న్యాయమూర్తులు వారి నివాసగృహాల నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జరపాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ కుమరప్పన్‌ ప్రకటించారు. సోమవారం నుంచి ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన రెండు ధర్మాసనాలు మాత్రమే అత్యవసరమైన కేసుల విచారణ జరుపుతుందన్నారు. అదే విధంగా నలుగురు ప్రత్యేక న్యాయమూర్తులు, రెండు ధర్మాసనాలలో ఉన్న నలుగురు న్యాయమూర్తులు తమ నివాసగృహాల నుంచే కేసుల విచారణ జరుపుతారని ప్రకటించారు. న్యాయవాదులు తమ కేసులకు సంబంధించిన వాదనలను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వినిపించాలని కుమరప్పన్‌ తెలిపారు.

Updated Date - 2020-06-07T16:00:46+05:30 IST