ఆ రైల్లో ప్రయాణించడంతో ఒకరికి పాజిటివ్.. మర్కజ్ ప్రార్థనలతో సంబంధం లేకున్నా..

ABN , First Publish Date - 2020-04-03T20:26:27+05:30 IST

మహబూబాబాద్‌ జిల్లాలోని గడ్డిగూడెంకు చెందిన మాజీ నక్సలైట్‌కు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వైద్య, పోలీసు, రెవెన్యూ అధికారుల బృందం అప్రమత్తమైంది.

ఆ రైల్లో ప్రయాణించడంతో ఒకరికి పాజిటివ్.. మర్కజ్ ప్రార్థనలతో సంబంధం లేకున్నా..

మానుకోట జిల్లాలో అలర్ట్‌

రైలులో ప్రయాణించిన మాజీ నక్సలైట్‌కు పాజిటివ్‌


మహబూబాబాద్ ‌(ఆంధ్రజ్యోతి) : మహబూబాబాద్‌ జిల్లాలోని గడ్డిగూడెంకు చెందిన మాజీ నక్సలైట్‌కు కరోనా పాజిటివ్‌ రిపోర్ట్‌ రావడంతో వైద్య, పోలీసు, రెవెన్యూ అధికారుల బృందం అప్రమత్తమైంది. కలెక్టర్‌ వీపీ.గౌతమ్‌, ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి డీఎంహెచ్‌వో ధన్నసరి శ్రీరాం, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ భీమ్‌సాగర్‌ ఫోన్‌ల ద్వారా అత్యవసర భేటీ అయి పరిస్థితిపై సమీక్షించారు. ఆపై డీఎంహెచ్‌వో శ్రీరామ్‌ నేతృత్వంలో కంబాలపల్లి పీహెచ్‌సీ వైద్యుడు సుధీర్‌నాయక్‌, తహసీల్దార్‌ రంజిత్‌కుమార్‌, ఎంపీడీవో రవీందర్‌, సీఐ వెంకటరత్నం, ఎస్సై రమే్‌షబాబు సిబ్బందితో మధ్యాహ్నం గడ్డిగూడెం గ్రామానికి చేరుకున్నారు. మాజీ నక్సలైట్‌తో సన్నిహితంగా మెలిగే వారి సమాచారాన్ని సేకరించారు. ఆయన ఇంటికినిత్యం వెళ్లివచ్చే వారిని గుర్తించారు.


ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత ఆయన ఎవరెవరితో సన్నిహిత సంబంధాలు నెరిపారు అన్న అంశాన్ని క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. మాజీ నక్సలైట్‌ ఇంట్లోని ముగ్గురు, పక్కింట్లోని ఒక ఆర్‌ఎంపీ, టైలరింగ్‌ నేర్చుకోవడానికి ఆ ఇంటికి వెళ్లే యువతిని గుర్తించి ఆరుగురిని మహబూబాబాద్‌లోని కలెక్టరేట్‌ సమీపాన గల ట్రైబల్‌ వెల్ఫేర్‌ భవనంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ హోమ్‌కు తరలించింది. వీరి రక్తనమూనాలు కూడా సేకరించి హైదరాబాద్‌కు పంపించింది. అంతేకాకుండా టైలరింగ్‌ నేర్చుకునే అమ్మాయి ఇంట్లోనే ఐదుగురు, ఆర్‌ఎంపీ ఇంట్లో ఇద్దరిని హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశించింది. అం తేకాక రత్రి వరకు గడ్డిగూడెం గ్రామంలోనే ఉండి కరోనా వ్యాప్తిపై ప్రజల ను అప్రమత్తం చేశారు. పాజిటివ్‌ వ్యక్తి గురించి ఆందోళన అవసరం లేదని, వైద్యం అందిస్తున్నామని, త్వరలోనే కొలుకునే అవకాశముంటుందని భరోసా కల్పించారు. గ్రామ ప్రధాన వీధులపై సోడియం హైపోక్లోరైడ్‌ పిచికారి చేశారు. ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్య తలెత్తిన వెంటనే గ్రామ వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని సూచించారు.


తెలంగాణ, శాతవాహన రైళ్లలో..

జిల్లాలోని గడ్డిగూడెంకు చెందిన మాజీ నక్సలైట్‌కు ఢిల్లీ మర్కజ్‌ ప్రార్థనలతో సంబంధం లేకున్నప్పటికీ.. కేవలం రైళ్లలో ప్రయాణం చేయడం ద్వారా కరోనా సోకడం కలకలం రేపింది. ఓ సంస్థ సమావేశానికి ఢిల్లీకి వెళ్లిన సదరు మాజీ నక్సలైట్‌.. మార్చి 17న తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఎక్కి 18న కాజీపేటలో దిగాడు. ఆ తర్వాత శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ రైలు ద్వారా మహబూబాబాద్‌కు చేరుకుని స్థానిక గిరిప్రసాద్‌నగర్‌కు వచ్చి తన సోదరి ఇంటి వద్ద ఉన్న సొంత ఆటోను తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఆ మాజీ నక్సలైట్‌ ఢిల్లీ నుంచి వచ్చాడని తెలిసి అధికారులు అదే నెల 31న జిల్లా ఆస్పత్రి ఐసోలేషన్‌ వార్డులో చేర్చించారు. రక్తనమూనాలు సేకరించి హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి పంపించారు. గురువారం మధ్యాహ్నం ఆ నమూనాల రిపోర్ట్‌లో పాజిటివ్‌ అని తేలడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Updated Date - 2020-04-03T20:26:27+05:30 IST