సూపర్‌ శానిటేషన్‌

ABN , First Publish Date - 2020-04-02T11:39:43+05:30 IST

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14 నమోదు కావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది.

సూపర్‌ శానిటేషన్‌

కరోనా ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్యంపై దృష్టి

659 ప్రత్యేక టీమ్‌లు.. 14 మండలాల్లో నిర్వహణ

యుద్ధ ప్రాతిపదికన పనులు : డీపీవో శ్రీనివాస్‌ 


ఏలూరు సిటీ, ఏప్రిల్‌ 1 : జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 14 నమోదు కావడంతో అధికార యంత్రాంగం ఉలిక్కిపడింది. ఆ కేసులు వచ్చిన ప్రాంతాల్లో సూపర్‌ శానిటేషన్‌ నిర్వహించాలని కలెక్టర్‌ ముత్యాలరాజు పంచాయతీ అధికారులకు నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ఈ మేరకు 13 మండలాలైన ద్వారకా తిరుమల, ఆకివీడు, ఉండి, పెనుగొండ, ఉంగుటూరు, నల్లజర్ల, భీమవరం, పెనుమంట్ర, ఇరగవరం, పెదపాడు, భీమడోలు, పెరవలి, లింగపాలెంలోని గ్రామ కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులతో 659 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ మండలాల్లోని 45 గ్రామ పంచాయతీల పరిధిలో సూపర్‌ శానిటేషన్‌ను బుధవారం ఉదయం నాలుగున్నరకు ప్రారంభించారు.


కరోనా కేసు నమోదైన ప్రాంతాన్ని కేంద్ర బిందువుగా తీసుకుని ఆకివీడు, కొమ్మర, దూబచర్ల, నారాయణపురం, అప్పన్నవీడు, గుండుగొలను, నర్సన్నపాలెం, అజ్జరం, పెనుగొండ, కాకిలేరు, ఉండి ఎపిక్‌ కేంద్రాలుగా గుర్తించి  పరిసర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల ఏరియాను లాక్‌డౌన్‌ చేశారు. వీధులన్నీ శుభ్రపరిచి, బ్లీచింగ్‌, మలాథియాన్‌ చల్లించారు. 62 రక్షిత మంచినీటి పథకాలను శుభ్రపరిచారు. 122 కిలోమీటర్ల మేర రహదారులపై సూపర్‌ శానిటేషన్‌ చేశారు. 98 కిలోమీటర్ల డ్రైన్స్‌ను శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో 3286 మంది పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.  కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువ నమోదు కావటంతో ఆయా ప్రాంతాల్లో సూపర్‌ శానిటేషన్‌ కార్యక్రమాలను యుద్ధప్రాతిపదికన నిర్వహిస్తున్నట్టు డీపీవో టి.శ్రీనివాస్‌ విశ్వనాథ్‌ తెలిపారు. మరోవైపు డీఎంహెచ్‌వో సుబ్రహ్మణ్వేరి నేతృత్వంలో వైద్య సిబ్బంది ఈ 45 గ్రామ పంచాయతీల్లోని 48 వేల 891 గృహాలను సందర్శించి ప్రజల ఆరోగ్యంపై సర్వే చేసి వివరాలను నమోదు చేశారు.  

Updated Date - 2020-04-02T11:39:43+05:30 IST