స్కూళ్లకు సెలవులు.. అత్తారింటికి వెళ్లిన ఉపాధ్యాయుడు.. కరోనా పాజిటివ్ అని తేలడంతో..

ABN , First Publish Date - 2020-04-10T16:47:30+05:30 IST

విశాఖ జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు(38)కు తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అత్యవసర చికిత్సకు ఆయన్ను విశాఖలోని విమ్స్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సదరు వ్యక్తి స్కూల్‌కు సెలవులు రావడంతో

స్కూళ్లకు సెలవులు.. అత్తారింటికి వెళ్లిన ఉపాధ్యాయుడు.. కరోనా పాజిటివ్ అని తేలడంతో..

ఉపాద్యాయుడికి కరోనా.. ఎవరిద్వారా సోకింది..?

పాయకరావుపేటలో నివాసం.. నక్కపల్లి మండలం వేంపాడులో ఉద్యోగం

లాక్‌డౌన్‌ కారణంగా స్కూల్‌కు సెలవులు ప్రకటించడంతో కత్తిపూడిలో గల అత్తవారింటికి...

జ్వరం రావడంతో స్థానిక ఆర్‌ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స

పరిస్థితి విషమించడంతో గురువారం కాకినాడకు తరలింపు

కరోనా పాజిటివ్‌గా తేలడంతో విశాఖ పంపిన వైద్యులు

ఉపాధ్యాయుడి కుటుంబ సభ్యులు క్వారంటైన్‌కి తరలింపు

పేటలో కలకలం.. అప్రమత్తమైన అధికారులు


(ఆంధ్రజ్యోతి-పాయకరావుపేట): విశాఖ జిల్లా పాయకరావుపేట మండలానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు(38)కు తూర్పు గోదావరి జిల్లాలో కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో అత్యవసర చికిత్సకు ఆయన్ను విశాఖలోని విమ్స్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సదరు వ్యక్తి స్కూల్‌కు సెలవులు రావడంతో గత నెల 23న తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలోని అత్తారింటికి వచ్చారు. 29న  జ్వరం వచ్చింది. సాధారణ జ్వరంగా భావించి స్థానికంగా ఓ ఆర్‌ఎంపీ వైద్యుడిని సంప్రతించి ఆయన వద్ద చికిత్స పొందుతున్నారు. జ్వరం తగ్గడం, మళ్లీ రావడంతో ఆర్‌ఎంపీ వద్దకే వెళ్లి వస్తున్నారు. కానీ గురువారం జ్వరం తీవ్రం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. 


అక్కడ కరోనా వైరస్‌ అనుమానంతో వైద్యులు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ శాంపిళ్లు తీసి పరిశీలిస్తే పాజిటివ్‌గా తేలింది. అయితే కొన్నిరోజులుగా జ్వరం ఉండడంతో ఎక్స్‌రేలో న్యూమోనియాగా తేలింది. పరిస్థితి విషమిస్తుందనే అనుమానంతో ముందుజాగ్రత్తగా విశాఖలో విమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా వుందని జీజీహెచ్‌ వైద్యులు పేర్కొన్నారు. మరోపక్క ఈ ఉపాధ్యాయుడి భార్యకు వైద్య పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌ వచ్చింది. దీంతో ఆమెను హోం క్వారంటైన్‌లో ఉంచారు. సదరు ఉపాధ్యాయుడి మామ కత్తిపూడిలో కిరాణా దుకాణం నిర్వహిస్తుంటారు. మామకు బదులుగా అప్పుడప్పుడు సదరు ఉపాధ్యాయుడు సరకు విక్రయుంచారు. దీంతో ఫస్ట్‌లెవెల్‌, సెకండ్‌ లెవెల్‌ కాంటాక్ట్స్‌ కింద 38 శాంపిళ్లను సేకరించారు. అయితే సదరు ఉపాధ్యాయుడిది విశాఖ జిల్లా కావడంతో పాజిటివ్‌ కేసు విశాఖ కరోనా పాజిటివ్‌ లెక్కల్లో కలిపారు.


పాయకరావుపేటలో కలకలం

విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట వాసికి బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చిందన్న వార్త స్థానికంగా కలకలం సృష్టించింది. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... నక్కపల్లి మండలం వేంపాడు ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు పాయకరావుపేటలోని రాజుగారిబీడు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వగ్రామం అరట్లకోట. ఇటీవల గ్రామంలో ఇల్లు కట్టుకున్న ఆయన గత నెల గృహ ప్రవేశం చేశారు. ఇదిలావుండగా కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పాఠశాలలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించడంతో గత నెల 25న కుటుంబ సభ్యులతో కలిసి తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడిలో వున్న అత్తవారింటికి వెళ్లారు. అక్కడ వుంటున్న ఆయనకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని జిల్లా ఉన్నతాధికారుల ద్వారా సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు అప్రమత్తమై అరట్లకోటలోని ఉపాధ్యాయుడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి వివరాలు సేకరించారు. ఆ ప్రాంతాన్ని కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా గుర్తించారు. అదేవిధంగా పాయకరావుపేటలోని రాజుగారిబీడులో ఉపాధ్యాయుడు నివాసముంటున్న వీధిలో కూడా బారికేడ్లు ఏర్పాటుచేశారు. పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఈ రెండు ప్రాంతాల్లో అన్ని వీధుల్లో కాలువలు శుభ్రం చేయించడంతోపాటు బ్లీచింగ్‌ చల్లించారు. సోడియం హైడ్రో క్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు.


అరట్లకోట గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సాంబశివరావు మాట్లాడుతూ మండలంలోని అరట్లకోటలో ఉపాధ్యాయుడి తల్లిదండ్రుల ఇంటి చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టి ఆరోగ్య వివరాలు సేకరిస్తారన్నారు. అదేవిధంగా పాయకరావుపేట, నామవరం, మంగవరం, సత్యవరం తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులు ముమ్మరంగా చేపట్టడం జరుగుతోందన్నారు. మంగవరం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ మురళీకృష్ణ మాట్లాడుతూ అరట్లకోటలో ఉంటున్న ఉపాధ్యాయుడి తల్లిదండ్రులు, సోదరుడి ఆరోగ్యం బాగానే ఉందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిని క్వారంటైన్‌ కేంద్రానికి తరలిస్తామని ఆయన తెలిపారు.


వేంపాడులో శానిటేషన్‌ పనులు 

తమతో కలిసి పనిచేస్తున్న ఉపాధ్యాయుడు వైరస్‌ బారినపడ్డారని వేంపాడు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఆయన గత నెల 31న తన సహాధ్యాయులకు ఫోన్‌ చేసినప్పుడు స్వల్పంగా దగ్గు వస్తుందని  చెప్పారు. రెండు రోజుల కిందట అంటే ఈ నెల ఏడో తేదీన ఆ ఉపాధ్యాయుడు పాఠశాల హెచ్‌ఎంకు ఫోన్‌ చేశారు. ఆ సమయంలో తీవ్రస్థాయిలో దగ్గు రావడాన్ని గుర్తించిన హెచ్‌ఎం తక్షణమే వైద్యులకు చూపించుకోవాలని సలహా ఇచ్చారు. దీంతో వైద్యుల వద్దకు వెళ్లినట్టు తెలిసింది. అయితే కత్తిపూడిలో ఎవరి ద్వారా ఈ వైరస్‌ ఉపాధ్యాయుడికి సోకిందనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కత్తిపూడిలో 38 మందిని పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెబుతున్నారు. కాగా ఈ విషయం తెలిసి వేంపాడు గ్రామంలో యుద్ధప్రాతిపదికన  పారిశుధ్య పనులు చేపట్టారు. హైస్కూల్‌ పరిసరాలు, రహదారులను శుభ్రం చేశారు.  


కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా అరట్లకోట

కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి తల్లిదండ్రులు నివాసం వుంటున్న అరట్లకోట గ్రామాన్ని అధికారులు కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. దీనికి మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాయకరావుపేట, అరట్లకోట, మంగవరం, గుంటపల్లి, సత్యవరం గ్రామాల్లో పారిశుధ్య పనులు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యగా పాయకరావుపేట, తుని పట్టణాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. వైద్య సిబ్బంది శుక్రవారం కంటెయిన్‌మెంట్‌ జోన్‌లో ప్రతి ఇంటికీ వెళ్లి సర్వే నిర్వహించి ప్రజల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తారు. గ్రామాలను 222 క్లస్టర్లుగా విభజించి 29 మంది సూపర్‌వైజర్లను నియమించారు.  కంటెయిన్‌మెంట్‌ జోన్‌గా ప్రకటించిన ప్రాంతంలోకి బయటవారెవరూ రాకూడదని ఏఎస్పీ వై.రిషాంత్‌రెడ్డి తెలిపారు. గురువారం ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించడానికి వచ్చిన ఆయన ప్రజలంతా పరిశుభ్రతను పాటిస్తూ ఇళ్లలోనే ఉండాలని సూచించారు.

Updated Date - 2020-04-10T16:47:30+05:30 IST