వైరస్‌ సోకుతున్నా మడమతిప్పని యోధులు

ABN , First Publish Date - 2020-07-12T11:17:42+05:30 IST

కరోనాపై పోరాటంలో తొలి శ్రేణిలో ఉండి సేవలందిస్తున్నవారు ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది. పీపీఈ కిట్లు చాలినన్ని లేకపోయినా, మాస్కుల కొరత ఉన్నా, గ్లౌజ్‌లు

వైరస్‌ సోకుతున్నా  మడమతిప్పని యోధులు

258 మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌

మెజారిటీ బాధితులు ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌

పోలీస్‌, వైద్య, మున్సిపల్‌, పీఆర్‌, టీటీడీ తదితర విభాగాల్లోనే బాధితులు


తిరుపతి, ఆంధ్రజ్యోతి

ఇదొక యుద్ధం. కనిపించని సూక్ష్మ శత్రువుతో ఆయుధాలు లేకుండా చేయాల్సిన పోరాటం. సమస్త మానవాళిని కాపాడడానికి తమ ప్రాణాలను పణంగా పెడుతున్న యోధులు ఎందరో ఉన్నారు. లాక్‌డౌన్‌లంటూ, నియంత్రణలంటూ తొలిరోజుల్లో హడావుడి చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేసినా, మడమ తిప్పకుండా విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు ఎందరో ఈ పోరాటంలో వైరస్‌ బారిన పడుతున్నారు. కరోనా పడగనీడలో ఉన్నామని తెలిసినా విధులకు వెరవడం లేదు. తగిన భద్రతా కవచాలు ఉన్నా లేకున్నా విధులు నిర్వహిస్తూనే ఉన్నారు. సాయం పేరుతో, పథకాల పంపకాల పేరుతో నాయకులు  చేస్తున్న జాతర్ల వంటి కార్యక్రమాల్లో డ్యూటీలు చేసే వీరు వైరస్‌కు గురవుతున్నారు.  అయినా అలుపెరుగక పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటిదాకా జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం అప్పగించిన విధులను నిర్వర్తించే క్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన 258 మందికి పైగా ఉద్యోగులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తమ కుటుంబాలు కూడా ప్రమాదపు అంచుల్లో ఉన్నా సేవలందిస్తూనే ఉన్న  ఈ అవిశ్రాంత పోరాటయోధులందరికీ వందనాలు.


39 మంది ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌

కరోనాపై పోరాటంలో తొలి శ్రేణిలో ఉండి సేవలందిస్తున్నవారు ప్రభుత్వ వైద్యులు, వైద్య సిబ్బంది. పీపీఈ కిట్లు చాలినన్ని లేకపోయినా, మాస్కుల కొరత ఉన్నా, గ్లౌజ్‌లు చాలకపోయినా అంకితభావంతో వైద్య సేవలు అందిస్తున్నారు వీరు. తమ వల్ల కుటుంబాలకు ఉన్న ముప్పుతెలిసీ నెలల తరబడీ అత్యవసర సేవలు అందిస్తున్నారు. ఈ సేవలందిస్తున్న వారిలో 39మంది జిల్లాలో ఇప్పటిదాకా కరోనా వైరస్‌ బారినపడ్డారు. వీరిలో వైద్యుల నుంచీ, ఆశా వర్కర్ల దాకా వున్నారు. రాష్ట్ర స్థాయి కొవిడ్‌ ఆస్పత్రిగా బాధితులను అక్కున చేర్చుకుని సేవలందిస్తున్న తిరుపతి స్విమ్స్‌ పద్మావతీ ఆస్పత్రిలో ఒక డాక్టర్‌, 14 మంది నర్సింగ్‌ సిబ్బంది, డేటా ఆపరేటర్లు పాజిటివ్‌ అయ్యారు. జిల్లా కొవిడ్‌ ఆస్పత్రిగా వున్న తిరుపతి రుయాలో ఆరుగురు వైద్యులు, ముగ్గురు నర్సింగ్‌ సిబ్బంది కరోనా బాధితులయ్యారు. నిండ్రలో ఆరుగురు పారా మెడికల్‌ సిబ్బందికి  వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది.అలాగే వడమాలపేటలో ఒకరు, శ్రీకాళ హస్తిలో ఒకరు, పిచ్చాటూరులో నర్సింగ్‌ సిబ్బంది ఒకరు, ఆశా వర్కర్‌ ఒకరు, పుత్తూరులో పారా మెడికల్‌ సిబ్బంది ఇద్దరు, చిన్నగొట్టిగల్లులో సచివాలయ ఏఎన్‌ఎం ఒకరు వైరస్‌ బారినపడ్డారు. బర్డ్‌ ఆస్పత్రిలో ఒక ల్యాబ్‌ టెక్నీషియన్‌కు వైరస్‌ సోకింది. 

 

91 మంది భద్రతా సిబ్బంది

ప్రజలంతా ఇళ్లకు పరిమితమైన లాక్‌డౌన్‌ రోజుల నుంచీ రోడ్ల మీదకొచ్చి విధులు నిర్వహిస్తున్నవారు పోలీసు సిబ్బంది. తిండీతిప్పలు సరిగా లేకపోయినా ప్రజల్ని కట్టడి చేయడంతో తలమునకలై కనిపించారు. వితరణల పేరుతో నాయకులు చేస్తున్న జాతర్లలో ప్రమాదానికి సన్నిహితంగా విధులు నిర్వహించినవారు వీరు. విధినిర్వహణలో వైరస్‌ వీరి మీదా విరుచుకుపడింది. జిల్లాలో ఇప్పటి దాకా 91మంది పోలీసు, భద్రతా సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. కొందరి కుటుంబ సభ్యులు సైతం వీరి ద్వారా బాధితులుగా మారారు. తిరుపతి అర్బన్‌ పోలీసు జిల్లా పరిధిలో డీఎస్పీ ఒకరు, సీఐ ఒకరు, ఎస్‌ఐలు ఇద్దరు, ఏఆర్‌ ఎస్‌ఐ ఒకరు, 22 మంది సిబ్బంది..మొత్తం 27మంది వైరస్‌ బారిన పడ్డారు. చిత్తూరు పోలీసు జిల్లా పరిధిలో సీఐ ఒకరు, 19 మంది సిబ్బంది, ఒక హోమ్‌గార్డు మొత్తం 22 మందికి వైరస్‌ సోకింది.


వీరి కుటుంబసభ్యులు ఎనిమిదిమంది కొవిడ్‌ బాధితులుగా మారారు. ప్రాంతాల వారీగా చూస్తే పోలీసు బలగాల్లో తొలి కరోనా కేసులు శ్రీకాళహస్తిలో నమోదయ్యాయి. అది కూడా లండన్‌, ఢిల్లీ లింకులతో కరోనా వ్యాప్తికి హాట్‌స్పాట్‌గా మారిన శ్రీకాళహస్తిలో విధులు నిర్వర్తిస్తూ ఓ మహిళా ఎస్‌ఐతో పాటు తొమ్మిదిమంది పోలీసు సిబ్బంది వైరస్‌ బారిన పడ్డారు. నగరిలో ఓ కానిస్టేబుల్‌, కార్వేటినగరంలో సచివాలయ మహిళా పోలీసు, పలమనేరులో ఓ కానిస్టేబుల్‌, బంగారుపాళ్యంలో ఇద్దరు, బీఎన్‌ కండ్రిగలో ఒకరు, ఏర్పేడులో ఒకరు, పుత్తూరులో నలుగురు, వరదయ్యపాళ్యంలో ఒకరు, పూతలపట్టులో ఏఆర్‌ కానిస్టేబుల్‌, చిత్తూరు మండలంలో ఓ హోమ్‌గార్డు, పెనుమూరులో మరో హోమ్‌గార్డుకు వైరస్‌ సోకింది. నగరి నియోజకవర్గంలో సీఐ స్థాయి అధికారికి వైరస్‌ సోకగా తిరుపతి నగరంలో డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐ, ఏఆర్‌ ఎస్‌ఐ స్థాయి అధికారులకు కూడా వైరస్‌ సోకింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో విస్తృతంగా జనంలో ఉండే ఒక ఎమ్యెల్యే గన్‌మాన్‌కు కూడా వైరస్‌ సోకింది. వీరే కాకుండా కార్వేటినగరంలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ ఒకరు, రేణిగుంటలో రైల్వే కానిస్టేబుల్‌, పూతలపట్టులో ఫారెస్టు గార్డు ఒకరు కొవిడ్‌ బాధితులయ్యారు. 


 48మంది మున్సిపల్‌, పంచాయతీరాజ్‌ ఉద్యోగులు

లాక్‌డౌన్‌ నీరుగారిపోయాక వివిధ శాఖల ప్రభుత్వ ఉద్యోగులు ప్రమాదానికి చేరువయ్యారు. జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలులో ప్రభు త్వానికీ, ప్రజలకూ నడుమ వారధులుగా పనిచేసే మున్సిప ల్‌, పంచాయతీరాజ్‌ శాఖలకు చెందిన ఉద్యోగుల్లో 48 మంది ఆ విధుల కారణంగానే కరోనా బారిన పడ్డారు. ము ఖ్యంగా వైరస్‌కు వెరవకుండా వలంటీర్లు విధులు నిర్వహిం చవలసి వస్తోంది. జిల్లాలో 21మంది వలంటీర్లు, ఏడుగురు కార్యదర్శులు వైరస్‌ బాధితులయ్యారు. మరో 20మంది వివిధ విభాగాల సిబ్బంది కూడా వైరస్‌ సోకిన వారిలో ఉన్నారు. తిరుపతి రూరల్‌ మండలంలో అత్యధికంగా 13 మంది వలంటీర్లు వైరస్‌ బారిన పడ్డారు.


అదే మండలంలో సచివాలయ డిజిటల్‌ అసిస్టెంట్‌ ఒకరు, పంప్‌ ఆపరేటర్‌ ఒకరు కూడా బాధితుల జాబితాలో వున్నారు. నగరి మున్సిపల్‌ కార్యాలయంలో ఏకంగా 8 మంది ఉద్యోగులకు వైరస్‌ సోకగా వారిలో నలుగురు పారిశుధ్య కార్మికులున్నా రు. వడమాలపేటలో ఒక వలంటీరు, యాదమరిలో మహిళా కార్యదర్శి ఒకరు, పిచ్చాటూరులో ఇద్దరు వలంటీర్లు, శ్రీకాళహస్తి మున్సిపల్‌ కార్యాల యంలో ముగ్గురు ఉద్యోగులు, నలుగురు వార్డు సచివాలయాల సిబ్బంది కరోనా బాధితులుగా మారారు. తిరుపతి నగరంలో ఇద్దరు వలంటీర్లు, నలుగురు వార్డు కార్యదర్శులు, చిత్తూరులో ముగ్గురు వలంటీర్లు, ఇద్దరు సచివాలయ కార్యదర్శులు, బీఎన్‌ కండ్రిగలో సచివాలయ ఉద్యోగి ఒకరు, పెనుమూరులో శానిటరీ వర్కర్‌ ఒకరు  కరోనాతో ఆస్పత్రులపాలయ్యారు. మొత్తంగా వీరిలో 28 మంది మున్సిపల్‌ ఉద్యోగులు కాగా మిగిలిన 20 మంది పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన ఉద్యోగులు. 


21 మంది రెవిన్యూ ఉద్యోగులు

జిల్లాలో ప్రజలకు సేవలందించే రెవిన్యూ సహా పలు ప్రభుత్వ శాఖలు, విభాగాలకు చెందిన 21 మంది ఉద్యోగులు సైతం కరోనా వైరస్‌ ప్రభావానికి ప్రత్యక్షంగా లోనయ్యారు. శ్రీకాళహస్తిలో వైరస్‌ వ్యాప్తి చెందిన తొలి నాళ్ళలోనే రెవిన్యూ ఉద్యోగులు ఏడుగురు వైరస్‌ బారిన పడ్డారు. వారిలో ఓ ఉద్యోగి కారణంగా అతడి భార్యా, కుమార్తె బాధితు లుగా మారారు. ఈ ఏడుగురూ పట్టణంలో వైరస్‌ కేసులు నమోదైన తొలినాళ్ళలో ఆ కేసులను గుర్తించడం, ఆస్పత్రులకు తరలిం చడం, వారి కాంటాక్టులను క్వారంటైన్‌ చేయడం వంటి కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవారే. 


ఆరుగురు టీచర్లు : బడులు నడవకపోయినా టీచర్లను స్కూళ్లకు రమ్మంటుండడంతో వారి కుటుంబాలు ఆందోళనతో ఉన్నాయి. జిల్లాలో ఆరుగురు టీచర్లు ఇప్పటికే వైరస్‌ బారిన పడ్డారు. పీలేరులో ఒకరు, కుప్పంలో ఇద్దరు, సత్యవేడులో ఇద్దరు, రామకుప్పంలో ఒకరు కొవిడ్‌ బాధితులుగా మారారు. వీరిలో ఒక మహిళా టీచరు కూడా వున్నారు.


ఏడుగురు బ్యాంకు ఉద్యోగులకు 

జిల్లాలో ఏడుగురు బ్యాంకు ఉద్యోగులకు వైరస్‌ సోకింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రజలకు దగ్గరగా మెసలవలసి రావడంతో విధి నిర్వహణ వీరికి సవాలుగానే ఉంది. తిరుపతి ఎస్బీఐ ప్రాంతీయ కార్యాలయంలో నలుగురికి, చిత్తూరులో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులకు వైరస్‌ సోకింది.  పీలేరులో ఆర్టీసీ ఉద్యోగి ఒకరికి వైరస్‌ సోకగా వి.కోటలో పోస్టల్‌ ఉద్యోగి ఒకరికి, ఏర్పేడులో ఐఐఎ్‌సఈఆర్‌ సంస్థలో ఓ ఉద్యోగికి కూడా కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 


టీటీడీలో 53 మంది ఉద్యోగులకు వైరస్‌ 

రోజువారీ పది వేల మందికి పైగా భక్తులకు సన్నిహితంగా మెలగుతూ వారికి సేవలందిస్తున్న టీటీడీ ఉద్యోగుల్లో పలువురికి కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. వీరిలో అర్చక విభాగానికి చెందిన నలుగురుండగా మిగిలిన వారు సీఆర్‌వో, కాల్‌ సెంటర్‌, లడ్డూ పోటు, లడ్డూ కౌంటర్‌, ఇంజనీరింగ్‌, శానిటేషన్‌, ప్రింటింగ్‌ ప్రెస్‌ తదితర విభాగాల్లో తిరుపతి, తిరుమలల్లో పనిచేస్తున్న ఉద్యోగులున్నారు.


ఒకే బెటాలియన్‌లో 41 మందికి

తిరుమల, తిరుపతిల్లో విధులు నిర్వర్తిస్తున్న ఏపీఎస్పీ 12వ బెటాలియన్‌కు చెందిన సిబ్బందిలో 41మందికి వైరస్‌ సోకింది. బాధితుల్లో ఇద్దరు ఎస్‌ఐలు, 38 మంది కానిస్టేబుళ్ళు వుండగా ఓ కుక్‌ సైతం వున్నారు. అలాగే టీటీడీ విజిలెన్స్‌ విభాగంలో పనిచేసే ఓ అఽధికారి, పలువురు గార్డులు సైతం కరోనా సోకి ఆస్పత్రిలో చేరారు. 

Updated Date - 2020-07-12T11:17:42+05:30 IST