వైద్యారోగ్య శాఖలో ఎనిమిది మందికి కరోనా.. సిబ్బందికి వర్క్ ఫ్రం హోం..

ABN , First Publish Date - 2020-07-03T20:34:01+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. వైద్య ఉద్యోగులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది మంది వైద్య ఉద్యోగులు, సిబ్బందికి కరోనా

వైద్యారోగ్య శాఖలో ఎనిమిది మందికి కరోనా.. సిబ్బందికి వర్క్ ఫ్రం హోం..

డీఎంహెచ్‌వో కార్యాలయంలో వర్క్‌ ఫ్రం హోం

మౌఖిక ఆదేశాలు జారీ 

కార్యాలయంలో కరోనా భయం 

ఎనిమిది మంది వైద్య సిబ్బందికి పాజిటివ్‌


సంగారెడ్డి అర్బన్‌ (ఆంధ్రజ్యోతి) : సంగారెడ్డి జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ విజృంభిస్తున్నాయి. వైద్య ఉద్యోగులు, సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు ఎనిమిది మంది వైద్య ఉద్యోగులు, సిబ్బందికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో సంగారెడ్డిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం అధికారులు, ఉద్యోగులు, వైద్య సిబ్బందికి కరోనా భయం పట్టుకున్నది. కొన్ని రోజులుగా ఓ ప్రోగ్రాం ఆఫీసర్‌ హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. కార్యాలయంలో విధులు నిర్వహించే ఇద్దరికి రెండు రోజుల క్రితం కరోనా సోకడంతో నిత్యం వైద్య సిబ్బంది కార్యాలయంలోని అన్ని విభాగాల్లో స్ర్పే చేస్తున్నారు. ఆరోగ్య శాఖ సిబ్బందిని కరోనా వెంటాడుతున్న క్రమంలో చాలా వరకు ఉద్యోగులు కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించేందుకు జంకుతున్నారు. ఫలితంగా కార్యాలయంలోని పలు విభాగాలు వెలవెలబోయి కనిపిస్తున్నాయి. 


ఓ వైపు కరోనాతో ఉద్యోగులు, వైద్య సిబ్బంది భయపడుతుంటే మరో వైపు కార్యాలయంలో కొన్ని నెలలుగా నీటి కొరతతో సతమతమవుతున్నారు. బోరు ఎండిపోవడంతో తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా అరకొరగా నీటిని తెప్పించుకొని వాడుతున్నారు. కార్యాలయ ఆవరణలో ఇటీవల మరో మూడు బోర్లు వేసినా ఫలితం లేకుండా పోయింది. కనీసం మూత్రశాలల్లో, ఇతర అవసరాలకు వాడుకునేందుకు నీరు లేకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ కారణంతో కొన్ని రోజుల నుంచి పలువురు ఉద్యోగులు విధులను త్వరగా ముగించుకొని మధ్యాహ్నం నుంచే ఇంటికి వెళ్తున్న సందర్భాలున్నాయి. కనీస సౌకర్యాలకు నీరు లేకపోవడం ఏం చేయాలో తెలియక చాలా మంది అఽధికారులు, ఉద్యోగులు వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారని తెలిసింది. ఈ మేరకు అఽధికారులు సైతం ఉద్యోగుల వర్క్‌ ఫ్రమ్‌ హోంకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.

Updated Date - 2020-07-03T20:34:01+05:30 IST