కరోనా @ 135

ABN , First Publish Date - 2020-05-31T10:27:43+05:30 IST

సిక్కోలులో కరోనా పాజిటివ్‌ కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల కిందట 68 పాజిటివ్‌

కరోనా @ 135

115 కేసులు చెన్నై నుంచి వచ్చినవే

జిల్లాలో పెరుగుతున్న కొవిడ్‌ పాజిటివ్‌

క్వారంటైన్‌లోనివే కాబట్టి ఆందోళన లేదు : అధికారులు


శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మే 30 : సిక్కోలులో కరోనా పాజిటివ్‌ కేసులు అమాంతంగా పెరిగిపోతున్నాయి. దీంతో జిల్లావాసులు  ఆందోళన చెందుతున్నారు. నాలుగు రోజుల కిందట 68 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. శనివారం నాటికి 135కి చేరాయి. జిల్లాలో 43వేల మందిని ఇప్పటివరకు పరీక్షించారు. వలసజీవుల్లో పాజిటివ్‌ లక్షణాలు అధికంగా బయట పడుతున్నాయి. ఇప్పటికే వారంతా క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉండడంతో భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు.  మొత్తం 135 కేసులకు గాను 115 కేసులు చెన్నై నుంచి వచ్చినవారిగా గుర్తించారు. జిల్లాకు ఇటీవల వేలాదిమంది వలస కూలీలు, మత్స్యకారులు చెన్నై, గుజరాత్‌ల నుంచి వచ్చారు. వీరిలో చెన్నై నుంచి వచ్చిన వారిలోనే అత్యధిక పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. శ్రామిక్‌ రైళ్లు, బస్సులు దిగగానే కూలీలు, మత్స్యకారులను అధికారులు నేరుగా క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించి వైద్య పరీక్షలు చేశారు. రెండు దఫాలుగా స్ర్కీనింగ్‌ చేయడంతో ఏకంగా 115 కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయని తెలిపారు.


అలాగే కమ్యూనిటీ(ప్రజల నివాసాలు)లో కేవలం పాతపట్నం మండలంలో నాలుగు, శ్రీకాకుళం నగరంలో ఒకటి మాత్రమే కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీళ్లందరూ చికిత్స పొంది.. పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక మిగిలిన 15 కేసుల మూలాలు పరిశీలిస్తే.. హైదరాబాద్‌ నుంచి వచ్చినవారిలో 4 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ 4, పశ్చిమ   బెంగాల్‌ 2, వరంగల్‌ 2, అబుదాబీ 1, ఖతార్‌ 1, విజయవాడ నుంచి వచ్చినవారిలో ఒక కేసు పాజిటివ్‌ నమోదైందని అధికారులు తెలిపారు. 


స్టాఫ్‌నర్సు, జానియర్‌ వైద్యుడు.. జిల్లా కొవిడ్‌ ఆసుపత్రికి తరలింపు  

 ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డు,  స్ర్కీనింగ్‌ విభాగంలో విధులు నిర్వహించే ఓ స్టాఫ్‌నర్స్‌, జూనియర్‌ వైద్యుడికి శనివారం కరోనా లక్షణాలు బయటపడ్డాయి. వారికి ముందుగా ఆర్టీపీసీఆర్‌ పరీక్ష నిర్వహించారు. ఇందులో వీక్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోమారు పరీక్షించడంతో నెగిటివ్‌ ఫలితాలు వెల్లడయ్యాయి. వీరిద్దరినీ జిల్లా కోవిడ్‌ ఆసుపత్రికి పంపించారు. స్ర్కీనింగ్‌ విభాగం, ఐసోలేషన్‌ వార్డులో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, సిబ్బంది  వైద్యపరీక్షల కోసం క్యూకట్టారు. ఐసోలేషన్‌ వార్డుల్లో కొవిడ్‌ రోగులు లేకపోవడంతో.. ఇక్కడ పనిచేసే సిబ్బంది ఇళ్లకు వెళ్తుంటారు.  ఈ నేపథ్యంలో స్టాఫ్‌ నర్సు,  వైద్యుడు ఇళ్లకు వెళ్లే ప్రాంతాలను నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో శానిటైజ్‌ చేశారు. తర్వాత ఆ ప్రాంతాలను అధికారులతో కలసి కలెక్టర్‌ నివాస్‌ పరిశీలించారు. మరోమారు నిర్వహించే పరీక్షల్లో ఆ ఇద్దరికీ పాజిటివ్‌ అని నిర్ధారణ అయితేనే కంటైన్మెంట్‌ జోన్‌ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. 

Updated Date - 2020-05-31T10:27:43+05:30 IST