జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు

ABN , First Publish Date - 2020-03-29T09:57:21+05:30 IST

జిల్లాలో కరోనా తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. సంజామల మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌గా నమోదైందని కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం ప్రకటించారు.

జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు

నిర్ధారించిన కలెక్టర్‌ వీరపాండియన్‌ 

ఇటీవల ఆగ్రా, రాజస్థాన్‌కు వెళ్లొచ్చిన బాధితుడు 

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌


కర్నూలు(ఆంధ్రజ్యోతి)/కర్నూలు(హాస్పిటల్‌)/సంజామల, మార్చి 28(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా తొలి పాజిటివ్‌ కేసు నమోదైంది. సంజామల మండలంలోని ఓ గ్రామంలో ఉంటున్న రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల యువకుడికి పాజిటివ్‌గా నమోదైందని కలెక్టర్‌ వీరపాండియన్‌ శనివారం ప్రకటించారు. దీంతో అధికారులు ఆ గ్రామాన్ని కట్టుదిట్టం చేసి రహదారులను దిగ్బంధం చేశారు. బాధితుడితో సత్సంబంధాలున్న 18 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అయితే నాలుగు రోజులుగా కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో ఉన్న బాధితుడ్ని ఐసొలేషన్‌కు తరలించాల్సిన వైద్యశాఖాధికారులు మూడ్రోజులుగా మేల్‌ మెడికల్‌(ఎమ్‌ఎమ్‌)-3 వార్డులో ఉంచారు.


సంజామల మండలంలోని ఓ గ్రామంలో ఆ యువకుడు ఇటీవలే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిగా చేరాడు. మరో ఐదుగురితో కలిసి స్థానికంగా గది అద్దెకు తీసుకున్నాడు. ఆ యువకుడు ఈ నెల 5వ తేదీన తన సొంత రాష్ట్రం రాజస్థాన్‌కు వెళ్లాడు. అక్కడి నుంచి ఆగ్రాకు వెళ్లి తిరిగి ఈ నెల 19న తిరిగి జిల్లాలోని గ్రామానికి చేరుకున్నాడు. వచ్చినప్పటి నుంచి జ్వరంతో బాధపడుతుండగా.. స్థానికులు జిల్లా వైద్య శాఖాధికారులకు సమాచారం అందించారు. దీంతో అధికారులు ఈ నెల 23న కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. కేసు నిర్ధారణ నిమిత్తం రక్త నమూనాలను తిరుపతిలోని ల్యాబ్‌కు పంపించగా కరోనా పాజిటివ్‌ అని నివేదిక వచ్చింది. ఆ యువకుడితో పాటు గదిలో ఉంటున్న ముగ్గురు యువకులు, పక్క గదిలో మరో ఇద్దరితో పాటు మరో 13 మంది వ్యక్తులను బనగానపల్లె క్వారంటైన్‌కు తరలించారు.


గ్రామంలో ఈ విషయం కలకలం సృష్టించింది. తహసీల్దారు సురేంద్ర, ఎంపీడీవో నాగకుమార్‌, డాక్టర్‌ కల్పన గ్రామంలో క్రిమిసంహారక మందులను పిచికారీ చేయించారు. గ్రామం మొత్తాన్ని నాలుగు జోన్లుగా విభజించి రహదారులను దిగ్బంఽధం చేయించారు. 144 సెక్షన్‌ విధించారు. 



కరోనా అనుమానిత కేసులను ఐసొలేషన్‌ వార్డులో ఉంచి చికిత్సలు అందించాలన్న నిబంధనలు ఉన్నాయి. 24వ తేదీ రాత్రి కర్నూలు ప్రభుత్వాసుపత్రికి వచ్చిన బాధితుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. వైద్యశాఖాధికారుల ఆదేశాల మేరకు ఎంఎం-3 వార్డుకు తరలించారు. మూడ్రోజులుగా అక్కడే ఉంచి చికిత్స చేశారు. బాధితుడి రిపోర్టులు పాజిటివ్‌గా వచ్చాయన్న సమాచారం శుక్రవారం మధ్యాహ్నానికే అందినట్లు తెలిసింది. దీంతో బాధితుడ్ని హుటాహుటిన ఐసొలేషన్‌కు తరలించారు. రాత్రి వేళ కరోనా నోడల్‌ ఆఫీసర్‌ వెళ్లి పరిశీలించారు.


ఈ పరిస్థితుల నడుమ భద్రత చర్యల్లేకుండా బాధితుడికి చికిత్స అందించిన వైద్య సిబ్బంది, వైద్యులు ఆందోళన చెందుతున్నారు. ఇందులో భాగంగానే ఓ వైద్యుడితో పాటు ఇద్దరు వైద్య విద్యార్థులను హోం క్వారంటైన్లోకి పంపారు. అసలు బాధితుడ్ని ఐసొలేషన్‌కు కాకుండా ఎంఎం-3లో ఉంచాల్సిన అవసరమేంటన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. ఎంఎం-3, 4 వార్డులను ప్రత్యేకంగా కరోనా అనుమానిత కేసుల కోసం ఏర్పాటుచేస్తున్నట్లుగా హాస్పిటల్‌ సూపరిండెంట్‌ రాంప్రసాద్‌ ఇటీవలే చెప్పారు. ప్రస్తుతం పాజిటివ్‌ అంశం బయటకు రావడంతో అనుమానితులను ఎంఎం-3, ఇతర వార్డుల్లో ఎక్కడా ఉంచడంలేదని, ప్రత్యేకంగా పాజిటివ్‌ బాధితుడ్ని ప్రారంభం నుంచి ఐసొలేషన్లోనే ఉంచామని నచ్చజెప్పే యత్నం చేస్తున్నారు. ఎంఎం-3లో చికిత్స ఇవ్వకుండానే వైద్యుల్ని, వైద్య విద్యార్థుల్ని శుక్రవారమే హోం క్వారంటైన్‌కు ఎందుకు తరలించాల్సి వచ్చిందన్న ప్రశ్న వ్యక్తమవుతోంది. 


అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్‌

కరోనాపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండి, సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్‌ వీరపాండియన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ఒక కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసు నమోదైందని, బాధితుడి ఊరు మొత్తం 4 సెక్టార్లుగా విభజించి మెడికల్‌ బృందాలతో స్ర్కీనింగ్‌ చేయించామని వివరించారు. కరోనా పాజిటివ్‌ బాదితుడితో సంబంధాలు ఉన్న 18 మందిని గుర్తించి బనగానపల్లె ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉంచామన్నారు.


గ్రామంలో 3 కి.మీ. చుట్టూ కంటైన్మెంట్‌ జోన్‌, 7 కి.మీ. చుట్టూ కోవిడ్‌-19 బంఫర్‌ జోన్‌గా ప్రకటించామని, గ్రామానికి రాకపోకలు నిలిపి వేశామని తెలిపారు. అయితే నిత్యావసర వస్తువులకు ఇబ్బంది లేకుండగా చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఆ ఊరంతా క్రిమి సంహారక రసాయనాలతో శానిటేషన్‌ చేయించామన్నారు. కోవిడ్‌ అనుమానిత లక్షణాలుంటే వెంటనే స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌, తహసీల్దార్‌, ఎంపీడీవోలకు సమాచారం ఇవ్వాలని కోరారు. కడప జిల్లా సరిహద్దు గ్రామాలను కూడా అప్రమత్తం చేయాలని అక్కడి కలెక్టర్‌కు సమాచారం ఇచ్చామన్నారు.


జిల్లాలో ఇప్పటివరకు విదేశాల నుంచి వచ్చిన వారు 896 మంది ఉండగా, వారిలో హోం ఐసోలేషన్‌లో 776 మంది ఉన్నారని, హోం ఐసోలేషన్‌ను పూర్తి చేసుకున్నవారు 130 మంది ఉన్నారని తెలిపారు. కోవిడ్‌ అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న 21 మంది నమూనాలను పరీక్షల నిమిత్తం పంపించామన్నారు. అవన్నీ నెగిటివ్‌ రిపోర్టులు వచ్చాయన్నారు. 


సందేహాలు ఉంటే..

కరోనాపై సందేహాలు ఉంటే కర్నూలు కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్‌ తెలిపారు. కరోనా కాల్‌ సెంటర్‌ 9441300005కు గానీ, 104 గానీ పోన్‌ చేసి తెలుసుకోవచ్చునన్నారు. జిల్లాలో కరోనా వైరస్‌ కట్టడి కోసం 14 నియోజకవర్గాలలో 1600 బెడ్లతో క్వారంటైన్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామని, వైద్యసిబ్బందిని, మందులు సిద్ధంగా ఉంచామని, కర్నూలు జీజీహెచ్‌లో 20 పడకలతో కోవిడ్‌ ఐసోలేషన్‌ ఆసుపత్రి విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని ఆయన వివరించారు. నంద్యాల సమీపంలోని మెడికల్‌ కాలేజీ హాస్పిటల్‌లో కోవిడ్‌ ఐసోలేషన్‌ హాస్పిటల్‌, కోడుమూరు సమీపంలోని పెంచికలపాడు వద్ద ఉన్న విశ్వభారతి మెడికల్‌ కాలేజీలో ఐసోలేషన్‌ హాస్పిటల్‌ను గుర్తించి స్పెషల్‌ ఆఫీసర్లుగా, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను నియమిస్తూ ఆదేశాలు జారీ చేశామని కలెక్టర్‌ వీరపాండియన్‌ చెప్పారు. 


మరో నలుగురికి అనుమానిత లక్షణాలు

కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న నలుగురు వ్యక్తులకు వైద్యులు స్వాఫ్‌ పరీక్షల కోసం అనంతపురంలో వైరాలజీ విభాగానికి పంపించారు. శుక్రవారం రెండు అనుమానిత కేసులు స్వాఫ్‌ తీసి వైద్యులు పరీక్షలకు పంపించిన విషయం తెలిసిందే. దీంతో గత రెండు రోజులుగా ఆరు అనుమానిత కేసులు నమోదు కాగా, ఇందులో నందికొట్కూరు ప్రాంతానికి చెందిన రెండు కేసులు ఉన్నాయి. ఇందులో ఒకరిని రాయలసీమ యూనివర్సిటీ క్వారంటైన్‌కు పంపించగా, మరొకరు కర్నూలు జీజీహెచ్‌ ఐసోలేషన్‌లో ఉంచారు. 


Updated Date - 2020-03-29T09:57:21+05:30 IST