కరోనా బాధితుల గగ్గోలు

ABN , First Publish Date - 2021-05-07T04:23:17+05:30 IST

నెల్లూరు నగరంలో కరోనా బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా హోం ఐసోలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

కరోనా బాధితుల గగ్గోలు

హోం ఐసోలేషన్‌లో బాధలు

 మందుల కోసం ఎదురుచూపు

 వలంటీర్లనుఅడిగినా ఫలితం శూన్యం

 దాంతో బాధితులే దుకాణాలకు

 విస్తరిస్తున కరోనా

నెల్లూరు (వైద్యం) మే 6 : నెల్లూరు నగరంలో కరోనా బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ప్రధానంగా హోం ఐసోలేషన్‌లో ఉన్న పాజిటివ్‌ బాధితుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఇంటికి వచ్చి ఎవరైనా మందులు ఇస్తారా అని ఎదురు చూస్తున్నారు. ఎవరూ రాక పోవటంతో వారిలో నిరాశ ఎదురవుతోంది. వలంటీర్లు ఇంటికి వచ్చి కరోనా బాధితులకు మెడికల్‌ కిట్‌లు ఇస్తారని ప్రభుత్వం ప్రకటించింది. నగరంలోని ప్రతి డివిజన్‌లో వలంటీర్లు అందుబాటులో ఉన్నారు. ఆయా డివిజన్‌ల పరిధిలో ఎవరైనా కరోనాకు గురయితే వారి నివాసాలకు చేరుకుని బాధితుల ఆరోగ్య స్థితిని అడిగి తెలుసుకోవాలి. వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలి. ప్రత్యేకించి కరోనా నుంచి కోలుకునేలా మెడికల్‌ కిట్‌లు ఇవ్వాలి.  వారు కోలుకునే వరకు ఆరోగ్య స్థితిగతులను పర్యవేక్షించాలి. ప్రస్తుతం నగరంలో ఆ పరిస్ధితి లేదు. ప్రతి రోజూ 500కు పైగా పాజిటివ్‌ కేసులు నగరంలోనే నమోద వుతున్నాయి. వారిలో 70 శాతం మంది మాత్రమే హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.  వైద్య, ఆరోగ్య సిబ్బంది నుంచి మొక్కుబడి పలకరింపే గాని  వలంటీర్లు అవసరమైన మందులు మాత్రం తెచ్చి ఇవ్వటం లేదని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు మందులు కావాలని వలంటీర్లను అడిగినా ఫలితం లేదని గగ్గోలు పెడుతున్నారు. 

చేసేది లేక బయటకు..

ఇదిలా ఉంటే వలంటీర్లు మందులు ఇవ్వక పోవటంతో చేసేది లేక కరోనా బాధితులే రోడ్డు మీదకు వస్తున్నారు. దాంతో ఆ వ్యాధి వ్యాపించి కరోనా బాధితుల సంఖ్యను పెరుగుతున్నట్టు తెలుస్తోంది. కనీసం 15 రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండి మందులు తీసుకుంటూ విశ్రాంతి తీసుకోవాల్సి ఉన్నా ఎక్కువ మంది మందుల కోసం దుకాణాలకు వస్తున్నారు. దీనివల్ల కరోనా  మరొకరికి సోకే అవకాశం వస్తుంది. కరోనా బాధితులు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూడాల్సిన వారే తగిన సహకారం అందించక పోవటంతో పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. నెల్లూరు నగరంలో కరోనా కేసులు పెరగటానికి బాధితులు బయట తిరగటమే మరో కారణమని తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఎంతో మంది నిరుపేదలు కరోనాకు గురయి ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నా వారికి మందులు మాత్రం పూర్తి స్ధాయిలో అందక పోవటంతో చేసేది లేక మందులు కోసం సొంత ఖర్చులు భరించాల్సి  వస్తోంది. ఈ నేపఽథ్యంలో ఉన్నతాధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు పడుతున్న ఇబ్బందులు పరిశీలించి వారు బయట తిరగకుండా చూడాల్సి ఉంది.

Updated Date - 2021-05-07T04:23:17+05:30 IST