హోం క్వారంటైన్‌ వైపే మొగ్గు.. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరేందుకు బాధితుల వెనుకంజ

ABN , First Publish Date - 2020-08-08T21:52:11+05:30 IST

కరోనా పాజిటివ్‌ బాధితులు హోం క్వారంటైన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులోకి రావడంతో అధికారులు కరోనా పరీక్షల వేగం పెంచారు. రోజుకు 3వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారు

హోం క్వారంటైన్‌ వైపే మొగ్గు.. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చేరేందుకు బాధితుల వెనుకంజ

పూర్తిస్థాయిలో  సౌకర్యాలు లేకపోవడమే కారణం


(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి):  కరోనా పాజిటివ్‌ బాధితులు హోం క్వారంటైన్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ర్యాపిడ్‌ కిట్లు అందుబాటులోకి రావడంతో అధికారులు కరోనా పరీక్షల వేగం పెంచారు. రోజుకు 3వేలకు పైగా పరీక్షలు చేస్తున్నారు. అదే స్థాయిలో పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. శ్రీకాకుళంలో ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి(జీజీహెచ్‌), జిల్లా కొవిడ్‌ ఆస్పత్రి(జెమ్స్‌)లో కరోనా బాధితుల కోసం 3 వేల పడకలు అందుబాటులో ఉన్నాయి. పాత్రునివలసలో 2 వేల బెడ్లు, సంతబొమ్మాళిలో వెయ్యి బెడ్లు ఉన్నాయి. అధికారులు మరో 3 వేల బెడ్లను వివిధ ఆసుపత్రుల్లో సిద్ధం చేస్తున్నారు. ప్రత్యేక గది, మరుగుదొడ్డి ఉన్నవారికి హోం క్వారంటైన్‌ ఇస్తున్నారు. మందులు అందజేస్తున్నారు.  ఇప్పటివరకు 1,389 మంది హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స  పొందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు, పునరావాస కేంద్రాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. జీజీహెచ్‌, జెమ్స్‌ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే ఉండడంతో వైద్యసేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని కరోనా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు తమ ఆవేదనను వీడియో రూపంలో సామాజిక మాధ్యమాల ద్వారా అధికారులకు తెలియజేస్తున్నారు. దీంతో కొంతమంది బాధితులు ఆసుపత్రుల కంటే హోం క్వారంటైన్‌లోనే ఉండేందుకు సముఖత చూపుతున్నారు. సాధారణ జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉంటే ఇంట్లోనే ఉండి వైద్యసేవలు పొంది కోలుకొంటున్నారు. ఊపిరి ఆడకపోవడం, అతి నీరసం వంటి లక్షణాలు ఉంటే మాత్రం విధిలేక ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. 


కేర్‌ సెంటర్లలో అంతే....

కరోనా లక్షణాలు తక్కువగా ఉన్నవారిని ఎచ్చెర్ల, పాత్రునివలసలలో పునరావాస కేంద్రాలకు (కేర్‌ సెంటర్‌)కు తరలిస్తున్నారు. ఈ కేర్‌ సెంటర్లలో పదుల సంఖ్యలో బాధితులు ప్రతిరోజు వచ్చి చేరుతుండగా సరైన సదుపాయాలు కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. కనీసం వైద్యుల పర్యవేక్షణ ఉండడం లేదు. జ్వరంతో బాధపడుతున్నామని చెప్పినా.. పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇటీవల పాత్రునివలసలో మౌలిక వసతులు, వైద్య సేవలు తమకు సరిగ్గా అందడం లేదంటూ కరోనా బాధితులు నిరసన చేపట్టారు. తమ సమస్యలను కలెక్టర్‌కు మొర పెట్టుకునేందుకు ప్రయత్నించారు. అయినా ఈ కేర్‌ సెంటర్‌లో పరిస్థితి మారలేదు.  ఐదు రోజుల కిందట బాధితులకు ఉదయం పది గంటలకు టిఫిన్‌ ఇచ్చిన నిర్వాహకులు.. మధ్యాహ్నం రెండు వరకు భోజనం పెట్టలేదు. కరోనా బాధితులకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, అదే వారిని త్వరగా కోలుకొనేలా చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ, పునరావాస కేంద్రంలో ఇటువంటి పరిస్థితులు తరచూ ఎదురవడం ఎంతవరకు సమంజసమో అధికారులే సమాధానం చెప్పాలి.


ఇక ఎచ్చెర్లలో మరుగుదొడ్ల పరిస్థితి దయనీయం. జెమ్స్‌లో వంద మంది బాధితులకు ఒకటి రెండు మరుగుదొడ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. వాటి నిర్వహణ కూడా గాలికొదిలేశారు. కొవిడ్‌ ఆసుపత్రులు, కేర్‌ సెంటర్లకు ఇన్‌చార్జి అధికారులను నియమించారు. వారితో తమ గోడు వెల్లబుచ్చుకొనేందుకు బాధితులు ఫోన్‌కాల్‌ చేసినా అధికారులు స్పందించడం లేదు. ఈ నేపథ్యంలో తమ సమస్యలను నేరుగా కలెక్టర్‌కు చెప్పుకొనేందుకే బాధితులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా కరోనా బాధితులకు మౌలిక వసతులు, సకాలంలో భోజన ఏర్పాట్లు ఉండేలా అధికారులు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. 

Updated Date - 2020-08-08T21:52:11+05:30 IST