సకాలంలో కరోనా వైద్యం అందక.. తిరుపతిలో ఘోరం!

ABN , First Publish Date - 2020-08-11T22:18:44+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైద్యం విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను

సకాలంలో కరోనా వైద్యం అందక.. తిరుపతిలో ఘోరం!

తిరుపతి : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి వైద్యం విషయంలో ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రులను జగన్ సర్కార్ పదే పదే హెచ్చరిస్తున్నప్పటికీ వాటినేమీ లెక్కచేయట్లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ఆస్పత్రులకు టెస్ట్‌కు ఎంత తీసుకోవాలి..? రోజుకు బెడ్ ఖర్చు ఎంత..? ఇలా అన్ని ధరలను ప్రభుత్వం ఖరారు చేసింది. అయినప్పటికీ ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం వాటిని లెక్కచేయకుండా ఇష్టానుసారం దండుకుంటున్నాయి.


ఇప్పటికే పలువురు కోవిడ్ బాధితులు సెల్ఫీ వీడియోలు, పోలీసులకు ఇలా ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వం మాత్రం వీటిపై పట్టించుకోవట్లేదని బాధితులు వాపోతున్నారు. మరోవైపు ప్రభుత్వాస్పత్రులకు సైతం కోవిడ్ బాధితులను ఆస్పత్రిలో చేర్చుకోవాల్సిందేనని.. వారికి బెడ్ ఇచ్చి వైద్యం చేయాలని కూడా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అయితే.. అవన్నీ మాటలకే పరిమితం అయ్యాయి కానీ అమల్లోకి రావట్లేదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా.. తిరుపతిలో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ.


ప్రయాణంలోనే..!

సకాలంలో వైద్యం అందక ప్రయాణంలోనే కోవిడ్ బాధితుడు కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు రోడ్డున పడ్డారు. సకాలంలో చికిత్స చేసుంటే తన భర్త బతికిఉండేవాడని భార్య కన్నీరుమున్నీరవుతోంది. పూర్తి వివరాల్లోకెళితే.. కరోనాతో హోం ఐసోలేషన్‌లోని ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వైద్యం కోసం బాధితుడు పద్మావతీ కోవిడ్ ఆస్పత్రి వద్దకు వెళ్లినా పట్టించుకోలేదు. నగరంలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల వద్దకు వెళ్లగా చుక్కెదరయ్యింది. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో ప్రయాణంలోనే ప్రాణం గాల్లో కలిసిపోయింది. మృతుడు కుటుంబం రోడ్డున పడి బోరున విలపిస్తోంది. ఆస్పత్రి తరలిస్తుండగా తిరుపతి రూయా ఆస్పత్రి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.


అసలేం జరిగింది..!?

నగరంలోని ఎస్‌టి‌వి నగర్‌కు చెందిన నరేంద్ర అనారోగ్యంతో ఈ నెల 3న కరోనా పరీక్షలు 5న పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచనలతో  హోమ్ క్వారంటైన్‌‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు. అయితే.. అస్వస్థతకు గురై, ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోవడంతో 108 ద్వారా రుయా ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. రూయా ఆస్పత్రికిలో  చేరేలోపే కొన ఊపిరి ఆగింది. పద్మావతి కొవిడ్ ఆస్పత్రిలో సకాలంలో చేర్చుకుని వైద్యం చేసుంటే తన భర్త ప్రాణాలు దక్కేవని ఇద్దరి బిడ్డలతో నరేంద్ర భార్య బోరుమని విలపించింది. ఈ ఘటన చూసిన జనాలు తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు. దీనిపై వైద్యాధికారులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.



Updated Date - 2020-08-11T22:18:44+05:30 IST