గుంటూరులో కలవరం!

ABN , First Publish Date - 2020-03-27T09:16:10+05:30 IST

నిన్నమొన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లాలో తొలి కరోనా కేసు నమోదవడంతో కలవరపాటు మొదలైంది. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని గుంటూరు...

గుంటూరులో కలవరం!

  • బాధితుని సన్నిహితుల్లో ఆందోళన
  • ఇళ్లకు వెళ్లి గుర్తిస్తున్న అధికారులు
  • వైద్యుల సంరక్షణలో మరో 9మంది

గుంటూరు, మార్చి 26 (ఆంధ్రజ్యోతి): నిన్నమొన్నటి వరకూ ప్రశాంతంగా ఉన్న గుంటూరు జిల్లాలో తొలి కరోనా కేసు నమోదవడంతో కలవరపాటు మొదలైంది. కొవిడ్‌-19 పాజిటివ్‌ వచ్చిన వ్యక్తిని గుంటూరు నుంచి విజయవాడకు తరలించినప్పటికీ నాలుగైదు రోజులుగా అతనితో సన్నిహితంగా మెలిగిన వారిలో భయాందోళన ఎక్కువైంది. పరీక్షల కోసం ఎవరూ ముందుకు రానప్పటికీ.. అధికారులు మాత్రం వారిని వెతుక్కుం టూ ఇళ్లకు వెళ్లి ఒక్కొక్కరినీ గుర్తిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ నుంచి అతనితో పాటు రైల్లోనూ, ఆ తర్వాత ఆటోలోనూ ప్రయాణించిన 9 మందిని గుర్తించిన అధికారులు వారిని తీసుకొచ్చి వైద్యులకు అప్పగించారు. బాధితుడు ఆస్పత్రిలో చేరక ముందు అనేక మందితో సన్నిహితంగా గడిపారు. ఈ నెల 21న తాడికొండకు వెళ్లి.. అక్కడి పెద్దలతో చిన్నపాటి ప్రార్ధనా సమావేశం నిర్వహించాడు. ఈ సమావేశానికి హాజరైన సుమారు 40 మందిలో కొందరిని గుర్తించిన అధికారులు వారిని దగ్గరలోని ఐసోలేషన్‌ వార్డుకు తరలించారు. మిగతా వారిని గుర్తించడం పెద్ద సవాల్‌గా మారింది. కరోనా బాధితుడితో కలిసి ఢిల్లీ నుంచి ప్రయాణించిన వారిలో పల్నాడు ప్రాంతం వారు కూడా ఉన్నట్లు తేలింది. బాధితుడు ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడో గుర్తించి ఆస్పత్రులకు తరలించడానికి చాలా సమయం పడుతుంది కాబట్టి అతనితో కలివిడిగా ఉన్నవారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా.. బాధితుని నివాస ప్రాంతం మంగళ్‌దాస్‌నగర్‌లో 3 కిలోమీటర్ల పరిధిలో హైఅలర్ట్‌ ప్రకటించి పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ నిర్వహించారు.   


ప్రజలు ఆందోళన చెందొద్దు: ఆళ్ల నాని

గుంటూరు నగరానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌ రిపోర్టు వచ్చిందని, అతనితోపాటు కుటుంబసభ్యులను కూడా విజయవాడలోని కొవిడ్‌- 19 సెంటర్‌కి తరలించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణప్రసాద్‌ (నాని) పేర్కొన్నారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు ఆయన గురువారం గుంటూరు వచ్చి జిల్లా యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. పాజిటివ్‌ కేసు నమోదైన ఏరియాలో 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న 9,800 గృహాలను కంటైన్‌మెంట్‌ ప్లాన్‌ కింద సర్వే చేయాలన్నారు.


Updated Date - 2020-03-27T09:16:10+05:30 IST