మాయదారి మహమ్మారి

ABN , First Publish Date - 2020-06-09T07:53:37+05:30 IST

మాయదారి కరోనా.. దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసుల ఉధృతి తగ్గడం లేదు. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 9,983 కేసులు నమోదయ్యాయని, 271 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది...

మాయదారి మహమ్మారి

  • ఒక్క రోజులో 9,983 కేసులు
  • సోమవారం మరో 271 మంది మృతి
  • దేశంలో 2.50 లక్షలు దాటిన కేసులు
  • 50 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి వైరస్‌
  • సెల్ఫ్‌ క్వారంటైన్‌కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌
  • చెన్నైలో టీటీడీ ఉద్యోగికి పాజిటివ్‌
  • మిజోరంలో మరో రెండువారాలు లాక్‌డౌన్‌ 
  • పశ్చిమబెంగాల్‌లో నెలాఖరు వరకు ఆంక్షలు
  • ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో చీఫ్‌కు కరోనా
  • ఔరంగాబాద్‌లో ఇద్దరు కరోనా ఖైదీల పరారీ


న్యూఢిల్లీ, బెంగళూరు, చెన్నై, జూన్‌ 8 (ఆంధ్రజ్యోతి): మాయదారి కరోనా.. దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కేసుల ఉధృతి తగ్గడం లేదు. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 9,983 కేసులు నమోదయ్యాయని, 271 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. 48.49 శాతం మంది కోలుకున్నారని ప్రకటించింది. వరుసగా ఐదో రోజు కేసులు 9 వేలు దాటాయి. దీంతో మొత్తం కేసులు 2.50 లక్షలను మించాయి. ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ) ప్రిన్సిపల్‌ డైరెక్టర్‌ కేఎస్‌ ధట్వాలియా కరోనా బారినపడ్డారు.  ఆయన.. ఇటీవల కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్‌ తోమర్‌, ప్రకాశ్‌ జవడేకర్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. 55 మందిపైగా సిబ్బంది కరోనా బారినపడ్డారని నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ (ఎన్‌ఎ్‌సజీ) తెలిపింది. పశ్చిమబెంగాల్‌లో ఆంఫన్‌ తుపాను సహాయ చర్యల్లో పాల్గొన్న 50 ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి కరోనా సోకింది.


యోగి ప్రభుత్వానికి ‘డాన్‌’ ప్రశంస

ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వం కరోనా కట్టడిలో ప్రశంసనీయ పాత్ర పోషిస్తోందని పాకిస్థాన్‌కు చెందిన పత్రిక డాన్‌ కొనియాడింది. ‘యూపీ, పాకిస్థాన్‌ జనాభా దాదాపు సమానం. యోగి ప్రభుత్వం లాక్‌డౌన్‌ను సమర్థంగా అమలు చేసింది. పాకిస్థాన్‌ ప్రభుత్వం అలా చేయలేకపోయింది’ అని పత్రిక రెసిడెంట్‌ ఎడిటర్‌ హుస్సేన్‌ ట్వీట్‌ చేశారు. యూపీలో కంటే పాక్‌లో కరోనా మరణాల రేటు ఏడు శాతం ఎక్కువగా ఉన్నట్లు చూపుతున్న గ్రాఫ్‌ను ఆయన ట్వీట్‌లో పొందుపర్చారు. 


తమిళనాడులో తీవ్రంగా వ్యాపిస్తున్న వైరస్‌ ‘గ్లేడ్‌ ఏ1 3ఐ’ జాతి లక్షణాలతో ఉన్నట్లు వైద్య నిపుణుల కమిటీ గుర్తించింది. ఇది అధిక హాని కలిగిస్తోందని నిర్ధారించారు. ఈ వైరస్‌ తాకిడి తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డీఎంకే అధ్యక్షుడు  స్టాలిన్‌కు నెగెటివ్‌ వచ్చింది. చెన్నై త్యాగరాయనగర్‌  టీటీడీ సమాచార కేంద్రం ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి కరోనా సోకింది. కర్ణాటక కొత్త కేసుల్లో 267 మంది మహారాష్ట్ర నుంచి వచ్చినవారే.  ఔరంగాబాద్‌లో కొవిడ్‌కు గురై.. చికిత్స పొందుతున్న ఇద్దరు ఖైదీలు ఆస్పత్రి నుంచి పరారయ్యారు. తగిన జాగ్రత్తలతో పాఠశాలలను పునఃప్రారంభించేందుకు అనుమతి కోరుతూ కేంద్రానికి ఢిల్లీ ప్రభుత్వం లేఖ రాయడంపై కాంగ్రెస్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది.  




ముంబైలో రోడ్డెక్కిన బస్సులు

లాక్‌డౌన్‌ మినహాయింపులతో సోమవారం దేశవ్యాప్తంగా కార్యకలాపాలు మొదలయ్యాయి. ముంబైలో బెస్ట్‌ బస్సులు రోడ్డెక్కాయి. కోల్‌కతాలో షాపింగ్‌ మాల్స్‌, రెస్టారెంట్లు, వ్యాపార సంస్థలు తెరవడంతో ప్రజలు పెద్దఎత్తున వీధుల్లోకి వచ్చారు. ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ ఆలయాల్లోకి భక్తులకు అనుమతిపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.  కేరళలో ప్రభుత్వ కార్యాలయాలు పూర్తిస్థాయి సిబ్బందితో నడిచాయి. 


కేజ్రీవాల్‌ హోం క్వారంటైన్‌

జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ సెల్ఫ్‌క్వారంటైన్‌కు వెళ్లారు. ఆయనకు మంగళవారం కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. మధుమేహం ఉన్న కేజ్రీవాల్‌ ఆదివారం మధ్యా హ్నం నుంచి అస్వస్థతతో ఉన్నా రు. కేబినెట్‌ సమావేశం తర్వాత ఏ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. 


మిజోరంలో మళ్లీ లాక్‌డౌన్‌

మంగళవారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించాలని  మిజోరం నిర్ణయించింది. ఇటీవల ఢిల్లీ, గుజరాత్‌ నుంచి రాష్ట్రానికి వచ్చిన ఐదుగురికి కరోనా సోకింది. ఆ తర్వాత కేసులు 22కు చేరాయి. పశ్చిమ బెంగాల్‌లో 15వ తేదీతో ముగియనున్న లాక్‌డౌన్‌ను 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. 



Updated Date - 2020-06-09T07:53:37+05:30 IST