కరోనా.. బతుకు తనఖా

ABN , First Publish Date - 2020-08-07T07:19:57+05:30 IST

కరోనా మహమ్మారి సామాన్య ప్రజల జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, ఆదాయాలు తగ్గిపోయి, ఉన్న దాంట్లో పొదుపుగా బతుకుతున్న కుటుంబాల్లో ఎవరికైనా తీవ్రమైన లోడ్‌తో కరోనా వైరస్‌

కరోనా.. బతుకు తనఖా

  • వైరస్‌తో కుంగిపోతున్న కుటుంబాలు
  • ఆర్థిక ప్రణాళికలన్నీ తలకిందులు
  • 34 లక్షలు చెల్లించిన ఓ కుటుంబం
  • బిడ్డ పెళ్లికి దాచిన డబ్బులు ఆస్పత్రికి
  • అప్పులకు బంగారం, ఆస్తులు తాకట్టు
  • రూ.10 వడ్డీకైనా వెనుకాడని వైనం 
  • మరో తరం వరకు కోలుకోవడం కష్టం


‘‘ఆ రోగమేదో మాకు వచ్చినా అయిపోవు. ఇంటికి మగ దిక్కు లేకుండా పోయింది. ఎట్లా బతికేది?’’ కరోనా కాటుకు భర్తను, ఎదిగొచ్చిన కొడుకును పోగొట్టుకున్న కొండాపూర్‌లోని ఓ తల్లి మాటలివి! గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీనే ప్రారంభించిన సుధీర్‌ వయస్సు 30 ఏళ్ల లోపే. రెండేళ్ల క్రితమే పెళ్లయిన సుధీర్‌కు అమ్మ, నాన్న, భార్య, కొడుకు ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న కుటుంబంపై కరోనా పిడుగులా వచ్చిపడింది. తండ్రికి కరోనా లక్షణాలు రావడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌గా తేలింది. దీంతో హైటెక్‌ సిటీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అడ్మిషన్‌ సమయంలోనే రూ.5 లక్షలు చెల్లించాడు. వారం రోజులు గడిచిన తర్వాత సుధీర్‌కూ కరోనా వచ్చింది. అదే ఆస్పత్రిలో తానూ చేరారు. రూ.3 లక్షలు ఆస్పత్రిలో డిపాజిట్‌ చేశారు. సుధీర్‌ చేరిన నాలుగు రోజులకే తండ్రి పరిస్థితి విషమించి చనిపోయారు. వారం రోజులు గడిచిన తర్వాత సుధీర్‌ కూడా చనిపోయారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, మ్యూచువల్‌ ఫండ్‌లను పూర్తిగా క్లోజ్‌ చేసేసి రూ.8 లక్షల బిల్లులు చెల్లించారు. ఇందులో పీపీఈ కిట్లకు వేసిన బిల్లులే 3 లక్షల రూపాయలు ఉన్నాయి. ఎక్స్‌రేలు తీసినందుకు మరో రూ.1.50 లక్షలు. అన్నీ చెల్లించాకే సుధీర్‌ కడచూపు దక్కింది. భర్తలను పోగొట్టుకుని వారు పుట్టెడు దుఃఖంలో మునిగిపోయారు.


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి సామాన్య ప్రజల జీవితాలను తలకిందులు చేస్తోంది. ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమై, ఆదాయాలు తగ్గిపోయి, ఉన్న దాంట్లో పొదుపుగా బతుకుతున్న కుటుంబాల్లో ఎవరికైనా తీవ్రమైన లోడ్‌తో కరోనా వైరస్‌ వచ్చిందంటే మరో తరం వరకు కోలుకోలేని దెబ్బ పడుతోంది. మధ్య తరగతి విలువలతో అయిన వారి ప్రాణాలను దేవుడి దయకు వదిలేయలేక మానవ ప్రయత్నం చేశామనిపించుకొనేందుకు ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. కొవిడ్‌ చికిత్సల ప్రొటోకాల్‌ పాటించడంలో భాగంగా ఆసుపత్రులు తీసుకుంటున్న ప్రత్యేక జాగ్రత్తలు వైద్యం బిల్లులను భరించలేని స్థాయికి తీసుకెళ్తున్నాయి. కొవిడ్‌ రోగి కోలుకొని బయటకు రావాలంటే కనీసం 15 లక్షలు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంటోంది. కరోనా రాకముందు బైపాస్‌ ఆపరేషన్‌ సహా ఎంత పెద్ద ఆరోగ్య సమస్య వచ్చినా ఏడాదికి నాలుగైదు లక్షలకు మించి ఖర్చయ్యేది కాదు. బీమా అలవాటు ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఊహించని చాలామంది 5లక్షల్లోపే ఆరోగ్య బీమా చేసుకొని ఉన్నారు. ఇంట్లో పెద్ద వాళ్లు ఉన్న కుటుంబాలే కాస్త ఎక్కువ మొత్తం బీమా తీసుకున్నాయి. నిజానికి అసలు బీమా లేని కుటుంబాలే ఎక్కువగా ఉన్నాయి. దాంతో ఎక్కువ మంది కరోనా రోగుల కుటుంబాలు లక్షల బిల్లులను చెల్లించేందుకు బంగారం, ఆస్తులు, పెట్టుబడులు మొత్తం కుదువ పెట్టి అప్పులు తేవాల్సి వస్తోంది. కుటుంబ పెద్ద అయిన రోగి చనిపోతే వారి పరిస్థితి మరీ ఘోరం. మరికొన్ని దశాబ్దాల పాటు ఆ కుటుంబాలు కోలుకోలేని పరిస్థితి కనబడుతోంది. కార్పొరేట్‌ ఆసుపత్రులు మొదలు 30 పడకల ఆస్పత్రుల వరకు అన్నీ లక్షల్లో బిల్లులు వేస్తున్నాయి. నిజానికి కరోనా మందులు లేని, సరైన చికిత్స విధానం లేని రోగం. లక్షల్లో బిల్లు ఎందుకు వస్తోందంటే ప్రత్యేక జాగ్రత్తల పేరిట బెడ్‌షీట్ల వంటి వాటికి కూడా వేలల్లో బిల్లు వేయడమే కారణం. పీపీఈ కిట్ల చార్జీలే రోజుకు ఆరు నుంచి పదివేలు అవుతున్నాయి. కేవలం పేషంట్‌ను ఆసుపత్రిలో పెట్టి మానిటరింగ్‌ చేసినందుకే రోజుకు లక్ష బిల్లు పడుతోంది. సన్‌సిటీ ప్రాంతానికి చెందిన వ్యక్తి కరోనాతో మాదాపూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. నాలుగో రోజు చనిపోయాడు. ఐదున్నర లక్షల బిల్లు అయ్యింది. న్యూమోనియా సమస్యతో ఆస్పత్రిలో చేరిన వ్యక్తికి కరోనా నెగటివ్‌ వచ్చినప్పటికీ ముందు జాగ్రత్తగా వాడిన పీపీఈ కిట్లకు రూ.3 లక్షల బిల్లు అయ్యిది. 


డబ్బు చెల్లించాల్సిందే!

కరోనా కొత్త రోగం కావడంతో పేషంట్ల నుంచి వచ్చే సమస్యల గురించి భయపడుతున్న ప్రైవేటు ఆసుపత్రులు ముందే లక్షల్లో డబ్బులు డిపాజిట్లుగా వసూలు చేస్తున్నాయి. అడ్వాన్స్‌గా ఎక్కువ క్యాష్‌ రూపంలో ఇచ్చే వారికి బెడ్లు కేటాయిస్తున్నాయి. ప్రాణభయంతో రోగుల తరఫు బంధువులు బెడ్‌ దొరికితే చాలంటూ డబ్బులు చెల్లించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.  చాలా ఆస్పత్రుల్లో ఆరోగ్య బీమా అనుమతించక పోవడంతో నగదు చెల్లించేందుకు రోగుల కుటుంబీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా వచ్చాక అన్ని రంగాలు కుదేలు కావడంతో ఉన్నత కుటుంబాలకు కూడా నగదు పోగు చేయడం కష్టంగానే ఉంటోంది. మధ్య తరగతి పరిస్థితి మరీ ఘోరం. ఎల్‌బీ నగర్‌లో ఉండే సెల్‌ఫోన్‌ షాపు నిర్వాహకుడికి కరోనా రావడంతో హయత్‌నగర్‌లో ఉన్న 200 గజాల ప్లాట్‌ను విక్రయించి, ఆ సొమ్ముతో ఆస్పత్రిలో చేరారు. అంబర్‌పేటలో ఉండే ఓ ప్రభుత్వోద్యోగి ఇల్లు కాగితాలను అడ్డం పెట్టి పది రూపాయల వడ్డీకి 15 లక్షల అప్పుతెచ్చి భార్యను బతికించుకున్నాడు. మలక్‌పేటలో ఉండే ప్రైవేటు ఉద్యోగి బిడ్డ పెళ్లి కోసం జీవితకాలం దాచిన సొమ్మును విత్‌డ్రా చేసి తన ప్రాణాలను కాపాడుకొనేందుకు ఖర్చు చేశాడు. ఆస్తులమ్మి ప్రాణాలు దక్కించుకొని ఇంటికి వచ్చిన వారికి తమను అంటరాని వారిగా చూస్తున్న ఇరుగు పొరుగు వ్యవహార శైలి మరింత కుంగదీస్తోంది. కవాడిగూడలో కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగికి కరోనా రాగా స్నేహితులంతా కలిసి పది లక్షలు పోగుచేసి ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఇప్పుడు ఆ పది లక్షలు తీర్చాలంటే ఆరేళ్లు పడుతుందని అంటున్నాడు.


హబ్సీగూడలో ఎలకా్ట్రనిక్స్‌ షాపు నిర్వహించే శ్రీధర్‌కు(పేరు మార్చాం)  పాజిటివ్‌ రావడంతో సికింద్రాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. రూ.15 లక్షల బిల్లు అయ్యింది. తను ఆస్పత్రిలో ఉండగానే తల్లిదండ్రులకు కరోనా వచ్చింది. చెరి నాలుగు చొప్పున 8 లక్షలు డిపాజిట్‌ చేశారు. నాలుగు రోజులకే తల్లి చనిపోయింది. మరో లక్ష చెల్లిస్తే ఆమె మృతదేహాన్ని అప్పగించారు. శ్రీధర్‌, ఆయన తండ్రి కోలుకున్న తర్వాత మరో 16 లక్షల బిల్లు వేశారు. కాళ్లా వేళ్ల్లా పడితే చివరకు రూ.6 లక్షలు తగ్గించారు. కేవలం నెల  వ్యవధిలోరూ.34 లక్షలను కరోనా చికిత్స కోసం ఆ కుటుంబం చెల్లించింది. ఇందుకోసం ఇంట్లో బంగారమంతా అమ్మడంతో పాటు ఇల్లు కాగితాలను కుదువ పెట్టి రూ.10 వడ్డీకి డబ్బులు తీసుకొచ్చి చెల్లించారు. ఇప్పుడుఅప్పుల్లో కూరుకుపోయిన ఆ కుటుంబం షాపును తెరిస్తే కరోనా భయంతో ఏ ఒక్కరూ రావడం లేదు. ఆదాయం లేకపోవడంతో ఇల్లు గడవడమే కష్టంగా మారింది.


18 లక్షలు కట్టినా.. దక్కలేదు..

‘‘పోయిన నెలలో మా అన్న మహ్మద్‌ ముసా ఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతుంటే హైటెక్‌సిటీలోని ఓ ఆస్పత్రిలో చేర్పించాం. కరోనా పరీక్షలు పలుమార్లు చేస్తే నెగెటివ్‌గా వచ్చింది. న్యూమోనియా ఉందని డాక్టర్లు చెప్పారు. రూ.5 లక్షలు డిపాజిట్‌ చేసినం. 20 రోజులు ఆస్పత్రిలో ఉన్నాడు. రోజుకు లక్ష చొప్పున బిల్లు వేస్తున్నా చెల్లిస్తూ వచ్చాం. బంగారం కుదువబెట్టి, తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు తెచ్చి 12 లక్షలు కట్టినం. జూలై 29న సాయంత్రం ఐదు గంటలకు ఇంకా ఎంత బిల్లు చెల్లించాలని అడిగాం. రూ.6 లక్షల వరకు ఉందని చెప్పారు. అవి పోగు చేస్తుంటేనే రాత్రి ఏడు గంటలకు అన్న చనిపోయినట్లు ఫోన్‌ చేసి చెప్పారు. రూ.10.50 లక్షల బిల్లు చెల్లించి బాడీ తీసుకపోవాలని చెప్పారు. నిలదీస్తే ఆరు లక్షలు కట్టించుకొని బాడీ ఇచ్చారు. మొత్తం 18 లక్షలు ఖర్చు అయ్యింది. ఇంటిని పోషించే అన్న దక్కలేదు’’ అంటూ అడిక్‌మెట్‌కు చెందిన ఇసాక్‌ కన్నీరు మున్నీరయ్యాడు.

Updated Date - 2020-08-07T07:19:57+05:30 IST