అంతటా కరోనా

ABN , First Publish Date - 2022-01-23T06:19:52+05:30 IST

కరోనా మరోసారి విజృంభిస్తోంది. థర్డ్‌వేవ్‌ రోజురోజుకు భయపెడుతోంది. సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఏదైనా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కరోనా తిష్టవేసింది. థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా ఒమైక్రాన్‌ కేసులు కూడా భయపెడుతున్నాయి.

అంతటా కరోనా

- 22 రోజుల్లో 1,365 మందికి కరోనా పాజిటివ్‌ 

- మరోవైపు ఒమైక్రాన్‌ కేసుల కలకలం

- కొనసాగుతున్న ఫీవర్‌ సర్వే 

- రెండు రోజుల్లో 1322 మంది గుర్తింపు

- కొవిడ్‌ కిట్‌ల పంపిణీ 

- జ్వరం ఏదైనా వణుకుతున్న జనం

- తాజాగా 308 మందికి పాజిటివ్‌

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

కరోనా మరోసారి విజృంభిస్తోంది. థర్డ్‌వేవ్‌ రోజురోజుకు భయపెడుతోంది.  సాధారణ జలుబు, దగ్గు, జ్వరం ఏదైనా ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కరోనా  తిష్టవేసింది. థర్డ్‌వేవ్‌లో కొవిడ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుండగా ఒమైక్రాన్‌ కేసులు కూడా భయపెడుతున్నాయి. శనివారం జిల్లాలోని చందుర్తి మండలం కిష్టంపేట గ్రామానికి చెందిన 66 ఏళ్ల మహిళ మృతిచెందింది. జ్వరం దమ్ము లక్షణాలతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లిన ఆమెను పరీక్షించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. విషయం తెలియడంతో మరింత షాక్‌కు గురై గుండెపోటుతో మృతిచెందింది. మరోవైపు కరోనా కట్టడి కోసం జిల్లాలో చేపట్టిన ఫీవర్‌ సర్వే రెండో రోజు కొనసాగింది. జిల్లాలో 1.50 లక్షల ఇళ్లను 493 బృందాలు సర్వే చేస్తున్నాయి. సర్వేలో రెండు రోజుల్లోనే చాలా ఇళ్లలో జ్వర పీడితులు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు రోజుల్లో 61,642 ఇళ్లలో వైద్య సిబ్బంది సర్వే చేపట్టారు. ఇందులో  1322 మంది జ్వర పీడితులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కరోనా లక్షణాలు ఉండడంతో కిట్లను అందజేశారు. కొవిడ్‌ ప్రారంభం నుంచి ఫీవర్‌ సర్వే సత్ఫలితాలు ఇస్తోందనే  భావించవచ్చు. జిల్లాలో ఇప్పటివరకు 11 విడతల్లో ఫీవర్‌ సర్వే చేపట్టారు. జిల్లాలో 1,51,889 ఇళ్లను 11 విడతల్లో జరిగిన సర్వేలో సందర్శించారు. ఇందులో 9120 మందిని గుర్తించి కొవిడ్‌ కిట్లను అందజేశారు. మొదటి విడతలో 3,789 మంది, రెండో విడతలో 3,372 మంది, మూడో విడతలో 1710 మంది. నాలుగో విడతలో 679 మంది, ఐదో విడతలో 571 మంది, ఆరో విడతలో 762 మంది, ఏడో విడతలో 916 మంది, ఎనిమిదో విడతలో 539 మంది, తొమ్మిదో విడతలో 363 మంది, 10వ విడతలో 205 మందిని గుర్తించారు. 11వ విడత కొనసాగుతోంది. ఇందులో 1322 మందిని ఇప్పటికే గుర్తించారు. మరో ఐదు రోజులపాటు సర్వే కొనసాగనుంది. మరోవైపు జిల్లాలో థర్డ్‌వేవ్‌ కరోనా పాజిటివ్‌ల సంఖ్య కూడా పెరుగుతోంది. జనవరి 1వ తేదీ నుంచి సాధారణంగా మొదలైన కొవిడ్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిత్యం వందల సంఖ్యలో నిర్ధారణ అవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో  థర్డ్‌వేవ్‌ ఉధృతి మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 

వేగంగా విస్తరణ 

రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కొవిడ్‌ వేగంగా విస్తరిస్తోంది. జనవరి 1వ తేదీ నుంచి 22వ తేదీ వరకు 1365 మంది కొవిడ్‌ బారిన పడ్డారు. మరోవైపు ఇతర దేశాల నుంచి వస్తున్న వారిలో ఒమైక్రాన్‌ వేరియంట్‌ పాజిటివ్‌ రావడంతో కలకలం రేపుతోంది. ఇప్పటికే ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌ మండలాల్లో  దుబాయ్‌ నుంచి వచ్చిన ముగ్గురికి ఒమైక్రాన్‌ పాజిటివ్‌ వచ్చింది. వారి ద్వారా మరో ఇద్దరు ఒమైక్రాన్‌ బారిన పడ్డారు. కరోనా, ఒమైక్రాన్‌తో జిల్లా ప్రజల్లో మళ్లీ కొవిడ్‌ భయం నెలకొంది.  ఫస్ట్‌ వేవ్‌లో 13,380 మంది కొవిడ్‌ బారిన పడగా 165 మంది మృతిచెందారు. సెకండ్‌ వేవ్‌లో 19040 మంది వైరస్‌ బారిన పడగా 404 మంది మృతిచెందారు. ఈ సంవత్సరం 22 రోజుల్లోనే 1365 మంది కరోనా బారిన పడగా 66 ఏళ్ల మహిళ మృతిచెందింది. థర్డ్‌వేవ్‌లో మరణాలు లేవని ఊరట చెందుతున్న ప్రజల్లో మహిళ మృతి కలవరాన్ని కలిగించింది. జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌తో 570 మంది మృతిచెందారు.  మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ కొవిడ్‌ చికిత్సను అందించడానికి సర్వం సన్నద్ధంగా ఉంది. 

తాజాగా 308 మందికి పాజిటివ్‌ 

రాజన్న సిరిసిల్ల జిల్లాలో శనివారం 1669 మందికి కొవిడ్‌ పరీక్షలు చేయగా 308 మందికి పాజిటివ్‌ వచ్చింది. 66 ఏళ్ల మహిళ మృతిచెందింది. జిల్లాలో ఇప్పటి వరకు 33,752 మంది కొవిడ్‌ బారిన పడగా 32,049 మంది కోలుకున్నారు. జిల్లాలో 1133 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు 570 మంది మృతిచెందారు. 


Updated Date - 2022-01-23T06:19:52+05:30 IST