వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, వికారం... ఇవి కూడా కరోనా లక్షణాలే..!

ABN , First Publish Date - 2020-09-04T15:55:14+05:30 IST

జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కరోనాగా భావించాలని నిపుణులు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. అయితే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపించినా

వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, వికారం... ఇవి కూడా కరోనా లక్షణాలే..!

కొవిడ్ 19తో జీర్ణకోశ సమస్యలు.. 

ప్రతి వంద మంది కరోనా బాధితుల్లో 20 మందిలో ఈ తరహా సమస్యలు 

జ్వరం, దగ్గు లేకపోవడంతో గుర్తించలేకపోతున్న బాధితులు

వైరస్‌ నుంచి కోలుకున్న వారిలోనూ గ్యాస్ట్రో సమస్యలు 

యాంటీ బయాటిక్స్‌ వాడడం వల్లనే...


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): జ్వరం, దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు, వాసన, రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే కరోనాగా భావించాలని నిపుణులు ఇన్నాళ్లూ చెబుతూ వచ్చారు. అయితే వాంతులు, విరేచనాలు, కడుపులో మంట, వికారం వంటి లక్షణాలు కనిపించినా వైరస్‌ సోకిందేమోనని అనుమానించాల్సిందేనని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎక్కువ మంది గ్యాస్ట్రో సంబంధిత సమస్యలుగా భావించి నిర్లక్ష్యం చేస్తున్నారని, దీనివల్ల వైరస్‌ తీవ్రత పెరిగి సమస్య మరింత జటిలమవుతోందంటున్నారు.


కొవిడ్‌ బారినపడిన, వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయంటున్నారు కేజీహెచ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగం సీనియర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గిరినాథ్‌. అయితే చాలామంది వాటిని సాధారణ సమస్యలుగానే భావించి నిర్లక్ష్యం చేస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఆయన పరిశీలనలో తేలిన పలు అంశాలను వెల్లడించారు. 


20 శాతం మందిలో గ్యాస్ట్రో సమస్యలు...

కొవిడ్‌ వైరస్‌ బాధితుల్లో సాధారణంగా కనిపించే లక్షణాలకు భిన్నంగా కొంతమందిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. వైరస్‌ బారినపడుతున్న ప్రతి వంద మందిలో 20 మందికి జ్వరం, జలుబు, దగ్గు వంటి  లక్షణాలు కనిపించడం లేదు. వీరిలో ఆకలి తగ్గడం, వికారం, విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. అయితే ఇవి కొవిడ్‌ లక్షణాల్లో లేకపోవడం వల్ల చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు. దీనివల్ల వైరస్‌ తీవ్రత పెరిగి మరికొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొంతమందిలో జ్వరంతోపాటే వాంతులు, విరేచనాలు కనిపిస్తున్నాయి. ఊపిరితిత్తు లతోపాటు చిన్నపేగు, కడుపులో వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉంటోంది. 


కోలుకున్న వారిలోను.. 

వైరస్‌ బారినపడి కోలుకున్న వారిలోనూ పది శాతం మంది గ్యాస్ట్రో సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. చికిత్స సమయంలో వాడిన మందులు, కొన్నిరకాలైన స్టెరాయిడ్స్‌ వల్ల కడుపు, గుండెలో మంట, కడుపు ఉబ్బరం, పేగువాపు, కొద్దిమందిలో పాంక్రియాటిస్‌ వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. యాంటీ బయాటిక్స్‌ వినియోగించడం వల్ల పెద్దపేగులో ఇన్‌ఫెక్షన్‌ చేరి ఎక్కువమంది విరేచనాల సమస్యతో బాధ పడుతున్నారు. వైరస్‌ నుంచి కోలుకున్నవారు ఈ సమస్య కనిపించిన వెంటనే మందులు ఆపడమో, సమస్య తగ్గడానికి అవసరమైన మందులను వైద్యుల సూచన లతో తీసుకోవాలని డాక్టర్‌ గిరినాథ్‌ సూచిస్తు న్నారు. అంతేగానీ ఇది మరో అనారోగ్య సమస్య అనుకుని మరిన్ని యాంటీ బయాటిక్స్‌ వాడడం వల్ల సమస్య మరింత పెరిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు. 


ఈ లక్షణాలుంటే అనుమానించాల్సిందే.. 

కరోనా వైరస్‌ బారినపడిన, వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. సాధారణంగా జ్వరం, దగ్గు, ఆయాసం వంటివి ఉంటేనే చాలామంది కరోనాగా అనుమానిస్తున్నారు. అయితే ప్రతి వంద మందిలో 20 మందిలో గ్యాస్ట్రో సంబంధిత సమస్యలు కనిపిస్తున్నాయి. వారికి పరీక్షలు చేయిస్తుంటే పాజిటివ్‌గా నిర్ధారణ అవుతోంది. వైరస్‌ నుంచి కోలుకున్న వారిలో కొన్నిరకాల ఇబ్బందులు ఉంటున్నాయి. యాంటీ బయాటిక్స్‌ ఎక్కువగా వినియోగించడమే ఈ సమస్యలకు కారణం. 

- డాక్టర్‌ గిరినాథ్‌, కేజీహెచ్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగ ప్రొఫెసర్‌

Updated Date - 2020-09-04T15:55:14+05:30 IST