కరోనాకు ఇదొక్కటే విరుగుడు!

ABN , First Publish Date - 2020-07-12T17:08:52+05:30 IST

‘కరోనా వచ్చినంత మాత్రాన భయపడొద్దు. అన్ని జబ్బుల్లా..

కరోనాకు ఇదొక్కటే విరుగుడు!

మనోధైర్యం చాలు!

మందులు, ఆహారం, వ్యాయామం చాలు

వైరస్‌ నుంచి కోలుకున్న వారి మనోగతం


నెల్లూరు(ఆంధ్రజ్యోతి): ‘కరోనా వచ్చినంత మాత్రాన భయపడొద్దు. అన్ని జబ్బుల్లా అది కూడా. మంచి వైద్యం, పౌష్టికాహారం, శుభ్రత పాటిస్తే చాలు ఇట్టే నయమవుతుంది. ఐసోలేషన్‌లో వారం తిరగకముందే మేం కరోనా నుంచి బయటపడ్డాం. మనోధైర్యమే దానికి మందు..’’ మహమ్మారి కరోనా బారిన పడి క్షేమంగా ఇంటికి చేరిన బాధితుల మనోగతం ఇది. నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌ వస్తే చాలు అంతా బెంబేలెత్తిపోతారు. ఇక అంతే అన్న దశకు చేరుకుంటారు. తీవ్ర మనోవేదనకు గురై జిల్లాలో కొన్ని గుండెలు కూడా ఆగిపోయిన సంఘటనలు ఉన్నాయి. నిజంగా ఆ వైరస్‌ అంటే భయపడాలా!? అని అంటే.. అబ్బే, అదేం లేదంటున్నారు కరోనా బారిన పడి కోలుకున్నవారు. కరోనాకు చికిత్స చేయించుకుని క్షేమంగా ఆసుపత్రుల నుంచి ఇళ్లకు చేరిన వారితో ‘ఆంధ్రజ్యోతి’ ముచ్చటించింది. ఆ వివరాలు వారి మాటల్లోనే..


సమాజం ప్రవర్తించే తీరే ప్రమాదం

కరోనా ప్రమాదకరం కాదు. అది సులువుగా నయమవుతుంది. కానీ బాధితుడి పట్ల వైద్యులు, సమాజం తీరే ప్రమాదకరం. కరోనా సోకిన వెంటనే ఆ సమాచారం రాగానే శరీరం చెమట్లు పట్టి జీవితానికి దూరం అవుతున్నామనే భయం ఏర్పడింది. ఆ తర్వాత ఇంటికి 108 వాహనం వచ్చి పీపీఈ కిట్‌ను తగిలించి ఆసుపత్రికి తీసుకెళుతున్నప్పుడు ఈ సమాజం నుంచి మనం వెళ్లిపోతున్నామనే భావన కలుగుతుంది. ఆ తర్వాత ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలు, అక్కడ అందిస్తున్న ఆహారం చూస్తే మనం తిరిగి ఇంటికి పోతామా అనే అనుమానమూ వస్తుంది. ఆహారం సక్రమంగా ఉండటం లేదు. బయట ఆహారాన్ని అనుమతించటం లేదు. మందులు మింగారా లేదా అని అడిగే వారు లేరు. ఆహారం రుచించకపోయినా తినలేకపోతే ఇబ్బందులు తప్పవు. కేవలం జనరల్‌ మెడిసిన్‌తోనే కరోనాను జయించి బయటకు వచ్చాం. వాస్తవంగా కరోనాతో పెద్దగా ప్రమాదం ఉండదు.

- 55 ఏళ్ల కావలి వాసి


ఆందోళన వద్దు...

కరోనా వైరస్‌ సోకిందనగానే నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.  అయితే మంచి ఆహారం, వైద్యుల పర్యవేక్షణలో తొమ్మిది రోజులకే కోలుకున్నాను. ఇప్పుడు అందరితోపాటు తిరుగుతూ కరోనా బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నా. మాస్కు ధరించడం, సాధ్యమైనంత వరకు ఇంటి పట్టునే ఉండటం మంచిది

- 54 ఏళ్ల గూడూరువాసి


పాజిటివ్‌ అనగానే..

కరోనా నిర్ధారణలో పాజిటివ్‌ అనగానే ఒక్కసారిగా భయమేసింది. దీంతో బీపీ కూడా పెరిగింది. క్వారంటైన్‌లో డాక్టర్లు ఆరోగ్య సూత్రాలు పాటించాలని చెప్పారు. మంచి పౌష్టికాహారం తీసుకోవడంతోపాటు పారిశుధ్యంపై శ్రద్ధ చూపాలని సూచించారు. కొన్ని రోజులకు కోలుకుని ఇంటికి వచ్చాను. 

- 38 ఏళ్ల మహిళ, వెంకటగిరి 


మనోధైర్యమే మందు

పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిసిన వెంటనే భయపడ్డా. కుటుంబానికి దూరమవుతున్నానని ఆందోళనకు గురయ్యా. ఐసోలేషన్‌లో మంచి వైద్యసేవలు, మందులు, ఆహారం అందించడంతో వారానికి నెగిటివ్‌ రిపోర్టు వచ్చింది. అక్కడన్నువారిలో వారంలోపే కోలుకున్నవారిలో నేనే మొదటివాడిని. కరోనా నుంచి అంత త్వరగా కోలుకోవడానికి నాకున్న మనోధైర్యంతోనే సాధ్యపడిందని నమ్ముతున్నా. మనోధైర్యాన్ని మించిన వైద్యం లేదు. కరోనా వచ్చిందని ఎవరూ భయపడవద్దు.

- 44 ఏళ్ల వ్యక్తి, సంగం


ఐదు రోజుల్లో కోలుకున్నా

పాజిటివ్‌ అని తెలిసినా నేను మనోధైర్యం కోల్పోలేదు. కరోనాపై అవగాహన పెంచుకోవడం, వేళకు వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవడం, డాక్టర్ల సూచినలు పాటించడం, మందులు వేసుకున్నాను. కేవలం ఐదు రోజుల్లోనే నేను కోలుకుని ఇంటికి వచ్చాను. ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు బంధుమిత్రులు ఇచ్చిన ఆత్మస్థైర్యం ఎనలేనిది. 

- 30 ఏళ్ల యువకుడు, నాయుడుపేట


కుంగిపోకండి!

కరోనా వచ్చినంత మాత్రాన భయపడొద్దు. అన్ని వ్యాధుల్లానే అది కూడా. నాకు పాజిటివ్‌ అని తెలిసిన వెంటనే భయపడకుండానే నేనే స్వయంగా  సీహెచ్‌సీ సిబ్బందికి విషయం చెప్పడంతో వారు ఐసోలేషన్‌కు తరలించారు. అక్కడ ఆహారం, వైద్యం అందించడంతో త్వరగా కోలుకున్నాను. ఇప్పుడు హ్యాపీగా ఉన్నా. పాజిటివ్‌ వ్యక్తులు ఎవరూ భయంతో కుంగిపోవాల్సిన అవసరం లేదు. 

- 75 ఏళ్ల పొదలకూరు వాసి


జాగ్రత్తగా ఉండాలి

కరోనా వచ్చినంత మాత్రాన భయపడాల్సిన పనిలేదు. క్వారంటైన్‌లో ఉండి వైద్యం పొందితే చాలు. 20 రోజులు క్వారంటైన్‌లో ఉండి వైద్యం చేయించుకున్నా. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్క్‌లు, శానిటైజర్లతో ముందస్తు జాగ్రత్తలు కూడా పాటించాలి. 

- 30 ఏళ్ల మహిళ, బుచ్చిరెడ్డిపాళెం


Updated Date - 2020-07-12T17:08:52+05:30 IST