వైద్యం–వ్యాపారం

ABN , First Publish Date - 2020-08-15T06:28:40+05:30 IST

కరోనా వైద్యం విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల ధోరణిని కట్టడి చేయాలని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది.

వైద్యం–వ్యాపారం

కరోనా వైద్యం విషయంలో ప్రైవేటు ఆస్పత్రుల ధోరణిని కట్టడి చేయాలని తెలంగాణ హైకోర్టు గురువారం నాడు ప్రభుత్వాన్ని గట్టిగా ఆదేశించింది. యాదృచ్ఛికంగా అదే రోజున ప్రైవేటు ఆస్పత్రుల ప్రతినిధులు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి, సగం పడకలలో ప్రభుత్వం చెప్పిన ధరలకే చికిత్స అందిస్తామని చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల తీరుపై ప్రజలలో అసహ్యం వ్యక్తం అవుతోందని మంత్రి వ్యాఖ్యానించగా, వాటి ప్రతినిధులు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారట. కరోనా వ్యాప్తి ప్రారంభమై దాదాపు 5 నెలలు అవుతున్న సందర్భంలో, వ్యాధి తీవ్రత అనేక రెట్లు పెరిగి ఒకరకమైన భీతావహం వ్యాపించిన తరుణంలో – ప్రజలకు ప్రైవేటు వైద్యం సహేతుకమైన ధరలకు అందుబాటులోకి రావడం సంతోషించవలసిన విషయం. అయితే, ఇటువంటి పరిణామానికి ఇన్ని రోజులు పట్టాలా అన్నదే సందేహం.


ప్రైవేటు ఆస్పత్రులు సర్కారు కంటే బలమైనవా– అని ధర్మాసనం ప్రశ్నించింది కానీ, దానికి జవాబు న్యాయమూర్తులకు తెలియకపోదు. ప్రజల ప్రాణాలకు అన్నిటికంటె ఎక్కువ విలువ ఇచ్చే దేశాలలో, కరోనా కట్టడిలో భాగంగా ప్రైవేటు ఆస్పత్రులను ప్రభుత్వాలు తమ అధీనంలోకి తెచ్చుకున్నాయి. కొన్ని దేశాలలో వ్యాపార ఆరోగ్య రంగం కూడా బాధ్యతతో మెలిగింది. మనదేశంలో పరిస్థితి భిన్నం. మొదట, ప్రైవేటు ఆస్పత్రులను కరోనా పరీక్షలనుంచి, చికిత్స నుంచి దూరంగా ఉంచారు. ప్రజలలో ఉన్న భయాందోళనలకు తగ్గ స్థాయిలో పరీక్షలు నిర్వహించకుండా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ కలవరాన్ని పెంచింది. ప్రైవేటు ఆస్పత్రులను, పరీక్షాకేంద్రాలను అనుమతించాలని న్యాయస్థానమే తెలంగాణ ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చింది. ఆ అనుమతి పొందాక, కార్పొరేట్‌ వైద్యరంగం, ప్రశ్నార్థకమైన పద్ధతులతో కరోనా బాధితులతో వ్యవహరించింది. ప్రభుత్వం దాన్ని అదుపుచేయకుండా ప్రేక్షకపాత్ర వహించింది. ప్రైవేటుపై వస్తున్న ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించాలని న్యాయస్థానం గురువారం నాడు ఆదేశించవలసి వచ్చింది. అన్నిటికంటె ప్రాణమే విలువైనదన్న స్పృహ, ప్రభుత్వాలలో ఎందుకు లోపిస్తుందో అర్థం కాదు. ప్రస్తుతం నెలకొని ఉన్నటువంటి ఉత్పాత పరిస్థితిలో సైతం, వ్యాపార వర్గాల పరిరక్షణ వైపే ప్రభుత్వాలు మొగ్గు చూపడం ఆశ్చర్యకరం.


ప్రైవేటు వైద్యరంగం దిగివచ్చిందన్న ధోరణిలో ప్రభుత్వం భావించవచ్చు. కానీ, ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా వైద్యం ఏయే మొత్తాల ఫీజులకు అందించాలో ప్రభుత్వం స్పష్టంగా నిర్దేశించింది. ఆ ఆదేశం పడకల సంఖ్యలో పావు భాగానికో, సగభాగానికో కాదు, మొత్తం పడకలలో, మొత్తం వైద్యంలో ఆ చార్జీలు వర్తించాలి. కానీ, ఇప్పుడేమి జరిగింది? ప్రభుత్వమే దిగివచ్చి, సగం పడకలలో అమలుచేస్తే చాలును, తక్కిన పడకలలో మీ ఇష్టం అన్న ధోరణిలో అంగీకారం జరిగింది. ఇక ఒప్పుకున్న ఆ సగం పడకలలో చికిత్స ఎంత గొప్పగా ఉంటుందో చూడాలి. ఆరోగ్యశ్రీ పథకం కింద చికిత్స చేయవలసి వచ్చినప్పుడు, ప్రైవేటు ఆస్పత్రులలో అంతస్థుల వైద్యం మొదలయింది. ఆరోగ్యశ్రీల కోసం ఉన్న ఏర్పాట్లు, ప్రభుత్వ ఆస్పత్రులతో సరిసమానంగా, ఒక్కోసారి అంతకంటె తక్కువ రకంగా ఉండేవి. ఇప్పుడు, ఈ సగం పడకల పరిస్థితి కూడా అట్లాగే ఉంటుందా? ఉండకుండా, ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందా? చూడాలి.


న్యాయస్థానాలు విమర్శించాయా, ప్రశంసించాయా– అన్నది ప్రభుత్వాలు పట్టించుకోవలసిన అంశమే. స్పందన తక్కువైన ప్రభుత్వాల మీద న్యాయస్థానాలను ఆశ్రయించడం తప్ప మరో దారి ఉండడం లేదు. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఇతర ప్రజాస్వామిక మార్గాలు కూడా అందుబాటులో ఉంటే, న్యాయస్థానాల మీద ఇంత భారం పడేది కాదు. సమాజం నుంచి కొందరు స్వచ్ఛందంగా కరోనా సేవలో పాల్గొంటామని ముందుకు వస్తే, వారికి సహకరించమని చెప్పడానికి కూడా కోర్టులే అవసరమవుతున్నాయి. ప్రజలను, పౌరసమాజాన్ని, స్వచ్ఛంద సేవకులను కలుపుకుని ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనే వ్యూహాన్ని అమలుచేయాలని మొదటి నుంచి సూచనలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ వ్యవస్థలు ఎంత సమర్థంగా పనిచేసినా, వాటి పరిధులు సోకని ప్రాంతాలు, ప్రజావర్గాలు ఉంటాయి. వారిని చేరుకోవాలంటే, సాంప్రదాయేతర మార్గాలను అనుసరించవలసిందే.


ఏది ఏమైనా, చివరకు సమాజానికి జవాబుదారీగా ఉంటామని వైద్యవ్యాపారులు అంగీకరించారు. వారు మాట నిలుపుకునేలా, పర్యవేక్షించవలసింది ప్రభుత్వమే. అట్లాగే, కరోనా బీభత్సం అట్లాగే కొనసాగుతున్నందున, సాధ్యమైనంతగా ప్రాణనష్టాన్ని నివారించడానికి ప్రభుత్వాలు సృజనాత్మకంగా వ్యూహరచన చేయవలసి ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి జాతీయస్థాయిలో ఆందోళన కలిగించే స్థాయికి చేరుకున్నది. ఎక్కువ పరీక్షలు జరపడం వంటి అంశాలలో ముందున్నప్పటికీ, ప్రాణనష్టాన్ని నివారించడంలోను, వ్యాధి దావానలంలా వ్యాప్తి చెందకుండా నిరోధించడంలోను ప్రభుత్వం విఫలమవుతున్నది. గ్రామీణ ప్రాంతాలలో, చిన్న పట్టణాలలో వ్యాప్తి అమిత ప్రమాదకరమైనది. ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణలో ముందే చర్యలు తీసుకున్నప్పటికీ, వాటి ఫలితాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందడం లేదు. లాభమే పరమావధిగా ఉన్నవారు ఏదో రకంగా ప్రభుత్వ కట్టడులను అతిక్రమిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొనాలంటే, పరీక్షల ఫలితాలను త్వరితగతిన రాబట్టే చర్యలు తీసుకోవడంతో పాటు, ప్రైవేటు ఆస్పత్రులపై మరింత గట్టి అదుపు సాధించడం అవసరం. ఇటీవల ఒక హోటల్లో ఏర్పాటుచేసిన తాత్కాలిక వైద్యకేంద్రం అగ్ని ప్రమాదానికి గురై, పదిమందికి పైగా మృతిచెందిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వ స్పందన కంటితుడుపు తీరులో ఉండడం విషాదం.

Updated Date - 2020-08-15T06:28:40+05:30 IST