‘జూమ్‌’ లేకున్నా... ధూమ్‌ధామ్‌ చేసేద్దాం!

ABN , First Publish Date - 2020-04-18T05:54:04+05:30 IST

లాక్‌డౌన్‌ కారణంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ పెరిగింది. అదే సమయంలో ఉద్యోగులతో సంభాషించడం కోసం వీడియో కాన్ఫరెన్స్‌ అప్లికేషన్ల వినియోగం పెరిగింది. అయితే అలాంటి యాప్స్‌లో ఒకటైన ‘జూమ్‌’ అప్లికేషన్‌ సురక్షితం కాదని

‘జూమ్‌’ లేకున్నా... ధూమ్‌ధామ్‌ చేసేద్దాం!

లాక్‌డౌన్‌ కారణంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ పెరిగింది. అదే సమయంలో ఉద్యోగులతో సంభాషించడం కోసం వీడియో కాన్ఫరెన్స్‌ అప్లికేషన్ల వినియోగం పెరిగింది. అయితే అలాంటి యాప్స్‌లో ఒకటైన ‘జూమ్‌’ అప్లికేషన్‌ సురక్షితం కాదని కేంద్రం ప్రకటించింది. మరి దానికి ప్రత్యామ్నాయం లేదా అంటే... చాలా యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. అలాంటి కొన్ని యాప్స్‌ ఇవి...




గూగుల్‌ మీట్‌

గూగుల్‌ సంస్థ తన జీ - సూట్‌ సబ్‌స్ర్కిప్షన్‌ కలిగి ఉన్న వినియోగదారుల కోసం అందిస్తున్న వీడియో కాన్ఫరెన్సింగ్‌ అప్లికేషన్‌ ఇది. ఇందులో ఒక్కో కాల్‌లో 250 మంది పార్టిసిపెంట్స్‌ ఉండొచ్చు, లక్షమంది వరకు లైవ్‌ స్ట్రీమింగ్‌ ద్వారా చూడవచ్చు. మీటింగ్‌ పూర్తయిన తర్వాత రికార్డు చేయబడిన మీటింగ్‌ గూగుల్‌ డ్రైవ్‌లో భద్రంగా స్టోర్‌ చేయబడుతుంది. గూగుల్‌ మీట్‌లో ఉన్న ప్రీమియం సదుపాయాలను సెప్టెంబర్‌ 30 వరకు గూగుల్‌ సంస్థ ఉచితంగా అందిస్తోంది. జీ - సూట్‌ సబ్‌స్ర్కిప్షన్‌ లేని వారు గూగుల్‌ హ్యాంగవుట్స్‌ ద్వారా గరిష్టంగా 25 మంది వరకూ గ్రూప్‌ వీడియో కాల్‌ చేసుకోవచ్చు.




స్కైప్‌ మీట్‌ నౌ

వీడియో సమావేశాల కోసం స్కైప్‌ ‘మీట్‌ నౌ’ పేరుతో కాన్ఫరెన్స్‌ సదుపాయాన్ని అందిస్తోంది. ఇందులో కాల్‌ రికార్డింగ్‌తో పాటు, బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌ చేసే సదుపాయం, స్ర్కీన్‌ షేరింగ్‌ వంటివి ఉన్నాయి. ఉచితంగా ఉపయోగించుకునే వినియోగదారులు గరిష్టంగా 50 మంది వరకు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుకోవచ్చు. సమయం అపరిమితం. రికార్డు చేయబడిన కాన్ఫరెన్స్‌ నెల రోజుల పాటు భద్రంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఎలాంటి అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సిన పని లేకుండా పార్టిసిపెంట్స్‌ మీ కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు.




సిస్కో వెబెక్స్‌

వెబెక్స్‌ అప్లికేషన్‌ కొన్ని దశాబ్దాల క్రితమే అందుబాటులో ఉంది. 2007లో సిస్కో సంస్థ దీన్ని సొంతం చేసుకుంది. ప్రధానంగా బిజినెస్‌ అప్లికేషన్‌గా ఈ యాప్‌కు గుర్తింపు ఉంది. ఇందులో ఉచిత వెర్షన్లో కేవలం 50 మంది వరకు మాత్రమే సపోర్ట్‌ ఉండేది. ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా తాత్కాలికంగా వందమంది కాన్ఫరెన్స్‌లో పాల్గొనే సదుపాయాన్ని అందించారు. ఒక్కో మీటింగ్‌ అపరిమితమైన సమయం నిర్వహించుకోవచ్చు. 





స్టార్‌లీఫ్‌

ఇంతకాలం పెద్ద పెద్ద కంపెనీలకు మాత్రమే సుపరిచితమైన ఈ అప్లికేషన్‌ ఇప్పుడు లాక్‌డౌన్‌ కారణంగా ఉచిత వెర్షన్‌ కూడా అందించడం మొదలుపెట్టింది. దీంతో గరిష్టంగా 20 మంది వరకూ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనవచ్చు. ఒక్క మీటింగ్‌కు 46 నిమిషాలపాటు పరిమితి ఉంటుంది. అన్ని రకాల ఆపరేటింగ్‌ సిస్టంలను ఇది సపోర్ట్‌ చేస్తుంది.





గో టు మీటింగ్‌

వీడియో, ఆడియో, వెబ్‌ మీటింగ్స్‌ని నిర్వహించుకోవడానికి అందుబాటులో ఉన్న మరో సర్వీస్‌ ఇది. 250 మంది పార్టిసిపెంట్‌ని ఇది సపోర్ట్‌ చేస్తుంది. అపరిమితమైన రికార్డింగ్‌తో పాటు, స్ర్కీన్‌ షేరింగ్‌, డ్రా సదుపాయాలు కూడా ఉంటాయి. మీటింగ్‌లో చర్చించిన విషయాలు ట్రాన్సిప్షన్‌ రూపంలోనూ లభిస్తాయి. ఈ అప్లికేషన్లతో పాటు అతి కొద్ది మంది వ్యక్తులతో సంభాషించాలంటే వాట్సప్‌ వీడియో కాల్‌, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ వీడియో ఛాట్‌ వంటివి ప్రయత్నించవచ్చు. వాట్సప్‌ వీడియో కాల్‌లో ప్రస్తుతం ఉన్న నలుగురు పరిమితిని కొద్ది రోజుల్లో ఆ సంస్థ పెంచబోతోంది. వీటిలో మీరు ఎలాంటి అప్లికేషన్‌ వాడినప్పటికీ వాటిలో ఉండే సెక్యూరిటీ ఆప్షన్స్‌ మీద అవగాహన పెంచుకోవాలి. అవసరం లేని ఆప్షన్స్‌ డిజేబుల్‌ చేసుకోవటం, మీటింగ్‌ లింకులను పబ్లిక్‌గా పెట్టకపోవడం, మీ అకౌంట్‌ని సురక్షితంగా కాపాడుకోవడం చేయకపోతే కచ్చితంగా ప్రమాదాలు పొంచి ఉంటాయి.






గూగుల్‌ డ్యుయో

పరిమిత మొత్తంలో ఆడియో మరియు వీడియో కాన్ఫరెన్స్‌ కోసం దీన్ని ఉపయోగించవచ్చు. గరిష్టంగా 12 మందిని ఇది సపోర్ట్‌ చేస్తుంది. మొబైల్‌, బ్రౌజర్‌, స్మార్ట్‌ డిస్‌ప్లే వంటి అన్ని రకాల డివైజ్‌ల మీద ఇది పనిచేస్తుంది. డేటా సెక్యూరిటీ కోసం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ ఈ అప్లికేషన్లో లభిస్తుంది.





మైక్రో సాఫ్ట్‌ టీమ్స్‌ 

మెరుగైన ప్రొడక్టివిటీ కోరుకునే వివిధ వ్యాపార సంస్థల ఉద్యోగుల కోసం మైక్రోసాఫ్ట్‌ అందిస్తున్న యాప్‌ ఇది. ఇందులో కాన్ఫరెన్స్‌ కాలింగ్‌, మీటింగులను షెడ్యూల్‌ చేసుకోవడం, ఫైల్స్‌ షేర్‌ చేసుకోవడం, స్ర్కీన్‌ షేరింగ్‌ సదుపాయం వంటి ఆప్షన్లు ఉన్నాయి. పెయిడ్‌ వెర్షన్‌ వాడే వారికి మైక్రోసాఫ్ట్‌ ఆఫీస్‌ 365 సూట్‌ కూడా లభిస్తుంది.





నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-04-18T05:54:04+05:30 IST