కాసులిస్తే కన్నెత్తి చూడం

ABN , First Publish Date - 2020-05-29T09:01:55+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌ వాణిజ్యం లేకుండా చేసింది. అన్ని వర్గాలనూ ఆర్థికంగా దెబ్బతీసింది.

కాసులిస్తే  కన్నెత్తి చూడం

ఆంధ్రజ్యోతి - విజయవాడ : కరోనా లాక్‌డౌన్‌ వాణిజ్యం లేకుండా చేసింది. అన్ని వర్గాలనూ ఆర్థికంగా దెబ్బతీసింది. నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొదట్లో విజయవాడ నగరం మొత్తాన్నీ రెడ్‌జోన్‌గా ప్రకటించారు. తర్వాత కేసుల సంఖ్యనుబట్టి సడలింపులు అమలుచేస్తున్నారు. సడలింపు సమయాల్లో మినహా మిగిలిన సమయాల్లో ఎలాంటి కార్యకలాపాలు లేకుండా గస్తీ ఏర్పాటు చేశారు ఉన్నతాధికారులు. అయితే కొన్ని ప్రాంతాల్లో గస్తీ పోలీసుల తీరు తీవ్రమైన విమర్శలకు తావిస్తోంది. జోన్ల గురించి అవగాహనలేని చిరువ్యాపారుల నుంచి నయానో భయానో కాసులు పిండుకునే ప్రయత్నం చేస్తునారనే విమర్శలు వినిపిస్తున్నాయి. తమకు రోజుకు ఇంతని ఇస్తే ఇక దుకాణం జోలికి రాబోమని బహిరంగంగా ఆఫర్‌ ఇస్తున్న ఖాకీలు కూడా ఉంటున్నారు. 


విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో కంటైన్‌మెంట్‌, నాన్‌కంటైన్మెంట్‌ జోన్లు ఉన్నాయి. కంటైన్మెంట్‌ జోన్లలో ఎలాంటి మినహాయింపులు లేవు. నాన్‌ కంటైన్మెంట్‌ జోన్లలో మాత్రమే స్వల్ప సడలింపులు ఉన్నాయి. ఇప్పటికీ ఈ సడలింపుల విషయంలో వ్యాపారులకు ఒక స్పష్టత లేదు. వారు ఏ జోన్‌లో ఉన్నారో నిర్ధారించుకోలేని పరిస్థితి కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ఎన్నో ఇబ్బందులు పడిన చిరు వ్యాపారులు సడలింపు కారణంగా వ్యాపారాలు కొంచెమైనా పుంజుకుంటా యేమోనని ఆశపడుతుంటే లంచావతారులైన కొందరు ఖాకీలు వారినీ వదలడం లేదు. నిబంధనల ప్రకారం నిర్దేశించిన సమయానికి దుకాణాలను మూయించేస్తే ఎలాంటి విమర్శలకు తావుండదు.


ముందురోజు లంచం డిమాండ్‌ చేసి, ఇవ్వలేమన్నారని మర్నాడే కేసు నమోదు చేస్తామని హెచ్చరించడం ఎంత వరకు సమంజసమన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. విజయవాడ నగర పరిధిలో కొన్ని ప్రాంతాల్లో మున్సిపల్‌ ఉద్యోగుల నుంచి, మరికొన్ని ప్రాంతాల్లో పోలీసుల నుంచి చిరువ్యాపారులకు ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నట్టు సమాచారం. దీనిపై ఉన్నతాధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

Updated Date - 2020-05-29T09:01:55+05:30 IST