నాడి పట్టేవారేరీ!

ABN , First Publish Date - 2020-04-04T11:22:55+05:30 IST

రోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల్లో సేవలు స్తంభించాయి.

నాడి పట్టేవారేరీ!

తలుపులు తెరవని ప్రైవేటు వైద్యులు

సాధారణ రోగుల ఇబ్బందులు 

సకాలంలో వైద్యం అందకకనిగిరిలో ఓ చిన్నారి మృతి 

ఒంగోలులో ప్రాణాలు విడిచిన వృద్ధుడు 


ఒంగోలు, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) : కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల్లో సేవలు స్తంభించాయి.   ఆసుపత్రుల తలుపులు మూతపడ్డాయి. దీంతో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సకాలంలో వైద్యం అందని దుస్థితి నెలకొంది. పలువురు ప్రాణాలు కూడా కోల్పోతున్న ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం కనిగిరిలో ఓ చిన్నారికి అదే పరిస్థితి ఎదురయ్యింది.  కొంతకాలంగా శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్న ఆ చిన్నారి అవసరమైనప్పుడు వైద్యులు అందిస్తున్న సేవతో  సమస్యను జయించే దిశగా పయనిస్తోంది. అయితే పది రోజుల నుంచి ఆ పాపను చూసే నాథుడు లేక వ్యాధి తీవ్రత పెరిగింది.  కనిగిరిలోని ప్రభుత్వ వైద్యశాలకు వెళితే మాకు చేతకాదు ఒంగోలు వెళ్లమన్నారు. అక్కడి రిమ్స్‌కు వెళ్తే గుంటూరు సిఫార్సు చేశారు. తల్లిదండ్రులు ఆ బాలికను తరలిస్తుండగా మర్గమధ్యంలో మృతి చెందింది. 


ఒంగోలులోని క్వారంటైన్‌లో ఉన్న చీరాలకు చెం దిన 65 సంవత్సరాల వృద్ధుడికి వైద్య పరీక్షలో కరోనా లేదని తేలింది.  అయితే అధికారికంగా ఆ విషయాన్ని గమనించేలోపే ఆయనకు దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులు ముదిరి పాకానపడ్డాయి.  షు గరు, బీపీతో పాటు కిడ్నీపరమైన సమస్య అతనికి ఉంది. క్వారంటైన్‌లో చేరిన తర్వాత భయంతో అతని షుగరు స్థాయి పెరిగి పోయింది.  మందుల డోస్‌ పెంచినా నియంత్రణ కాలే దు. కిడ్నీల సమస్య ఒక్కసారిగా ముదిరింది. ఉత్తమ వైద్యం కోసమంటూ కుటుంబ సభ్యులు ప్రభుత్వ అనుమతి తీసుకుని ఒంగోలులోని ప్రైవేటు వైద్యశాలల చుట్టూ తిరిగారు. కానీ ఎవ్వ రూ రానీయలేదు.  దీంతో తిరిగి ఆ రోగిని రిమ్స్‌కు తీసుకొచ్చారు.  ప్రైవేటు వైద్యశాలలో చికిత్స కోసం ఆయన్ను తిప్పిన రెండు గంటల సమయమే చివరకు ఆయన ప్రాణాన్ని తీసింది.


ఇంట్లో ఉండి  కరోనా భయంతో షుగరు, బీపీలు పెంచుకుంటున్న వారు చాలా మంది ఉన్నా రు. గుండెజబ్బులు ఉన్న వారికి ఆయాసం, దడ పెరిగిపోతున్నాయి.  దీనికి తోడు ఏదోరకమైన కారణంతో ప్రమాదాలకు గురయ్యే వారూ ఉన్నారు.  వారందరూ అందుబాటులో ఉన్న ప్రైవేటు వైద్యశాలకు పరుగులెత్తితే తలుపులు మూసేసి ఉంటున్నాయి.  జిల్లా కేంద్రమైన ఒంగోలు వరకూ చూస్తే ఒక్క ప్రైవేట్‌ వైద్యశాలలో కూడా ఓపీలు చూడటం లేదు.  అత్యవసర కేసుల్లోనూ కొన్ని రకాల వ్యాధుల రోగులకు మాత్రమే సేవలందిస్తున్నారు.  


పెరిగిపోతున్న అసాధారణ మరణాలు

 వైద్యశాల నిర్వాహకులు లేక డాక్టర్లు చెప్పే కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా సాధారణ రోగులకు వైద్యసేవలు అందించకపోవటం వల్ల అసాధారణ మరణాలు పెరిగిపోతున్నాయి. డాక్టర్లు వైద్యసేవకు ముందుకు రావటం లేదని వైద్యశాలల యాజమాన్యాలు చెప్తున్నాయి. ప్రభుత్వం ఈ ప్రమాదాన్ని గుర్తించే వైద్యశాలలకు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలన్నీ విడుదల చేశామని చెప్తోంది. అయినా ఆశించిన స్థాయిలో జిల్లాలో ప్రైవేటు వైద్యశాలల నుంచి సాధారణ రోగులకు వైద్యసేవలు అందటం లేదు. ఈ దశ లో వైద్యశాల నిర్వాహకులు, వైద్యులు, సిబ్బంది మానవతా దృక్పధంతో ముందుకు రావాల్సిన అవసరం ఉం ది. లేదంటే ప్రభుత్వం ప్రత్యేక చట్టం ద్వారా వారిని రంగంలోకి తీసుకు రావాల్సిన ఆవశ్యకత కనిపిస్తోంది. 

Updated Date - 2020-04-04T11:22:55+05:30 IST