మానవీయతే మన ఆయుధం!

ABN , First Publish Date - 2020-04-01T05:55:05+05:30 IST

‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. సర్వత్రా లాక్‌డౌన్‌. ఈ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలంటే అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు రకరకాల ఇబ్బందులు...

మానవీయతే మన ఆయుధం!

‘‘కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేస్తోంది. సర్వత్రా లాక్‌డౌన్‌. ఈ వైరస్‌ వ్యాప్తిని నియంత్రించాలంటే  అందరూ ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రజలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఇళ్లకు పరిమితమవుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, సామాన్య ప్రజలు, వలస జనాల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయి. ఇల్లు గడవాలంటే, బువ్వ నోటికి అందాలంటే ఏదో ఒక పని చేయాలి. లేకపోతే పస్తులే. ఇలాంటి విపత్తులో ఇంటికి పరిమితం కావడం అవసరమే అయినప్పటికీ ఒక సామాజిక కార్యకర్తగా నాలో సంఘర్షణ చెలరేగుతోంది. చిన్నారుల కోసం నడుపుతున్న ‘అంకురం’ షెల్టర్‌ హోం పనుల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అది ఒకటైతే, నేను ఉండేది చిన్న అపార్ట్‌మెంటులో. మా షెల్టర్‌లో ఉన్నవారు నా ఇంటికి తరచూ రావాల్సి ఉంటుంది. మరోవైపు అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌వారు బయటవారిని లోపలికి అనుమతించొద్దని నిబంధనలు పెట్టారు. పనివాళ్లని ఇళ్లల్లోకి రానివ్వొద్దని కూడా అపార్ట్‌మెంట్‌ వాళ్లు ఆర్డర్స్‌ జారీ చేశారు. ఒక సామాజిక కార్యకర్తగా ఆ మాట నాకు సబబుగా అనిపించలేదు. పనివాళ్లు తమతో కోవిడ్‌-19 తెస్తారన్న ఒక ‘బ్లేమ్‌’  వాళ్ల మాటల్లో నాకు ధ్వనించింది. కరోనాలాంటి మహమ్మారులను ఎదుర్కొనేటప్పుడు దాని నియంత్రణలో ‘మానవీయత’ మరింత శక్తివంతమైన ఆయుధంగా పనిచేస్తుందని నేను విశ్వసిస్తా. లేకపోతే, సమాజం పేద, సంపన్నవర్గాల మధ్య దూరం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉంది. ‘లాక్‌డౌన్‌’ వల్ల మానసిక సమస్యలున్న వారికి ఇలా జంటరితనాన్ని ఎదుర్కోవడం కష్టమే. ముఖ్యంగా సీనియర్‌ సిటిజన్స్‌ను ఇళ్లలో మరీ ఒంటరులను చేస్తున్నారు. ఒకరినొకరు పలకరించుకోవడం వల్ల మన కోసం మనుషులున్నారన్న భావం కలిగి, ఎంతటి విపత్తునైనా ధైర్యంగా ఎదుర్కోగలుగుతాం. ఆ పాఠాన్ని ఈ లాక్‌డౌన్‌ వల్ల చాలామంది నేర్చుకుంటారు.’’


సుమిత్ర, అంకురం

Updated Date - 2020-04-01T05:55:05+05:30 IST