బంద్‌ కరోనా!

ABN , First Publish Date - 2020-03-24T10:49:17+05:30 IST

‘లాక్‌డౌన్‌’... ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఇప్పుడు ప్రభుత్వాలు ఆశ్రయించిన మార్గం...

బంద్‌ కరోనా!

‘లాక్‌డౌన్‌’... ఇప్పుడు ఎవరి నోట విన్నా ఇదే మాట. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించడానికి ఇప్పుడు ప్రభుత్వాలు ఆశ్రయించిన మార్గం ఇదే! ఇంతకీ లాక్‌డౌన్‌ అంటే ఏమిటి? ఈ సమయంలో ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? ఇదిగో నిపుణుల మాట...

‘లాక్‌డౌన్‌’ అంటే మూసివేయడం! ఇదొక అత్యవసర నియమం (ఎమర్జెన్సీ ప్రొటోకాల్‌). ప్రజలను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లకుండా నిరోధించేందుకు ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటిస్తాయి. ఇప్పుడు ‘అంటువ్యాధుల నియంత్రణ చట్టం - 1897’ కింద మన ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. 

ఈ సమయంలో రాష్ట్రాల మధ్య సరిహద్దులు మూసివేస్తారు. ప్రైవేటు వాహనాలను అనుమతించరు. ప్రజల నిత్యావసర వస్తువులను రవాణా చేసే గూడ్స్‌ వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సేవలు అందుబాటులో ఉంటాయి. నిత్యావసర వస్తువుల దుకాణాలు, మందుల షాపులు, బ్యాంకులు తెరచి ఉంటాయి. 

పబ్లిక్‌ రవాణా సౌకర్యాలను పూర్తిగా నిషేధిస్తారు. అంటే బస్సులు, రైళ్లు, ఆటోల ప్రయాణం నిషేధంలో ఉంటుంది.

ఆస్పత్రికి వెళ్లడం, మందుల దుకాణానికి వెళ్లడం, నిత్యావసర వస్తువుల కొనుగోలుకు వెళ్లడం లాంటి అత్యవసరాలకు అనుమతి ఉంటుంది. 

జనం గుంపులుగా ఉండకూడదు. పార్కులు, సినిమా హాళ్లు, జనం ఎక్కువగా గుమిగూడే ప్రదేశాలన్నీ మూసి వేస్తారు.

లాక్‌డౌన్‌ ఉన్న సమయంలో ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి బయటకు వెళితే జరిమానా, సాధారణ జైలు శిక్ష విధించేందుకు అధికారం ఉంటుంది. 

కరోనా వైరస్‌ విస్తరించకుండా ఉండేందుకు ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఈ సమయంలో ఇళ్లకు పరిమితమై ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండాలి. అప్పుడే కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించగలుగుతాం.

Updated Date - 2020-03-24T10:49:17+05:30 IST