కోనసీమలో విజృంభిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2020-06-03T11:33:32+05:30 IST

మొన్న ఢిల్లీలోని మర్కజ్‌.. నిన్న చెన్నైలోని కోయంబేడు.. నేడు మహారాష్ట్రలోని ముంబై నుంచి వచ్చిన వలసవాదులతో..

కోనసీమలో విజృంభిస్తున్న కరోనా

ముంబయి నుంచి వచ్చిన వారిలో ఇప్పటిదాకా 50 మందికి సోకిన వైరస్‌

ఆందోళన చెందుతున్న ప్రజలు


(అమలాపురం-ఆంధ్రజ్యోతి): మొన్న ఢిల్లీలోని మర్కజ్‌.. నిన్న చెన్నైలోని కోయంబేడు.. నేడు మహారాష్ట్రలోని ముంబై నుంచి వచ్చిన వలసవాదులతో కోనసీమలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం ఒక్కరోజే ఇక్కడి ప్రభుత్వ కార్వంటైన్లలో ఉన్న 27 మందికి కొవిడ్‌-19 సోకినట్టు నిర్ధారించారు. వీరంతా గత నెల 31న ముంబయి నుంచి శ్రామిక్‌ రైలులో వచ్చినవారే. గత ఐదు రోజుల్లో ముంబై నుంచి వచ్చిన కార్మికుల్లో సుమారు 50మంది వరకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో కోనసీమలోని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తొలుత ముమ్మిడివరం మండలం కొత్తలంకకు చెందిన రెండు కుటుంబాల్లోని 11 మందికి పాజిటివ్‌ వచ్చింది. రాజోలు ప్రభుత్వ క్వారంటైన్‌లో ఉన్న అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారానికి చెందిన తొమ్మిది మందికి సోమవారం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మంగళవారం ఈ సంఖ్య భారీగా పెరిగింది.


రాజోలు క్వారంటైన్‌లో ఉన్న 80 మందికి శాంపిల్స్‌ తీయగా 12 మందికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. రావులపాలెం క్వారంటైన్‌లో 80 మందికి శాంపిల్స్‌ తీయగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అమలాపురంలోని డీఆర్డీఏ, చెయ్యేరులోని శ్రీనివాసా ఇంజనీరింగ్‌ కళాశాల క్వారంటైన్లలో ఉన్న 111 మందికి శాంపిల్స్‌ తీయగా పది మందికి పాజిటివ్‌ అని తేలింది.


వీరంతా ముమ్మిడివరం, ఐ.పోలవరం, మామిడికుదురు, అల్లవరం మండలాల పరిధిలోని వ్యక్తులే. ముంబై నుంచి వచ్చిన శ్రామిక్‌ రైలులో సుమారు 235 మంది దాకా రాగా అందులో 50 మందికి వైరస్‌ సోకింది. దీంతో ఆయా క్వారంటైన్లలో వీరితో కలిపి ఉన్న వ్యక్తులతో పాటు వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వీరందరినీ నేరుగా రాజమహేంద్రవరం నుంచే క్వారంటైన్‌ సెంటర్లకు తరలించి కరోనా పరీక్షలు నిర్వహించడం వల్ల ఇతరులకు, ఆయా గ్రామాల ప్రజలకు ఎటువంటి ప్రమాదం లేదని ఆర్డీవో బీహెచ్‌ భవానీశంకర్‌ చెప్పారు.

Updated Date - 2020-06-03T11:33:32+05:30 IST