మళ్లీ కరోనా గుబులు

ABN , First Publish Date - 2021-12-05T04:47:19+05:30 IST

కరోనా మళ్లీ కలకలం రేపుతున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఐదు రోజుల క్రితం వరకు ఒకటి, రెండు కేసులు నమోదవగా ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో వణుకు పుట్టిస్తున్నది. మరోవైపు ఒమైక్రాన్‌ వేరియంట్‌ వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించి కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.

మళ్లీ కరోనా గుబులు
హవేళీఘణపూర్‌ బాలికల గురుకులంలో కేసులు నమోదైనట్టు తెలియడంతో పాఠశాలకు వచ్చిన తల్లిదండ్రులు

ఎక్కడికక్కడ పెరుగుతున్న కేసులు

పాఠశాలల్లో ఆందోళనకరం

తల్లిదండ్రుల్లో భయాందోళన

మరోవైపు ఒమైక్రాన్‌ ముప్పు

అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యశాఖ


కరోనా మళ్లీ కలకలం రేపుతున్నది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఐదు రోజుల క్రితం వరకు ఒకటి, రెండు కేసులు నమోదవగా ఈ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో వణుకు పుట్టిస్తున్నది. మరోవైపు ఒమైక్రాన్‌ వేరియంట్‌ వార్తలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని, తప్పనిసరిగా మాస్క్‌ ధరించి కరోనా నిబంధనలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.


మెదక్‌ అర్బన్‌/ సంగారెడ్డి అర్బన్‌/హవేళీఘణపూర్‌/ తూప్రాన్‌/పటాన్‌చెరు రూరల్‌, డిసెంబరు 4 : మళ్లీ కరోనా విజృంభణ మొదలైంది. ఓవైపు ఒమైక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో అధికారుల బృందం అప్రమత్తంగా ఉన్నప్పటికీ మరోవైపు ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఐదు రోజుల క్రితం వరకు ప్రతీ రోజు ఒకటి లేదా రెండు కేసులు మాత్రమే నమోదయ్యేవి. కానీ తాజాగా పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన రేకెత్తిస్తున్నది. ముఖ్యంగా విద్యాసంస్థల్లో వెలుగుచూస్తున్న పాజిటివ్‌ కేసులతో తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. ఐదు రోజుల క్రితం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మా జ్యోతిరావుఫూలే బాలికల గురుకుల పాఠశాలల్లో 47 మంది విద్యార్థినులకు, ఒక ఉపాధ్యాయురాలికి వైరస్‌ సోకడంతో కలకలం మొదలైంది. తాజాగా శనివారం మరో 18 మందికి సోకినట్లు తెలిసింది. ఇదే మండల పరిధి ఇంద్రేశంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే బాలికల గురుకుల పాఠశాలలోని శుక్రవారం వరకు 46 కేసులు వెలుగుచూశాయి. తాజాగా శనివారం మెదక్‌ జిల్లాలోని గురుకుల పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు, తూప్రాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలికి పాజిటివ్‌గా తేలింది.

ముత్తంగి గురుకులంలో మరో 18 మందికి

సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని ముత్తంగి జ్యోతిరావుఫూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం మరో 18 మంది విద్యార్థినులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శుక్రవారం రాత్రి, శనివారం ఉదయం 426 మంది విద్యార్థినులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు నిర్వహించగా 18 మందికి పాజిటివ్‌గా తేలింది. కాగా కరోనా సోకిన విద్యార్థినులను పాఠశాల పైఅంతస్తులో ఐసోలేషన్‌లో ఉంచి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు.

హవేళీఘణపూర్‌ గురుకులంలో ముగ్గురికి

మెదక్‌ జిల్లా హవేళీఘణపూర్‌ మండలంలోని మహాత్మాజ్యోతిరావుఫూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం కరోనా కేసులు వెలుగుచూశాయి. ఈ గురుకులంలో 5వ తరగ తి నుంచి 10వ తరగతి వరకు 541 మంది బాలికలు చదువుతున్నారు. శనివారం ఉదయం ముగ్గురు విద్యార్థినులకు జ్వరాలు రాగా వారికి మెదక్‌ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా టెస్టులు చేయించగా ఇద్దరికి పాజిటివ్‌గా తేలింది. దీంతో వైద్యబృందం మండల వైద్యాధికారి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలకు చేరుకొని 100 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు. అందులో ఒకరికి పాజిటివ్‌ వచ్చిందని తెలిపారు. పాజిటివ్‌ వచ్చిన ముగ్గురు బాలికలు ఏడో తరగతి చదువుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తమ పిల్లలకు ఎలా ఉందోనని కలత చెందారు. ఇళ్లకు పంపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

తూప్రాన్‌లోని ప్రభుత్వ పాఠశాల టీచర్‌కు

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణ పరిధి హైదర్‌గూడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు (44)కు శనివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. శనివారం స్థానిక సీహెచ్‌సీలో పరీక్షలు చేయించుకున్నారు. తూప్రాన్‌లో నివాసముంటున్న ఆమెతోపాటు, ఇద్దరు కుమారులకు సైతం పాజిటివ్‌గా తేలింది. మూడు రోజులుగా జలుబుతో బాధపడుతున్న ఉపాధ్యాయురాలు శనివారం సైతం హైదర్‌గూడ పాఠశాలకు వచ్చింది. ఈ బడిలో 38 మంది విద్యార్థులు ఉండగా 28 మంది హాజరైనట్లు తెలిసింది. ఆమె పాఠశాల నుంచే ఆస్పత్రికి వెళ్లి కరోనా పరీక్షలు చేయించుకొని మళ్లీ పాఠశాలకే వచ్చింది. పాఠశాలలో తరగతులు బోధిస్తుండగానే పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు రిపోర్టు రావడంతో విద్యార్థులకు చెప్పకుండానే ఇంటికి వెళ్లిపోయింది. అనంతరం ఆస్పత్రి సిబ్బంది ఫోన్‌ చేసి విద్యార్థులను ఇళ్లకు పంపించారు. హైదరగూడలో వెంటనే కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఉమ్మడి జిల్లాలో 44 మందికి పాజిటివ్‌

శనివారం ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 26 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలోనే 26 కేసులు వచ్చాయి. సిద్దిపేట జిల్లాలో పది కేసులు నమోదవగా, మెదక్‌ జిల్లాలో 8 కేసులు నమోదయ్యాయి.  సంగారెడ్డి జిల్లాలో 417 మందికి ర్యాపిడ్‌ యాంటిజెన్‌ టెస్టులు నిర్వహించగా పటాన్‌చెరు పరిధిలో ఉన్న ఎనిమిది మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. ముత్తంగి గురుకులంలో 18 మందికి వచ్చింది. మెదక్‌ జిల్లా వ్యాప్తంగా 254 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా తూప్రాన్‌లో 3, హావేళీఘణపూర్‌లో 3, మెదక్‌లో 2 కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. 


సిద్దిపేట జిల్లాలో వెంటిలేటర్‌పై ఇద్దరు కరోనా షేషెంట్లు 

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, డిసెంబరు 4 : ప్రస్తుతం ఒమైక్రాన్‌ వేరియంట్‌తో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సిద్దిపేట జిల్లాలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు క్రమక్రమంగా పెరుగుతూ రావడం ఆందోళనను కలిగిస్తున్నది. గడిచిన నాలుగైదు నెలలుగా రోజుకు ఒకట్రెండు పాజిటివ్‌ కేసులు మాత్రమే నమోదవుతూ వచ్చాయి. తాజాగా శనివారం సిద్దిపేట జిల్లాలో 10 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.  

సిద్దిపేట ఆస్పత్రిలో కలకలం..

సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం 9 మంది పేషెంట్లు జాయినయ్యారు. వీరంతా కూడా  రెండురోజుల్లో చేరినవారే కావడం గమనార్హం. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వీరికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. మరో ఐదుగురికి ఆక్సిజన్‌ అమర్చి చికిత్స చేస్తున్నారు. నిన్నమొన్నటి వరకు ఇదే ఆస్పత్రిలో ఒక్క కరోనా పాజిటివ్‌ కేసు కూడా లేదు. పాజిటివ్‌ వచ్చినా హోం క్వారంటైన్‌లో ఉంటూ చికిత్స పొందేవారు. కానీ తాజాగా ఆస్పత్రిలో అడ్మిట్లు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాల్సిన ప్రజల్లో చైతన్యం కానరావడం లేదు. మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండానే కనిపిస్తున్నారు. గడిచిన రెండ్రోజులుగా పోలీసులు సైతం మాస్కులపై అవగాహన కల్పిస్తున్నారు. మాస్కులు లేని వారికి రూ. వెయ్యి ఫైన్‌ వేస్తామని హెచ్చరిస్తున్నారు. అంతేగాకుండా జిల్లాలో వ్యాక్సినేషన్‌ శాతం పెంచడంపై దృష్టి పెట్టారు. జిల్లా వ్యాప్తంగా 7,133,13 మందికి వ్యాక్సిన్‌ వేయడానికి టార్గెట్‌ పెట్టుకోగా ఇందులో మొదటి డోసు 6,37,051 మందికి, రెండోడోసు 3,29,730 మందికి వేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందిస్తూ ఒమైక్రాన్‌ సంకేతాలపై అప్రమత్తంగా ఉండాలని, ఈ సమయంలో అజాగ్రత్తగా ఉండడం మంచిది కాదని జిల్లా ప్రజలకు సూచిస్తున్నారు. ఒకవేళ వైరస్‌ సోకితే భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని తెలిపారు.


అప్రమత్తంగా ఉండాలి : మెదక్‌ కలెక్టర్‌ హరీశ్‌

మెదక్‌ రూరల్‌, డిసెంబరు 4 : కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్‌ జిల్లా కలెక్టర్‌ హరీశ్‌ శనివారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. భయాందోళనలు వద్దని, జాగ్రత్తలు పాటించి జయిద్దామని పిలుపునిచ్చారు. కరోనా కట్టడికి, రక్షణ పొందేందుకు మన చేతిలో ఉన్న ప్రధాన అస్ర్తాలు మాస్క్‌, వ్యాక్సిన్‌ అని, ప్రతిఒక్కరూ రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. మెదక్‌ జిల్లాలో 7,67,248 మంది జనాభాకుగాను 18 ఏళ్లు పైబడిన వారు 5,48,340 మంది ఉన్నట్లు గుర్తించి లక్ష్యానికి మించి 5,54,827 మందికి మొదటిడోసు టీకా అందించామన్నారు. రెండోడోసు 2,40,905 మంది అనగా 43.42 శాతమే తీసుకున్నారని తెలిపారు. మొదటి డోసు తీసుకుని 84 రోజులు పూర్తయినవారు రెండోడోసు తీసుకోవాలన్నారు. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వారికి ప్రాణాపాయం ఉండదని, కరోనా వచ్చినా స్వల్ప లక్షణాలతో వెళ్లిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా 22 నాటికి అన్ని జిల్లాల్లో వ్యాక్సినేషన్‌ పూర్తికావాలని లక్ష్యంగా నిర్దేశించిందని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఒమైక్రాన్‌ వేరియంట్‌  డెల్టా కంటే ఆరు రెట్లు వేగంగా వ్యాపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిందన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలన్నారు. అలాగే వ్యాపార సముదాయాల్లో, షాపింగ్‌మాల్స్‌లో తిరిగే జనాలతో పాటు వ్యాపార యజమానులు కూడా మాస్కు ధరించాలని తెలిపారు. లేకపోతే రూ.1000 జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఒమైక్రాన్‌ను దృష్టిలో ఉంచుకుని గతంలో ఇచ్చిన కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. 

Updated Date - 2021-12-05T04:47:19+05:30 IST