Abn logo
Jul 29 2021 @ 23:27PM

‘కరోనా కాలం కథలు’ భేష్‌

ఓరుగల్లు రచయిత్రులకు ఉప రాష్ట్రపతి ప్రశంసలు


వరంగల్‌ కల్చరల్‌, జూలై 29: ఓరుగల్లుకు చెందిన రచయిత్రులు కొమర్రాజు రామలక్ష్మి, అ నిశెట్టి రజితను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయు డు అభినందించారు. మహిళా సాధికారతకు అద్దం పడుతూ కరోనా సమయంలో శతాధిక రచయిత్రుల కలం నుంచి జాలువారిన కథలను ఒకచోట చేర్చి ‘కరోనా కాలం కథలు’ శీర్షిక తో పంపిన పుస్తకాన్ని ఉపరాష్ట్రపతి పరిశీలించి అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఈ ఇద్దరు రచయిత్రులకు రాసిన లేఖలో తెలుగు సాహిత్యంలో రచనలు చేస్తున్న మహిళల సం ఖ్య నానాటికి పెరుగుతోందని, ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ప్రాచీన సాహిత్యంలో రచయితలు, రచయిత్రుల పాత్ర నామమాత్రమనే అపోహను పటాపంచలు చేసిందని అన్నారు. ఈ పరిణామం త నకెంతో సంతోషానిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కరోనా విశ్వమానవాళిపై చూపించిన ప్రభావం, తదనంతర పరిస్థితులు, కరోనా సమయంలో సామాన్యుల నుంచి మానవతావాదుల వరకు ఉదాత్త భావనతో సమాజానికి తన వంతు సహాయం చేయడం మన బాధ్యత అని ఆ లేఖలో గుర్తుచేశారు. లాక్‌డౌన్‌, వర్క్‌ ఫ్రమ్‌ హోం తదితర అంశాలను స్పృశిస్తూ సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, కుటుంబ విలువలను ప్రస్తావిస్తూ పలు కథలు, కథనాలను చాలా చక్కగా ఆవిష్కరించారని ప్రశంసించారు. ఈ పుస్తకానికి అనిశెట్టి రజిత, కొమర్రాజు రామలక్ష్మి, బండారి సుజాత సంపాదకత్వం వహించగా తిరునగరి దేవకీదేవి గౌరవ సంపాదకులుగా, మురాడి శ్యామల, తమ్మెర రాధిక సహ సంపాదకులుగా వ్యవహరించారు.