కరోనా కల్లోలం

ABN , First Publish Date - 2021-04-12T05:26:07+05:30 IST

గత ఏడాది వణికించిన..

కరోనా కల్లోలం

11 రోజుల్లో 1,181 పాజిటివ్‌లు

గత రెండు నెలల కన్నా రెట్టింపునకు పైగా నమోదు

అంతటా విస్తరిస్తున్న మహమ్మారి

కట్టడి చర్యలపై యంత్రాంగం దృష్టి

మాస్క్‌లపై అవగాహనలో పోలీసులు 


ఒంగోలు(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా మరోసారి  కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసులు పెరిగిపోతుండటం అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. పైకి లక్షణాలు కన్పించకుండా వందల సంఖ్యలో వెలుగు చూస్తున్న పాజిటివ్‌లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈనెలలో ఇప్పటి వరకూ 1,181  కేసులు నమోదవడం వైరస్‌ ఉధృతిని తెలియజేస్తోంది. గత ఫిబ్రవరి, మార్చి రెండు నెలల్లో కలిపి వచ్చిన కేసులకంటే ఈ 11 రోజుల్లో నమోదైనవి రెట్టింపు కన్నా అధికంగా ఉన్నాయి.  అందులో ఆదివారం ఒక్కరోజే 215 కేసులు వెలుగు చూశాయి. జిల్లాలోని అన్ని చోట్లా కేసులు నమోదవుతున్నప్పటికీ జనం రద్దీ అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో అధికంగా ఉంటున్నాయి. దీంతో కరోనా కట్టడి చర్యలపై యంత్రాంగం దృష్టి సారించింది. అదే సమయంలో మాస్క్‌లు, ఇతర నివారణ చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు.  


జిల్లా ప్రజలను గత ఏడాది వణికించిన కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. జనవరి, ఫిబ్రవరిల్లో శాంతించిన మహమ్మారి ఇప్పుడు స్వైర విహారం చేస్తోంది. ఈనెలలో ఇప్పటి వరకూ నమోదైన కేసులు అందుకు అద్దం పడుతున్నాయి.  జిల్లాలో గత ఏడాది మార్చి 19న తొలికేసు నమోదైంది. అనంతరం ఇప్పటి  వరకూ మొత్తం 63,520 మందికి వైరస్‌ సోకింది. అందులో 61,887 మంది కోలుకోగా 588మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 1045మంది చికిత్స పొందుతున్నారు.


గత నెలలో 412.. ఈ నెలలో 1181 కేసులు

గత ఏడాది డిసెంబర్‌ వరకూ తీవ్రంగా ఉన్న వైర్‌సవ్యాప్తి ఈ ఏడాది జనవరి నుంచి తగ్గుముఖం పట్టింది. అలా జనవరిలో 142 కేసులకు, ఫిబ్రవరిలో కేవలం 31 కేసులకు పరిమితం కావడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. తిరిగి మార్చి ఆఖరుకు 412 కేసులు నమోదయ్యాయి. ఈనెలలో మరింత ఉధృతమవుతోంది. గత వారం రోజులుగా నిత్యం కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈనెల 1 నుంచి 11వతేదీ వరకు 11 రోజుల్లో ఏకంగా 1,181 కేసులు నమోదయ్యాయి. అంటే గత ఫిబ్రవరి, మార్చి రెండు నెలల్లో వచ్చిన కేసుల కన్నా ఈ పది రోజుల్లోనే అంతకు రెట్టింపు స్థాయిలో నమోదు కావడం జిల్లాలో కరోనా కరాళనృత్యం చేస్తుందన్న విషయాన్ని తెలియజేస్తోంది. 


అధికారులు అప్రమత్తం 

మరోసారి కరోనా పడగ విప్పడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే ఒంగోలులోని రిమ్స్‌లో తిరిగి కరోనా చికిత్స వార్డును ప్రారంభించి బాధితులకు వైద్యం చేస్తున్నారు. దాదాపు 250 మంది వరకూ అక్కడే చికిత్స పొందుతున్నారు. రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మందికి చికిత్సలు అవసరమన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలల్లో గతంలో వలే చికిత్సల కోసం చర్యలు చేపట్టారు. ఇందుకోసం కీలక అధికారులు, ప్రధానమైన ప్రైవేటు వైద్యశాలల ప్రతినిధులతో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ స్థానిక రిమ్స్‌లో శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.  మెరుగైన వైద్యం అందించేలా అన్ని ఆస్పత్రుల్లో చర్యలకు ఆదేశించారు. శనివారం సాయంత్రం ఎస్పీ సిద్ధార్థ కౌశల్‌ ఒంగోలు మంగమూరు రోడ్డు జంక్షన్‌ వద్ద మాస్కులపై ప్రజలకు  అవగాహన కల్పించడంతో పాటు, చట్టపరమైన చర్యలపై హెచ్చరికలు చేశారు.


ఒంగోలులో 21 కంటైన్మెంట్‌ జోన్లు

నగరంలో కొవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పాజిటివ్‌లు వెలుగు చూసిన ప్రాంతాలకు 200 మీటర్ల పరిధిని కంటైన్మెంట్‌ జోన్‌గా నిర్ణయించారు. ఆమేరకు 19 ప్రాంతాలను కంటైన్మెంట్‌ జోన్లుగా ప్రకటించారు. అందులో ఒంగోలులోని ఏకలవ్యనగర్‌, జిల్లా జైలు ప్రాంతం, రామనగర్‌, సత్యనారాయణపురం, ఆశ్రమం, పత్తివారివీధి, గద్దలగుంట,శివప్రసాద్‌ కాలనీ, శ్రీనగర్‌ కాలనీ, సుజాత నగర్‌, నిర్మల్‌ నగర్‌, ముక్తినూతలపాడు, సమతానగర్‌ ఉన్నాయి. వీటితోపాటు గోపాల్‌ నగరం, బలరాం కాలనీ, రాజాపానగల్‌రోడ్డు, ప్రగతినగర్‌, ఇందిరమ్మ కాలనీ, భాగ్యనగర్‌, కొప్పోలు, పెళ్లూరులను కూడా కంటైన్మెంట్‌ జోన్‌ పరిధిలో చేర్చారు. 


నేతలను వణికిస్తున్న వైరస్‌

జిల్లాలో కరోనా మహమ్మారి వివిధస్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, రాజకీయ నేతలను చుట్టుముడుతోంది. దీంతో కుటుంబాలకు కుటుంబాలు వైద్యశాలల్లో చేరడంతోపాటు, హోంక్వారంటైన్‌లో ఉండిపోతున్నారు. ఇప్పటికే నియోజకవర్గస్థాయి నుంచి గ్రామ స్థాయి వరకూ ఉన్న నేతల్లో వందల మంది హౌస్‌ క్వారంటైన్‌కు చేరారు. వారితోపాటు, మిగిలిన నేతలూ వణికిపోతున్నారు. ఇటీవల పరిషత్‌ ఎన్నికలు జరగడం, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం, కిందిస్థాయిలో అనుచరులు, నాయకులు ఏర్పాటు చేసే వివిధ ఫంక్షన్లకు హాజరు కావడం వంటి కార్యక్రమాలతో వీరంతా కొవిడ్‌ బారిన పడ్డట్లు అర్థమవుతుంది. ఒక ముఖ్యనేతకు పాజిటివ్‌ వస్తే అతనితో ఉన్న వారికి శరవేగంగా వైరస్‌ వ్యాపిస్తోంది. ఒకరి నుంచే సుమారు 30 మందికి  సోకుతున్నట్లు అంచనా వేస్తున్నారు. గతంలో ఈ స్థాయిలో  వైరస్‌ వ్యాపించలేదని డాక్టర్లు అంచనా వేస్తున్నారు. అలాగే కుటుంబంలో ఒకరు వైరస్‌ బారిన పడితే అందరికీ పాజిటివ్‌ ఫలితం రావడం ఈసారి మరో ప్రత్యేకతగా కనిపిస్తోంది. వీటన్నింటికీ కనీస జాగ్రత్తలు లేకపోవడమే కారణమని భావిస్తున్నారు. 


పలువురు ప్రజాప్రతినిధులకు పాజిటివ్‌

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌కు కరోనా సోకడంతో హైదరాబాద్‌లోని వైద్యశాలలో చికిత్స పొందారు. ప్రసుత్తం ఆయన తన నివాసంలోని క్వారంటైన్‌లో ఉన్నారు. ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కూడా పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌ ఫలితం వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న దామచర్ల సత్యకు కూడా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఒంగోలులోని ఓ కార్పొరేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. ఆయన కుటుంబంలోనే మరొకరికి కూడా వైరస్‌ ఉన్నట్లు తేలిందని సమాచారం. వీరితోపాటు  దర్శి మాజీ ఎమ్మల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డితోపాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు వైరస్‌ బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. చీమకుర్తిలో ఆయనతో ఉండే నేతలు, కార్యకర్తలు పలువురురు కొవిడ్‌ బారిన పడ్డారు. చీమకుర్తిలోని ఓ నేత మృతి కూడా ఆందోళన రేకెత్తిస్తోంది. సుమారు 48 ఏళ్ల వయసు ఉన్న ఆ నాయకుడికి ఎలాంటి దురలవాట్లు లేవు. పది రోజుల క్రితం వ్యాక్సిన్‌ కూడా వేయించుకున్నారు. సమీపంలో ఉన్న వారికి పాజిటివ్‌ రావడంతో ఆయన పరీక్ష చేయించుకున్నాడు. వైరస్‌ ఉన్నట్లు తేలిని కొంతసేపటికే గుండెపోటుతో మృతి చెందాడు. తీవ్ర భయాందోళనలే కారణమని కూడా భావిస్తున్నారు.


హోం క్వారంటైన్‌లో నేతల వ్యక్తిగత సిబ్బంది

నేతలతోపాటు తిరిగిన వ్యక్తిగత సిబ్బంది, ద్వితీయ శ్రేణి నాయకుల్లో అనేక మందికి పాజిటివ్‌గా తేలడంతో హోం క్వారంటైన్‌కు వెళ్లారు. మరోవైపు జిల్లాలో ఆదివారం కూడా మరొకరు కరోనాకు గురై మృతి చెందినట్లు చెబుతున్నారు. పోలీస్‌ శాఖలోనూ కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. చీరాల రూరల్‌ సీఐతోపాటు అక్కడ ఎస్సై, తాళ్లూరు ఎస్సైతోపాటు ఆయా ప్రాంతాల్లో కానిస్టేబుళ్లు కరోనా బారిన పడ్డారు. 



Updated Date - 2021-04-12T05:26:07+05:30 IST