కరోనా మూడో దశకు ముందస్తు వ్యూహం

ABN , First Publish Date - 2021-06-17T09:04:38+05:30 IST

కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం క్రమేణా తగ్గుతోంది. దీంతో రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిపోతున్నాయి.

కరోనా మూడో దశకు ముందస్తు వ్యూహం

  • థర్డ్‌ వేవ్‌లో ఆస్పత్రుల పాలయ్యేవారిలో 5శాతం పిల్లలు.. 
  • ఆస్పత్రిలో చేరితే 10 రోజులు చికిత్స అవసరం
  • మరో 3-4 మాసాల్లో థర్డ్‌వేవ్‌కు చాన్స్‌
  • సెకండ్‌ వేవ్‌ కేసుల ఆధారంగా బెడ్ల పెంపు
  • పిల్లలకు చికిత్సపై కేంద్రం మార్గదర్శకాలు


హైదరాబాద్‌, జూన్‌ 16 (ఆంధ్రజ్యోతి): కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం క్రమేణా తగ్గుతోంది. దీంతో రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిపోతున్నాయి. స్కూళ్లు, కాలేజీలను మళ్లీ తెరవడానికి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు వచ్చే 3-4 నెలల్లో కరోనా మూడో దశ రావొచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో.. ఒకవేళ కేసులు మళ్లీ పెరిగితే కరోనాను ఎదుర్కోవడానికి అవసరమైన సన్నద్ధతను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా పిల్లలకు చికిత్స విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దృష్టిసారించింది. ప్రభుత్వ, ప్రైవేటు వ్యవస్థలు ఇప్పటినుంచే మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. 


 కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రభావం క్రమేణా తగ్గుతోంది. దీంతో రాష్ట్రాల్లో లాక్‌డౌన్‌ ఆంక్షలు తొలగిపోతున్నాయి. జాతీయ, అంతర్జాతీయ గణాంకాల ప్రకారం కరోనా మొదటి, రెండో వేవ్‌లలో ఆస్పత్రుల్లో చేరినవారిలో 1 నుంచి 2 శాతం మంది మాత్రమే పిల్లలున్నారు. అయితే మూడో వేవ్‌ వల్ల ఆస్పత్రుల పాలయ్యేవారిలో కనీసం 5శాతం మంది చిన్నారులు ఉండే అవకాశం ఉందని కేంద్రం హెచ్చరించింది. సీరో సర్వేలను అనుసరించి... ఒకవేళ రోజుకు లక్ష కేసులు నమోదైతే అందులో 20 ఏళ్లలోపువారు 12వేల మంది ఉంటారని, వీరిలో 5శాతం మంది (అంటే 600మంది) ఆస్పత్రుల పాలవుతారని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ అంచనా వేసింది. ఆస్పత్రిలో చేరిన చిన్నారులకు కనీసం పదిరోజుల పాటు చికిత్స అవసరం అవుతుందని అందులో వెల్లడించింది. 


అంటే రోజుకు 600 చొప్పున పది రోజులకు 6వేల బెడ్లు అవసరమని, అందులో 3,600 ఆక్సిజన్‌ బెడ్లు, 2,400 ఐసీయూ, వెంటిలేటర్‌ బెడ్లు అవసరమవుతాయని అంచనా వేసింది. ఈ ప్రకారం ఒకవేళ రోజుకు 50వేల కేసులే వస్తే, 300 బెడ్లు, 20వేల కేసులొస్తే 120 బెడ్లు, 10వేల కేసులొస్తే 60 బెడ్లు అవసరమవుతాయని వెల్లడించింది. అయితే ఆస్పత్రుల పాలయ్యే కేసుల్లో 40శాతం మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతారని, 60శాతం మాత్రమే ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తారని కేంద్రం అంచనా వేసింది.  ఆ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల కోసం వైద్య సౌకర్యాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సీరో సర్వే డేటా ఆధారంగా చూస్తే.. 10ఏళ్లు దాటిన పిల్లల్లోనూ పెద్దలతో సమానంగా పాజిటివిటీ కనిపించినట్లు పేర్కొంది. ఈ సందర్భంగా.. అమెరికాలో మూడోవేవ్‌లో నమోదైన మొత్తం కేసుల్లో 14 నుంచి 24 శాతం మంది పిల్లలు ఉన్నట్టు కేంద్రం ప్రస్తావించింది.


పిల్లలకు ఆ మందులు వాడొద్దు..

కొవిడ్‌కు చికిత్సలో భాగంగా పెద్దవారికి ఉపయోగిస్తోన్న ఔషధాలను పిల్లలకు వాడకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఐవర్‌మెక్టిన్‌, హైడ్రాక్సీక్లోరోక్విన్‌, ఫ్యావిపిరవిర్‌, డాక్సీసైక్లిన్‌, అజిత్రోమైసిన్‌ ఔషధాలు పిల్లల కోసం ఉద్దేశించినవి కాదని తెలిపింది. పిల్లలపై ఈ ఔషధాలను ఇంకా టెస్ట్‌ చేయనందున కొవిడ్‌కు చికిత్స అందించే క్రమంలో వాటిని వాడొద్దని పేర్కొంది. సెకండ్‌ వేవ్‌లో జిల్లా స్థాయిలో పిల్లల్లో నమోదైన గరిష్ఠ కేసుల సంఖ్య ఆధారంగా.. భవిష్యత్తులో కేసుల పెరుగుదలపై అంచనాకు రావాలని, తదనుగుణంగా బెడ్ల సంఖ్య పెంచాలని సూచించింది. పిల్లల కోసం ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా కొవిడ్‌ విభాగాలను ఏర్పాటుచేయాలని, వారి తల్లిదండ్రులు కూడా అక్కడే ఉండటానికి   అనుమతించాలని, ఆ మేరకు సౌకర్యాలు కల్పించాలని కేంద్రం సూచించింది. కొవిడ్‌ తర్వాత పిల్లల్లో వచ్చే మల్టీ సిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌ (ఎంఐఎ్‌స-సీ) చికిత్సను కూడా అదే ఆస్పత్రిలో అందించాలని పేర్కొంది. పిల్లల్లో ఎక్కువమందికి వ్యాధి లక్షణాలు బయటపకడపోవచ్చని, అలాంటివారిని ఇంటివద్దే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందించవచ్చని తెలిపింది. ఆరోగ్యంగా ఉండే పిల్లల్లో వ్యాధి తీవ్రత చాలా తక్కువని పేర్కొంది. ఇతర వ్యాధులు (కోమార్బిడిటీస్‌) ఉన్న పిల్లల్లో కొవిడ్‌ తీవ్రత ఎక్కువగా ఉండొచ్చని వెల్లడించింది. చిన్నారులకు కూడా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత.. కోమార్బిడిటీస్‌ ఉన్నవారిని గుర్తించి వారికి త్వరగా వ్యాక్సినేషన్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపింది. 


తెలంగాణలో ఎన్ని బెడ్లు అవసరమంటే..

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి.. పిల్లల కోసం తెలంగాణలో కనీసం 6వేల నుంచి 10వేల వరకు పడకలు అవసరం అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 6వేల పడకలను సిద్దం చేస్తోంది. హైదరాబాద్‌లో 1,500 బెడ్లు, జిల్లాల్లో 4,500 బెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. నీలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారులకు కొవిడ్‌ చికిత్స కోసం 1,000 పడకలను సిద్దం చేస్తున్నారు. ప్రభు త్వ బోధనాస్పత్రుల్లో 200 బెడ్లు, జిల్లా ఆస్పత్రుల్లో 100, ఏరియా ఆస్పత్రుల్లో 50 పడకలతో పిల్లల కొవిడ్‌ వార్డులను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2021-06-17T09:04:38+05:30 IST